భైంసాలో ఓ మిఠాయి వ్యాపారి నిర్వాకం

Sweets Merchant Escaped With Money In Aadilabad - Sakshi

సాక్షి,  భైంసా(ఆదిలాబాద్‌) : దాదాపు ఏడెనిమిదేళ్లుగా స్థానికంగా వ్యాపారం నిర్వహిస్తూ అందరి వద్ద సుమారు రూ. 20 లక్షలపైన అప్పులు చేసి ఓ వ్యాపారి ఉడాయించినట్లు భైంసాలో పుకార్లు వ్యాపించాయి. భైంసా పట్టణంలోని బోయిగల్లి ప్రాంతంలో మిఠాయిల దుకాణం నిర్వహిస్తున్న ఓ వ్యాపారి గత కొంత కాలంగా అప్పుల వాళ్లకు డబ్బులు చెల్లించకుండా తిప్పుకుంటున్నాడని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో గత వారం రోజులుగా దుకాణానికి రావడం లేదని, రెండు రోజులుగా దుకాణం మూసి ఉండడంతో, దుకాణంలో పాలు పోసే వారు ఆదివారం దుకాణం వద్ద గుమిగూడారు. ఒక్కొక్కరికి రూ. లక్ష నుంచి రూ. 3లక్షల వరకు చెల్లించాల్సి ఉందని వారు వాపోయారు. అంతేకాకుండా సదరు వ్యాపారి తన చిన్న కుమారుడి సెల్‌ఫోన్‌కు అప్పుల బాధ తాళలేక చనిపోతున్నానంటూ మెసేజ్‌ పెట్టడంతో, అతని కుమారుడు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ నెల 1 న పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు.

హోటల్‌లో గుమాస్తా నుంచి..
నేరడిగొండ మండలం బుర్కపల్లి గ్రామానికి చెందిన వ్యాపారి కుటుంబం గత ఏడెమినిదేళ్ల క్రితం భైంసాకు వలస వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. మొదట్లో స్థానిక హోటల్‌లో స్వీట్లు చేసే పనికి కుదిరాడు. ఇక్కడి వారితో పరిచయాలు పెరగడంతో నాలుగేళ్ల క్రితం బోయిగల్లిలో సొంతంగా స్వీట్‌ దుకాణం ప్రారంభించాడు.

కానిస్టేబుల్‌నూ వదల్లేదు..
దుకాణం నడిపే క్రమంలో తెలిసినవాళ్ల వద్ద అప్పులు చేయడం ప్రారంభించాడు. తన దుకాణంలో పనిచేసే మాస్టర్‌(వంటవాడు) వద్దే రూ. 3.5 లక్షల వరకు అప్పు చేసినట్లు తెలుస్తోంది. తన యజమాని అడగడంతో వంటవాడు భార్య నగలు కుదువపెట్టి మరీ వ్యాపారికి అప్పు ఇచ్చినట్లుగా సమాచారం. దుకాణంలో పాత్రలు కడిగే మహిళ వద్ద రూ. 40 వేలు అప్పు తీసుకున్నట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు.ఇక ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారుల వద్ద, తెలిసిన వారి నుంచి దొరికిన చోటల్లా అప్పులు చేసినట్లు చెబుతున్నారు. భైంసా పట్టణానికి చెందిన ఓ కానిస్టేబుల్‌ వద్ద కూడా అప్పు చేసినట్లు స్థానికులు చెప్పారు. ఇక ఆయన దుకాణంలో పాలు పోసే వారు దాదాపు పదిమంది వరకు ఉన్నారు. వీరు ప్రతిరోజు 20 నుంచి 60 లీటర్ల వరకు పాలు పోసేవారని చెబుతున్నారు. పాలు పోస్తున్న తమకు మూడు నెలలుగా డబ్బులు ఇవ్వకుండా తిప్పుతున్నాడని వారు పేర్కొన్నారు. వారం రోజులుగా దుకాణంలో సదరు వ్యక్తి కనిపించకపోవడం, ఫోన్‌ చేసినా స్పందన లేకపోవడంతో తాము మోసపోయామని వాపోయారు.

అదృశ్యం కేసు నమోదు..
మిఠాయిల దుకాణం నిర్వహించే సదరు వ్యాపారి అప్పుల బాధ తాళలేక వెళ్లిపోతున్నానంటూ ఈ నెల 1 న తన కొడుకు సెల్‌ఫోన్‌కు వాట్సాప్‌లో వాయిస్‌ మెసేజ్‌ పెట్టాడని అతని కొడుకు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. ఇటీవలే కూతురి పెళ్లి కోసం తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడని తెలిపాడు. ఇక తన కోసం వెతకవద్దని, దుకాణం నడిపి అప్పులు తీర్చాలంటూ వాయిస్‌ మెసెజ్‌ పెట్టినట్లు ఫిర్యాదులో కుమారుడు పేర్కొనడంతో పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు.

మూడునెలలుగా  తిప్పుతున్నాడు
నేను గత మూడేళ్లుగా స్థానిక బోయిగల్లిలో మిఠాయి దుకాణంలో పాలు పోస్తున్నాను. నమ్మకంగా డబ్బులు ఇచ్చేవాడు. అయితే మూడు నెలలుగా మాత్రం డబ్బుల కోసం తిప్పుకున్నాడు. కూతురి పెళ్లి చేశానని, త్వరలో చెల్లిస్తానని చెప్పేవాడు. ప్రతిరోజు 30 లీ పాలు పోసేవాడిని. మూడునెలల బకాయిలు రావాల్సి ఉంది.
– రాజు, పాల వ్యాపారి, భైంసా

నమ్మకంతో పోసేవాళ్లం
మేం ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో పాలు పోసేవాళ్లం. రోజుకు 30 లీటర్ల వరకు పాలు తీసుకునేవాడు. నమ్మకంగా డబ్బులు చెల్లించేవాడు. అయితే గత కొద్ది నెలలుగా డబ్బులు ఇవ్వకుండా తిప్పుకున్నాడు. రేపు, మాపు అంటూ తిప్పి పంపేవాడు. మా లాగే ఇంకా కొందరికి డబ్బులు ఇవ్వలేదని చెబుతున్నారు.
– రాజేందర్, ప్రసాద్, భైంసా  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top