కొడుకును కడతేర్చిన తండ్రి  | Son Killed by Father | Sakshi
Sakshi News home page

కొడుకును కడతేర్చిన తండ్రి 

Apr 3 2018 1:32 PM | Updated on Aug 16 2018 4:36 PM

 Son Killed by Father  - Sakshi

గంధసిరి ప్రభాకర్‌  మృతదేహం 

ఎర్రుపాలెం: కన్న కొడుకును తండ్రి హత్య చేసిన సంఘటన ఎర్రుపాలెం మండలం వెంకటాపురం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గంధసిరి లక్ష్మయ్య, ప్రభాకర్‌(30) తండ్రీ కొడుకులు. ఒకే ఇంట్లో ఉంటున్న ఇద్దరూ లారీ డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్నారు. రోజూ ఇద్దరు మద్యం సేవించి గొడవలకు దిగడం పరిపాటి. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఇద్దరూ గొడవపడ్డారు.

దీంతో మనస్తాపానికి గురైన తండ్రి లక్ష్మయ్య తన భార్యతో కలిసి అదే గ్రామంలోని ఓ ఇంట్లో తలదాచుకున్నాడు. అయితే ప్రభాకర్‌ భార్య అంజలితో మనస్పర్థలుండటంతో ఆమె ఐదు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా.. తండ్రి లక్ష్మయ్య అర్ధరాత్రి బహిర్భూమికి వెళ్తున్నానని భార్యకు చెప్పి.. కొడుకు ప్రభాకర్‌ నిద్రిస్తున్న సొంత ఇంటికి వచ్చాడు. గాఢ నిద్రలో ఉన్న కొడుకు తలపై కర్రతో తీవ్రంగా కొట్టాడు.

రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే ప్రభాకర్‌ మృతిచెందాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ప్రభాకర్‌ భార్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ ఆంజనేయులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేసి.. కేసు నమోదు చేశారు. మధిర సీఐ శ్రీధర్‌కి సమాచారం ఇవ్వడంతో ఆయన హత్య జరిగిన ప్రదేశానికి వచ్చి విచారించారు. హత్య కేసులో సమగ్రమైన దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీధర్‌ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement