డామిట్‌.. కథ అడ్డం తిరిగింది..!

Thieves Arrested  In Karimnagar - Sakshi

గోదావరిఖని(రామగుండం): వారిది రాష్ట్రం కాని రాష్ట్రం... ఏళ్లక్రితం మంచిర్యాలకు వచ్చి స్థిరపడ్డారు. తన బావ దొంగతనాలకు పాల్పడితే.. తన భార్య సాయం అందించేదని పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో తనభార్యను ఎలాగైనా విడిపించాలని దొంగసొమ్మును విక్రయించడానికి వెళ్తున్న ఓ వ్యక్తిని రామగుండం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అతడి వద్ద రూ.5.12 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. రామగుండం పోలీస్‌కమిషనరేట్‌లో అడి షనల్‌ డీసీపీ(అడ్మిన్‌) అశోక్‌కుమార్‌ శుక్రవారం నిందితుడి అరెస్ట్‌ చూపారు. ఈ సందర్భంగా వివరాలు వెల్లడించారు.

ఒడిశా రాష్ట్రంలోని ధర్మఘడ్‌ జిల్లా కుర్రు గ్రామానికి చెందిన మంగరాజు దూల(48), అతడి భార్య దాలు ముప్పై ఏళ్లుగా మంచిర్యాల జిల్లా కేంద్రం గాంధీనగర్‌లోని తన బావ శెట్టి విజయ్‌ వద్ద ఉంటున్నారు. విజయ్‌ గతంలో చోరీలు చేసేవాడు. ఆ సొత్తును దూల దంపతుల వద్ద ఉంచేవాడు. రెండుమూడు సార్లు చోరీ చేసిన సొత్తును పోలీసులకు చిక్కకూడదని దూలకు ఇచ్చాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో శెట్టి విజయ్‌ మంచిర్యాల పోలీసులకు చిక్కా డు. అతడికి సాయం చేస్తోందని దూల భార్య దాలును కూడా అరెస్ట్‌ చేశారు. తనను కూడా పోలీసులు అరెస్ట్‌ చేస్తారనే భయం, సొత్తును మార్పిడి చేసి తన భార్యను విడిపించుకోవాలని పథకం పన్నాడు.
శుక్రవారం మధ్యాహ్నం సొత్తును గోదావరిఖనిలో విక్రయించడానికి వస్తున్నాడన్న పక్కా సమాచారంతో బస్టాండ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద రూ.5.12 లక్షలు విలువచేసే 18 తులాల బంగారం, 21తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో అడిషనల్‌ డీసీపీ లా అండ్‌ ఆర్డర్‌ రవికుమార్, సీసీఎస్‌ ఏసీపీ చంద్రయ్య, ఏసీపీ (సీఎస్బీ)పోలు రమేష్‌బాబు, టాస్క్‌ఫోర్స్‌ సీఐ బుద్ద స్వామి, సీఐలు నరేష్, శ్రీనివాసరావు, ఎస్సైలు రమేష్, సమ్మయ్య ఉన్నారు.
Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top