
పంజగుట్ట : సీనియర్ జర్నలిస్టు, రచయిత వడ్డాలపు ప్రభాకర్ (43) హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఖైరతాబాద్ ఆనంద్‌నగర్ కాలనీలో కుమారునితో కలిసి ఉంటున్న ఆయన శనివారం రాత్రి 7 గంటలకు ఇంట్లో నుండి బయల్దేరి ఎనిమిదిన్నరకు సెల్‌ఫోన్‌ను స్విచ్చాఫ్ చేసుకున్నారు.అయితే ఆయన నేరుగా ఆఫీస్‌కు వెళ్లకపోవటం, రాత్రి రెండు గంటలు దాటినా ఇంటికి రాకపోవటంతో ఆయన కుమారుడు శిల్పి ఆదివారం తెల్లవారుజామున పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కొందరు వ్యాపారులు హుస్సేన్‌సాగర్‌లో ఓ గుర్తు తెలియని శవాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు జేబుల్లో లభించిన సెల్‌ఫోన్, గుర్తింపు కార్డు ఆధారంగా ప్రభాకర్‌ను గుర్తించారు. కొంతకాలంగా వ్యక్తిగత కారణాలతో బాధపడుతున్నందునే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ప్రభాకర్ పలు టీవీ చానళ్లతో పాటు, బస్తీ సినిమాకు మాటల రచయితగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ‘సాక్షి’దినపత్రికలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ప్రభాకర్ మరణంపై ‘సాక్షి’దినపత్రిక ఎడిటర్ వర్ధెల్లి మురళి సంతాపం వ్యక్తం చేశారు.
నేడు స్వస్థలానికి భౌతిక కాయం
గాంధీ ఆస్పత్రిలో భద్రపరిచిన ప్రభాకర్ భౌతికకాయాన్ని పలువురు జర్నలిస్టులు సందర్శించి సంతా పం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు ఎస్.విజయ్‌కుమార్‌రెడ్డి నివాళి అర్పించారు. సోమవారం ఉదయం కుటుంబీకుల సమక్షంలో పోస్ట్‌మార్టం నిర్వహించి ఆయన స్వస్థలం కేసము ద్రం మండలం కల్లెడకు తరలిస్తారు.