ఎదురొచ్చిన మృత్యువు

School Student Died in Bike Accident Hyderabad - Sakshi

బైక్‌ అదుపు తప్పి స్కూల్‌ బస్సును ఢీకొనడంతో ఘటన

మావయ్యతో పాటు బాలుడి మృతి

మరో బాలికకు తీవ్ర గాయాలు రెండు కుటుంబాల్లో విషాదం

మీర్‌పేట: చిరునవ్వులు చిందిస్తూ తల్లిదండ్రులకు టాటా చెప్పి మావయ్యతో కలిసి స్కూల్‌కు వెళుతున్న ఓ బాలుడితో పాటు అతడి మామను బస్సు రూపంలో మృత్యువు కబలించింది. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన ఈ సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది.పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బడంగ్‌పేట ఏజీఆర్‌కాలనీకి చెందిన పానిగంటి సురేందర్, రేణుక దంపతులకు కుమారుడు శ్రేయస్‌ (10), లోక్షిత (7) ఉన్నారు. సురేందర్‌ మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తున్నాడు. అతని సమీప బంధువులు వనపర్తి జిల్లాకు చెందిన గోర్ల శేఖరయ్య, శివమ్మ దంపతుల కుమారుడు బాలకృష్ణ (23) డిగ్రీ వరకు చదువుకున్నాడు. సురేందర్‌కు  వరుసకు బావమరిది అయిన అతను గత కొన్ని రోజులుగా సురేందర్‌ ఇంట్లోనే ఉంటూ ఓ ఆటోమొబైల్‌ షాపులో పని చేస్తున్నాడు.

కాగా లోక్షిత, శ్రేయస్‌ బడంగ్‌పేటలోని డీపీఎస్‌ స్కూల్‌లో చదువుతున్నారు. రోజు మాదిరిగానే సోమవారం ఉదయం వారిద్దరూ బాలకృష్ణ బైక్‌పై స్కూల్‌కు బయలుదేరారు. బడంగ్‌పేట ప్రధాన రహదారిపై పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్స్‌ సమీపంలోకి రాగానే బైక్‌ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లార్డ్స్‌ పాఠశాలకు చెందిన స్కూల్‌ బస్సు వెనుక చక్రాల కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సు చక్రాల కింద నలిగి తీవ్రంగా గాయపడిన బాలకృష్ణ, శ్రేయస్‌ అక్కడికక్కడే మృతి చెందగా చిన్నారి లోక్షితకు స్వల్ప గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గోర్ల శేఖరయ్య, శివమ్మలకు ముగ్గురు కుమార్తెలు కాగా బాలకృష్ణ ఒక్కగానొక్క కుమారుడు. తమకు ఆసరాగా ఉంటాడనుకున్న కుమారుడు మృతి చెం దడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

శోకసంద్రంలో శ్రేయస్‌ తల్లిదండ్రులు...
చెల్లెలు లోక్షిత, మావయ్య బాలకృష్ణలతో కలిసి స్కూల్‌కు బయలుదేరిన చిన్నారి శ్రేయస్‌ అనంతలోకాలకు చేరుకున్నాడన్న వార్త తెలియగానే తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న తల్లి రేణుక శ్రేయస్‌ మృతదేహాన్ని పట్టుకుని గుండెలవిసేలా రోదించడం స్థానికులను కంటతడి పెట్టించింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top