విషాదం మిగిల్చిన ‘ఆదివారం’ 

Seven Persons Died In Mahabubnagar - Sakshi

వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురి దుర్మరణం

మిడ్జిల్‌ కారు బోల్తా ఘటనలో రెండేళ్ల కూతురు..

సాక్షి, మిడ్జిల్‌ (జడ్చర్ల):  మండలంలోని బోయిన్‌పల్లి గ్రామ సమీపంలోని జడ్చర్ల–కల్వకుర్తి ప్రధాన రహదారిపై ఆదివారం తెల్లవారుజామున కారు అదుపు తప్పి బోల్తా పడడంతో అందులోని చిన్నారి ఆర్య(2) మృతి చెందగా, తల్లి ప్రియదర్శినికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు వివరాలిలా.. బాదేపల్లి (జడ్చర్ల)కి చెందిన సుజీవన్‌ కుమార్‌ కల్వకుర్తిలో శుభకార్యం ముగిసిన తర్వాత శనివారం అర్ధరాత్రి  తన కారులో కల్వకుర్తి నుంచి భార్య ప్రియదర్శిని, కూతురు ఆర్యతో కలిసి బయలు దేరారు.

బోయిన్‌పల్లి గ్రామ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న చిన్నారి ఆర్య అక్కడికక్కడే మృతిచెందగా తల్లి ప్రియదర్శినికి తీవ్ర, సుజీవన్‌కు స్వల్ప గాయాలైనట్లు ఎస్‌ఐ రవి తెలిపారు. ఆదివారం ఉదయం సంఘటన స్థలాన్ని సీఐ శివకుమార్‌ పరిశీలించారు. చిన్నారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ఆస్పత్రికి తరలించిన్నట్లు ఆయన తెలిపారు.

కల్వర్టును ఢీకొట్టి వ్యక్తి..
మిడ్జిల్‌ మండలం వాడ్యాల్‌ గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున బైక్‌పై వెళ్తూ కల్వర్టును ఢీకొట్టిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఎస్‌ఐ రవి కథనం మేరకు వివరాలిలా.. నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిధిలోని ఊర్కోండ మండలం రాంరెడ్డిపల్లికి చెందిన ఆంజనేయులు (50) సొంత పనిమీద ఆదివారం ఉదయం జడ్చర్ల వైపు బైక్‌పై బయల్దేరాడు. ఈక్రమంలో వాడ్యాల్‌ గ్రామ శివారులోని జడ్చర్ల కల్వకుర్తి ప్రధాన రహదారిపైన ఉన్న కల్వర్టును ఢీకొట్టడంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడె మృతి చెందాడు.

ఇదిలా ఉండగా మృతిపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలానికి కొద్ది దూరంలో బైక్‌ ఉండడంతో ఎవరో హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించారని ఆరోపించారు. మృతుడి కుమారుడు శేఖర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జడ్చర్ల ఆస్పత్రికి తరలించారు. సీఐ శివకుమార్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

కారు, ఆటో ఢీకొని బాలుడు..
పెబ్బేరు (కొత్తకోట):
కారు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో 11ఏళ్ల బాలుడు దుర్మరణం చెందగా.. బాలుడి తండ్రితోపాటు ఆటో డ్రైవర్‌కు తీవ్రగాయాలైన సంఘటన పట్టణ సమీపంలోని బైపాస్‌ రోడ్డు వద్ద ఎన్‌హెచ్‌ 44పై ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాలిలా.. వనపర్తిలోని ఎన్‌టీఆర్‌ కాలనీకి చెందిన రమేష్, అతని కుమారుడు పృథ్వికుమార్‌ (11), బంధువు రాజు అలియాస్‌ అరవింద్‌ వనపర్తి నుంచి ఇటిక్యాల మండలం తిమ్మాపూర్‌కు సొంత ఆటోలో వెళ్తున్నారు.

అయితే హైదరాబాద్‌ నుంచి కర్నూల్‌ వైపు వేగంగా వెళ్తున్న ఓ కారు పెబ్బేరు బైపాస్‌ రోడ్డుపై ఈ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలోని బాలుడు పృథ్వికుమార్‌ అక్కడికక్కడే మృతిచెందగా.. రమేష్, అరవింద్‌కు తీవ్రగాయాలయ్యాయి. వీరిని వెంటనే 108 అంబులెన్స్‌లో మొదట వనపర్తికి.. అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. ఈమేరకు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని హెడ్‌కానిస్టేబుల్‌ కృష్ణారెడ్డి తెలిపారు. 

