ఎర్రచందనం దుంగలు స్వాధీనం..విద్యార్థి అరెస్ట్‌

Student Was Arrested In Red Sandal Smuggling Case - Sakshi

తిరుపతి: ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడిన ఓ బీటెక్‌ విద్యార్థిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో భాగంగా వాహనానికి డ్రైవర్‌గా వచ్చి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. వివరాలు..మంగళవారం అర్ధరాత్రి కరకంబాడి అడవులలో కూంబింగ్‌ చేస్తున్న టాస్క్‌ఫోర్స్‌ ఆర్‌ఎస్‌ఐ విజయ్‌ నరసింహులు బృందానికి భూపాల్‌ నాయుడు కాలనీ వెనక టవేరా కారు కనిపించింది. ఆ కారు నెంబర్‌ ప్లేటు చూసి, ఆ నెంబర్‌ను వెబ్‌సైటల్‌లో చూడగా అది ఒక స్కూటర్‌ నెంబరని తేలింది. వెంటనే కారుని ఆపి తనిఖీలు చేశారు. కారుకు సమీపంలో నాలుగు ఎర్రచందనం దుంగలు ఉన్నాయి.

కారులో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడు. టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందిని చూసి మరో వ్యక్తి పారిపోగా..డ్రైవర్‌ పట్టుబడ్డాడు. డ్రైవర్‌ని విచారించగా..తన పేరు మేఘనాథన్‌ అని..తమిళనాడులోని వేలూరు జిల్లా రెడ్డిపాళయంకు చెందిన వాడినని వెల్లడించాడు. తనకు వేలూరులో హమీద్‌ అనే ట్రావెల్‌ యజమాని కారును తిరుపతికి తీసుకుని వెళ్లి అక్కడ మంగళం వద్ద మరో డ్రైవర్‌కు అప్పగించి రావాలని చెప్పి వెయ్యి రూపాయలు ఇచ్చినట్లు పోలీసులకు తెలిపాడు.

తనతో పాటు సతీష్‌ అనే వ్యక్తి వేలూరు నుంచి వచ్చినట్లు చెప్పాడు. సంఘటనాస్థలానికి ఎస్పీ రవిశంకర్‌ చేరుకుని స్మగ్లర్‌ను విచారించి కూంబింగ్‌ కొనసాగించాల్సిందిగా ఆదేశించారు. ఎర్రచందనం దుంగలను, కారును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top