హోంవర్క్‌ చేయలేదని..

Teacher beaten Students Did't Home Work - Sakshi

నలుగురు విద్యార్థులకు దండన

వాతలు వచ్చేలా కొట్టిన ఉపాధ్యాయుడు

ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు

స్టేషన్‌ ఘన్‌పూర్‌ గురుకుల పాఠశాలలో ఘటన

విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు విచక్షణ మరిచాడు.. మనిషిననే విషయాన్ని మరిచి పశువులా ప్రవర్తించాడు.. పసి పిల్లలని కూడా చూడకుండా చితకబాదాడు. హోంవర్క్‌ చేయలేదని కోపంతో నలుగురు విద్యార్థులను ఓ ఉపాధ్యాయుడు ఇష్టమొచ్చినట్లు కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

స్టేషన్‌ ఘన్‌పూర్‌: జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ స్థానిక మహాత్మా జ్యోతాబాపూలే ప్రభుత్వ బీసీ బాలుర గురుకుల పాఠశాలలో హోంవర్క్‌ చేయలేదనే కారణంగా నలుగురు విద్యార్థులను ఓ ఉపాధ్యాయుడు చితకబాదిన ఘటన ఐదు రోజుల క్రితం జరుగగా, సోమవారం వెలుగులోకి వచ్చింది. తమ పిల్లలను ఉపాధ్యాయుడు తీవ్రంగా కొట్టాడని తెలుసుకున్న తల్లిదండ్రులు సోమవారం పాఠశాలకు చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. సముద్రాల గ్రామానికి చెందిన భాస్కుల ప్రేమ్, జఫర్‌గడ్‌ మండలం íహిమ్మత్‌నగర్‌కు చెందిన అనుముల సాయికిరణ్, బి.నితిన్, సందీప్‌ స్థానిక ప్రభుత్వ బీసీ బాలుర గురుకుల పాఠశాలలో 7వతరగతి చదువుతున్నారు.

ఈ క్రమంలో పాఠశాలలలో హిందీ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న నవీన్‌ ఐదు రోజుల క్రితం పిల్లల హోంవర్క్‌లను పరిశీలించాడు. ప్రేమ్, సాయికిరణ్, నితిన్, సందీప్‌లు హోంవర్కు చేయకపోవడంతో ఆగ్రహంతో వారిని పీవీసీ ప్లాస్టిక్‌ పైప్‌తో చేతులు, కాళ్లు, తొడలపై కొట్టాడు. దాంతో విద్యార్థుల తొడలపై తీవ్రంగా వాతలు వచ్చాయి. అయితే ఉపాధ్యాయుడికి భయపడిన విద్యార్థులు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేదు. కాగా పిల్లలను చూసి వెళ్దామని పాఠశాలకు వచ్చిన ప్రేమ్‌ తల్లిదండ్రులు యాదగిరి, రేణ, సాయికిరణ్‌ తండ్రి అనుముల సోమయ్య విద్యార్థుల తొడలపై ఉన్న వాతలు చూసి విషయం తెలుసుకున్నారు. పాఠశాల సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడు సోమవారం సెలవులో ఉన్నాడు.

పాఠశాలను సందర్శించిన డీటీ
విద్యార్థులను టీచర్‌ కొట్టిన విషయమై తల్లిదండ్రులు ఆర్‌డీఓ రమేష్‌కు ఫిర్యాదు చేయగా.. ఆయన ఆదేశాల మేరకు డిప్యూటీ తహసీల్దార్‌ రాజు పాఠశాలను సందర్శించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఓను ఆదేశించారు.

ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలి..
విచక్షణరహితంగా విద్యార్థులను పైప్‌తో చితకబాదిన ఉపాధ్యాయుడు నవీన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. ఈ విషయమై పాఠశాల ఎస్‌ఓ(స్పెషల్‌ ఆఫీసర్‌) మల్లయ్యతో వారు వాగ్వాదానికి దిగారు. పిల్లలు హోంవర్క్‌ చేయకుంటే నోటితో బెదిరించాలని, చదువులో వెనుకబడితే పేరెంట్స్‌ దృష్టికి తీసుకురావాలన్నారు. కానీ అలా కాకుండా పిల్లలను కొట్టే హక్కు అతడికి ఎవరు ఇచ్చారని, ఇలాంటి చర్యలు పునరావృతమైతే సహించేది లేదన్నారు. అతడిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటాం
విద్యార్థులను దండించవద్దని, నోటితో బెదిరించాలని ఉపాధ్యాయులకు పదేపదే సూచిస్తుంటా. ఏడో తరగతి విద్యార్థులను హిందీ ఉపాధ్యాయుడు నవీన్‌ దండించిన విషయం ఆదివారం తెలిసింది. ఈ విషయమై అతడిని ఫోన్‌లో మందలించాను. బంధువుల వివాహం ఉందని సోమవారం అతడు సెలవు పెట్టాడన్నారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అతడిపై తగిన చర్యలు తీసుకుంటా. – మల్లయ్య, పాఠశాల స్పెషల్‌ ఆఫీసర్‌

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top