వలంటీర్లపై మూకుమ్మడి దాడి | Sakshi
Sakshi News home page

వలంటీర్లపై మూకుమ్మడి దాడి

Published Sat, May 23 2020 5:24 AM

TDP Leaders Attack On Grama Volunteer - Sakshi

శ్రీకాళహస్తి రూరల్‌ (చిత్తూరు జిల్లా): మాజీ మంత్రి, టీడీపీ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనుచరుల దాడిలో ముగ్గురు గ్రామ వలంటీర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం మన్నవరంలో చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి రూరల్‌ సీఐ గుడికాటి విజయ్‌కుమార్‌ కథనం మేరకు.. మన్నవరం పంచాయతీలో కొల్లం వంశీ (21), సి.జయప్రకాష్‌ (24), సి.శ్రీనివాసులు (24) గ్రామ వలంటీర్లుగా పనిచేస్తున్నారు. విధులు నిర్వహించడానికి వారు గురువారం పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లారు. అప్పటికే స్థానిక టీడీపీ నేత, శ్రీకాళహస్తి మార్కెట్‌ యార్డ్‌ మాజీ చైర్మన్‌ రంగినేని చెంచయ్య నాయుడు పంచాయతీ కార్యాలయానికి తాళాలు వేసి తీసుకుపోయాడు.

తాళాలు అడిగినా ఇవ్వలేదని చెంచయ్య నాయుడుపై వలంటీర్లు ఎంపీడీవో బాలాజీ నాయక్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో రెచ్చిపోయిన చెంచయ్య నాయుడు, అతడి అనుచరులు వలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చిన సెల్‌ఫోన్లు లాక్కుని వెళ్లిపోయారు. ఎంపీడీవో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తుండగా.. మరోమారు టీడీపీ నేతలు చెంచయ్య నాయుడు, రాంబాబు నాయుడు, చెంచుకృష్ణయ్య, వెంకటేశ్వరావు, శ్రీనివాసులు, శివ తదితరులు మూకుమ్మడిగా వలంటీర్లపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ వలంటీర్లు రక్షించాలంటూ ఆర్తనాదాలు చేయడంతో వైఎస్సార్‌సీపీ కార్యకరలు.. చెంచయ్య నాయుడు, కోటి, నరేష్‌ దాడులకు పాల్పడుతున్న వారిని అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ నేతలు వారిపై కూడా దాడికి దిగారు. టీడీపీ నేతల దాడిలో గాయపడ్డవారిని స్థానికులు శ్రీకాళహస్తిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
వలంటీర్‌గా పనిచేస్తున్న తనను కులం పేరుతో దూషించి, దాడి చేశారని కొల్లం వంశీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దాడి చేసిన రంగినేని చెంచయ్యనాయుడు, రాంబాబు నాయుడు, తదితరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ విజయ్‌కుమార్‌ తెలిపారు. వలంటీర్ల విధులకు ఆటంకం కలిగించారంటూ ఎంపీడీవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కాగా, విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా తమపై విచక్షణారహితంగా దాడులు చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని వలంటీర్లు తెలిపారు. గ్రామంలోకి వెళ్తే తమను చంపే ప్రమాదం ఉందని విలపించారు.

Advertisement
Advertisement