రక్తమోడిన రహదారులు

Road Accidents In Medak - Sakshi

రహదారులు రక్తమోడాయి. ఆదివారం ఉమ్మడి జిల్లాలో జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు ఏడుగురిని బలితీసుకున్నాయి. కల్హేర్‌ మండలం మాసాన్‌పల్లి చౌరస్తాలో సంగారెడ్డి– నాందేడ్‌ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మోటార్‌ సైకిల్‌పై కబుర్లు చెప్పుకుంటూ ఓ జంట, వారి కుమారుడు బయలుదేరారు. మరో ఐదు నిమిషాల్లో ఇల్లు చేరుకుంటామనగా వారి పాలిట ఆర్టీసీ బస్సు మృత్యుశకటమైంది. ముగ్గురినీ పొట్టనబెట్టుకుంది. సదాశివపేట మండల పరిధిలోని సూరారం వద్ద జరిగిన మరో ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.

అత్త, అల్లుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మనవరాలికి గాయాలయ్యాయి. చేగుంట మండలం వడియారం బైపాస్‌ శివారులో ట్రాక్టర్‌ బోల్తాపడి ఇద్దరు ఛత్తీస్‌గడ్‌ వాసులు ప్రాణాలు వదిలారు. బతుకుదెరువు కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చినవారు చివరికి విగతజీవులుగా మారారు. ఆయా ప్రమాదాలతో వారి స్వగ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. మరోపక్క రిమ్మనగూడ వద్ద శుక్రవారం జరిగిన ప్రమాదంలో గాయపడి.. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వారిలో ఇప్పటికి పది మంది డిశ్చార్జి కాగా మరో పది మందికి ఇంకా చికిత్సలు కొనసాగుతున్నాయి. 

కల్హేర్‌(నారాయణఖేడ్‌, మెదక్‌): ఆర్టీసీ అద్దె బస్సు, బైక్‌ ఢీ కొని ఒకే ఇంట్లో ముగ్గురు మృతి చెందిన విషాదకర ఘటన మాసాన్‌పల్లి–బాచేపల్లి మార్గంలో సంగారెడ్డి–నాందేడ్‌ 161 జాతీయ రహదారిపై ఖానాపూర్‌(బి) రోడ్డు వద్ద ఆదివారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. మాసాన్‌పల్లి బుగ్గ్యనాయక్‌ తండాకు చెందిన కెతవత్‌ సంగ్యనాయక్‌(50), అతని భార్య సంతెలిబాయి(45), కుమారుడు అనిల్‌(15) బాచేపల్లి నుంచి మోటర్‌ సైకిల్‌పై ఇంటికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో ఖానాపూర్‌(బీ) రోడ్డు వద్ద మూలమలుపులో హైదరాబాద్‌2 డిపోకు చెందిన ఆర్టీసి ప్రైవేట్‌ బస్సు వీరి మోటర్‌ సైకిల్‌ను ఢీ కొట్టి కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది.

ప్రమాదంలో మోటార్‌ సైకిల్‌ నడుపుతున్న సంగ్యనాయక్, అతని కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయల పాలై కోన ఊపిరితో ఉన్నసంతెలిబాయిని నారాయణఖేడ్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సంఘటన స్థలన్ని కంగ్టి సీఐ తిరుపతి యాదవ్, కల్హేర్‌ ఎస్‌ఐ సాయిరాం, ఏఎస్‌ఐ లక్ష్మణ్‌ పరిశీలించి విచారణ చేపట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. సంగ్యనాయక్, అనిల్‌ మృతదేహలను పోస్టుమార్టం కోసం నారాయణఖేడ్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో బంధువుల రోదనలు మిన్నంటాయి.

మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పరమర్శ..
మాజీ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి మృతుల కుటుంబీకులను పరమర్శించి అంత్యక్రియల కోసం రూ. 5వేలు సహాయం అందించారు. జిల్లా ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు నగేశ్‌షెట్కార్, జిల్లా రైతు సమన్వయ సమితి కోఅర్డినేటర్‌ వెంకట్‌రాంరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు గుండు మోహన్, రవీందర్‌నాయక్, వెంకటేశంసేట్‌ మృతుల కుటుంబీకులను పరామర్శించారు.

అత్తా, అల్లుడు దుర్మరణం..
సదాశివపేట రూరల్‌(సంగారెడ్డి): ఓ లారీ డ్రైవర్‌ అతివేగం, నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్న సంఘటన మండల పరిధిలోని జాతీయ రహదారి 65 సూరారం రోడ్డు సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. సదాశివపేట సీఐ కేతిరెడ్డి సురేందర్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా రేగోడ్‌ మండలంలోని టీ లింగంపల్లికి చెందిన అవిటి విఠల్‌(27), తన కూతురు మహాలక్ష్మి(5)తో పాటుగా అత్త నాయికిని జయమ్మ(40)తో కలిసి ద్విచక్ర వాహనంపై మియాపూర్‌ నుంచి తన అత్తగారి ఊరైన కర్ణాటక రాష్టం గుల్బర్గా జిల్లాలోని చేట్ల వెంకటాపూర్‌ గ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో మండల పరిధిలోని జాతీయ రహదారి 65 సూరారం రోడ్డు సమీపంలో వెనుక నుంచి అతివేగంగా వస్తున్న లారీ వీరి బైక్‌ను ఢీ కొట్టింది. ప్రమాదంలో అవిటి విఠల్‌(27), నాయికిని జయమ్మ(40) తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రాణాలతో బయటపడ్డ చిన్నారి..
ప్రమాదంలో స్వల్ప గాయాలపాలైన మహాలక్ష్మిని సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ కేతిరెడ్డి సురేందర్‌ రెడ్డి తెలిపారు.

మరో ప్రమాదంలో యువకుడు
సదాశివపేట(సంగారెడ్డి): పట్టణ పరిధిలోని ఎన్కెపల్లి బైపాస్‌ రోడ్డులో శనివారం  రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. స్థానికుల కథనం మేరకు సదాశివపేట మండలం ఎన్కెపల్లికి చెందిన రాజ్‌కుమార్‌ సదాశివపేట పట్టణం నుంచి స్వగ్రామమైన ఎక్కెపల్లిగా బైక్‌పై వెళ్తున్నాడు. హైదరాబాద్‌ వైపు వెళ్తున్న కారు ఇతను ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 

బతుకులు బోల్తా.. ట్రాక్టర్‌ బోల్తా పడి ఇద్దరు వలస కూలీల మృతి
చేగుంట(తూప్రాన్‌): ట్రాక్టర్‌ బోల్తాపడి ఛత్తీస్‌గడ్‌కు చెందిన ఇద్దరు వలస కూలీలు మృతి చెందిన సంఘటన మండలంలోని వడియారం శివారులో 44వ నంబర్‌ జాతీయరహదారిపై ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గడ్‌కు చెందిన సాగర్‌నాగ్‌(25), గంగారాంనాగ్‌(20), ఆచారంనాగ్‌ తూప్రాన్‌ మండలం ఘనపురంలో కూలి పనులు చేస్తూ జీవిస్తున్నారు. రామాయంపేటలో పనులు ఉండటంతో ట్రాక్టర్‌పై తూప్రాన్‌ నుండి రామాయంపేటకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వడియారం బైపాస్‌ శివారులోకి రాగానే వేగంగా వెళుతున్న ట్రాక్టర్‌ అదుపు తప్పి కల్వర్టును ఢీకొని బోల్తాపడింది. ట్రాక్టర్‌ నడుపుతున్న సాగర్‌నాగ్‌(25), గంగారాంనాగ్‌(20) అక్కడికక్కడే మృతి చెందారు. ఆచారంనాగ్‌కు తీవ్ర గాయాలైనాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top