ప్రతీకారంతోనే శ్రీనివాసులుపై హత్యాయత్నం

srinivas murder attempt mystery revealed - Sakshi

దర్యాప్తులో తేల్చిన పోలీసులు  

నలుగురు నిందితుల అరెస్టు  

కర్నూలు : కల్లూరుకు చెందిన దూపం జగదీష్‌ హత్యకు ప్రతీకారంగానే బుడగజంగాల శ్రీనివాసులు అలియాస్‌ ఎవోన్‌ శ్రీనుపై  హత్యాయత్నం జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈమేరకు గురువారం నిందితులు ప్యాపిలి మండలం మాన్‌దొడ్డి గ్రామానికి చెందిన దూపం రామకృష్ణ, దూపం రాముడు, దూపం జనార్ధన్, దూపం వేణుగోపాల్‌ను గుత్తి పెట్రోల్‌ బంకు వద్ద పోలీసులు  అరెస్ట్‌ చేశారు. ఈసందర్భంగా నేరానికి ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం తన కార్యాలయంలో కర్నూలు డీఎస్పీ ఖాదర్‌ బాషా నాలుగో పట్టణ సీఐ నాగరాజరావుతో కలసి వివరాలు వెల్లడించారు. శ్రీనివాసులు వెంకటరమణ కాలనీలోని ఈసీ ఎన్‌క్లేవ్‌లో నివాసముండేవాడు. ఇతడికి భార్య గిరిజ, ఇద్దరు కుమారులున్నారు.

గతంలో ఎవోన్‌ పేరుతో మినరల్‌ వాటర్‌ వ్యాపారం చేసేవాడు. కల్లూరుకు చెందిన దూపం రాముడు కుమారుడు జగదీష్‌ 2007లో హత్యకు గురయ్యాడు. ఇందులో శ్రీనివాసులు నిందితుడు. అయితే కోర్టులో హత్య కేసు వీగిపోయింది. దీంతో జగదీష్‌ బంధువులు శ్రీనివాసులుపై పగ పెంచుకున్నారు. ఈ క్రమంలో గత నెల 26న కల్లూరులోని రామాలయం వద్ద ప్రేమపెళ్లి విషయమై పంచాయితీ చేస్తుండగా నిందితులు ముఖానికి ముసుగులు ధరించి శ్రీనివాసులుపై మూకుమ్మడిగా దాడిచేసి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులును ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్‌కు తరలించారు. బాధితుడి తమ్ముడు శ్రీరాములు ఫిర్యాదు మేరకు నాలుగో పట్టణ పోలీసులు  నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top