కారు, బైక్‌ ఢీకొన్న ఘటనలో యువకుడు..
కృష్ణా (మక్తల్‌): కారు, బైక్‌ ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మక్తల్‌ మండలం చందాపూర్‌ వద్ద ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలిలా.. మండలం లోని గుడెబల్లూర్‌కి చెందిన బొల్ల తాయప్ప(25) మక్తల్‌ నుంచి తమ స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వస్తుండగా మక్తల్‌ మండలం చందాపూర్‌ వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. తాయప్ప అక్కడికక్కడే మృతి చెందాడు.  మృతుడికి భార్య, కూతురు ఉంది.
బైక్‌ను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు..

కోస్గి (కొడంగల్‌):  ఇంటి నుంచి బయలు దేరిన ఓ వ్యక్తి నిమిషాల వ్యవధిలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మే రకు.. వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌పేట మండలం అల్లీఖాన్‌పల్లికి చెందిన కావలి ఎల్లప్ప(46) తన కోడలు వసంతకు దౌల్తాబాద్‌ మండలం ఈర్లపల్లిలో ఆయుర్వేద వైద్యం చేయించేందుకు  అల్లుడు దస్తప్పతో కలిసి బైక్‌పై ముగ్గురు బయల్దేరారు.

ఈ క్రమంలో మండలంలోని నాచారం చేరుకోగానే రోడ్డు మలుపు దగ్గర మహారాష్ట్ర నుంచి విజయవాడ వెళ్తున్న ఓ లారీ వేగంగా వెళ్తూ బైక్‌ను ఢీకొట్టడంతో ఎల్లప్ప తల లారీ టైర్ల కింద ఇరుక్కొని అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వసంత, దస్తయ్యలకు సైతం తీవ్రగాయాలుకాగా.. వీరిని మొదట స్థానిక ప్రభుత్వాస్పత్రికికి తరలించారు. ఎస్‌ఐ సంఘటన స్థ లానికి వెళ్లి పంచనామా నిర్వహించి లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొన్నారు.  ఈ సంఘనపై మృతుని భార్య మల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో యువకుడు..
అమ్రాబాద్‌ (అచ్చంపేట):
బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈఘటన పదర మండలం వంకేశ్వరంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలిలా.. పదర మండలం వంకేశ్వరానికి చెందిన రాజగిరి అంబరీష్‌(30), బద్రులు.. అంబరీష్‌ పొలంలో పండించిన బంతిపూలను వ్యాన్‌లో పంపి పదర నుంచి వంకేశ్వరానికి తిరిగి ద్విచక్రవాహనంపై బయల్దేరారు.

వంకేశ్వరం సమీపంలోని మలుపు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలతో అంబరీష్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. బైక్‌పైనున్న బద్రు, ఎదురు బైక్‌నున్న బద్రు అనే వ్యక్తి తలకు తీవ్రగాయాలు కాగా ఇరువురిని పదరలో ప్రథమ చికిత్సలు నిర్వహించి అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. మృతుడికి తండ్రి నారాయణ, తల్లి మల్లమ్మ ఉన్నారు.  
వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి..
ఉండవెల్లి (అలంపూర్‌):
వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఇటిక్యాలపాడు శివా రులో జాతీయ రహదారిపై ఆదివారం చో టుచేసుకుంది. ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపి న వివరాల ప్రకారం.. ఇటిక్యాలపాడు సమీ పంలో జాతీయ రహదారి డివైడర్‌పై గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. విషయాన్ని గుర్తించిన జాతీయ రహదారి సిబ్బంది పోలీ సులకు సమాచారం అందించగా.. వారు వెళ్లి పరిశీలించారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా మృతిచెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడు బూడిద రంగు షర్టు, నేరుడు రంగు నిక్కరు, నీలం, తెల్లని గీతలు ఉన్న లుంగీ ధరించాడని, ఆనవాళ్లు గుర్తించిన వారు ఉండవల్లి పోలీస్‌స్టేషనులో సంప్రదించాలని పేర్కొన్నారు. జాతీయ రహదారి సిబ్బంది శివప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి
ఊట్కూరు (మక్తల్‌):
విద్యుత్‌ పనులు చేస్తుండగా ప్రమాదవశవాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ కార్మికుడు మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని నాగిరెడ్డిపల్లి శివారులో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా.. నారాయణపేట మండలంలోని బోయిన్‌పల్లికి చెందిన మొగులప్ప(26) కతాల్‌ అనే విద్యుత్‌ కాంట్రాక్టర్‌ దగ్గర పనిచేస్తున్నాడు. నాగిరెడ్డిపల్లిలోని శేఖర్‌గౌడ్‌ పొలంలో స్తంభాలపై తీగలు సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై కింద పడ్డాడు. చికిత్స నిమిత్తం పేట ఏరియా ఆసుపత్రికి తరలించగా  మృతి చెందాడు. మృతుడికి రెండేళ్ల క్రితం వివాహమైంది. ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.     

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top