పెద్దాసుపత్రిలో కీచకపర్వం | Security Guard Molestation On Patient Relatives In Kurnool | Sakshi
Sakshi News home page

పెద్దాసుపత్రిలో కీచకపర్వం

Jun 7 2018 12:13 PM | Updated on Jun 7 2018 12:13 PM

Security Guard Molestation On Patient Relatives In Kurnool - Sakshi

మహిళను చేయి పట్టుకుని లాగుతున్న సెక్యూరిటీ గార్డు

కర్నూలు(హాస్పిటల్‌): ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగులు, వారి సహాయకుల రక్షణ కోసం నియమించిన సెక్యూరిటీ గార్డులే వారి పాలిట భక్షక భటులయ్యారు. ఒంటరిగా కనిపించిన మహిళలను చెరబడుతున్నారు. మహిళల ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బు లాగుతున్నారు. ఇలాంటి సంఘటన ఒకటి బుధవారం వెలుగులోకి రావడంతో ఆ సెక్యూరిటీ గార్డుపై చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. 

ఫొటోలు తీసి.. బ్లాక్‌ మెయిల్‌ చేసి..
ఆసుపత్రిలోని ఫిమేల్‌ మెడికల్‌ వార్డులో చికిత్స పొందుతున్న ఓ మహిళకు సహాయకురాలిగా ఉన్న మహిళ గత సోమవారం రాత్రి ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉన్న సమయంలో సెక్యూరిటీ గార్డు లక్ష్మీకాంత్‌ గమనించి ఫొటోలు తీశాడు. అనంతరం ఆ మహిళతో పాటు ఆమెతో ఉన్న వ్యక్తినీ బ్లాక్‌ మెయిల్‌ చేశాడు. విషయాన్ని అందరికీ చెబుతానని బెదిరించాడు. దీంతో ఆమెతో ఉన్న వ్యక్తి రూ.2 వేలు సమర్పించుకుని అక్కడ నుంచి బయటపడ్డాడు. అయితే మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో సదరు సెక్యూరిటీ గార్డు మద్యం సేవించి వచ్చి ఆ మహిళను వార్డులో నుంచి బయటకు పిలిచి మళ్లీ బ్లాక్‌మెయిల్‌ చేశాడు. గదిలోకి రాకపోతే ఫొటోలు బయటకు పంపిస్తానని బెదిరించాడు.

ఆమె ఒప్పుకోకపోవడంతో చేయిపట్టుకుని గదిలోకి లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో అక్కడ నుంచి సెక్యూరిటీ గార్డు ఉడాయించాడు. విషయం ఆ నోటా ఈ నోటా పాకి చివరకు పోలీస్‌స్టేషన్‌కు చేరింది. మూడో పట్టణ పోలీసులు సదరు మహిళ, సెక్యూరిటీ గార్డును పిలిచి మాట్లాడినట్లు తెలిసింది. అయితే విషయం బయటపడితే తన సంసారం నాశనం అవుతుందని ఆమె వేడుకోవడంతో కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించినట్లు సమాచారం. కాగా ఈ విషయమై సెక్యూరిటీ గార్డును సస్పెండ్‌ చేస్తూ  బుధవారం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి. చంద్రశేఖర్‌ ఇన్‌చార్జ్‌ సీఎస్‌ఆర్‌ఎంవోను విచారణకు ఆదేశించారు. 

రాత్రిపూట విధులంటేనేవారికి మక్కువ...
ఆసుపత్రిలో జై బాలాజీ సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేసే నలుగురైదుగురు సెక్యూరిటీ గార్డులకు రాత్రి పూట విధులంటేనే ఎక్కువ మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. వారికి పగటిపూట విధులు వేసినా రాత్రి పూట మాత్రమే పనిచేస్తున్నట్లు సమాచారం. రాత్రి వేళల్లో ఆసుపత్రిలో గస్తీ తిరగడం, ఒంటరి మహిళలు కనిపిస్తే వారిని బ్లాక్‌మెయిల్‌ చేయడం వారికి పరిపాటిగా మారిందని ఆసుపత్రి వర్గాల ప్రాథమిక విచారణలో బహిర్గతమైనట్లు తెలుస్తోంది. గతంలోనూ భూత్‌బంగ్లా, మానసిక రోగుల వార్డు, అంటువ్యాధుల విభాగం, మార్చురీ వద్ద   మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు చెబుతున్నారు. ఆసుపత్రిలో రోగులు, వారి సహాయకులకు రక్షణంగా ఉండాల్సిన వారే భక్షించేందుకు సిద్ధమవడం రోగులను ఆందోళనకు గురిచేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement