మృతదేహం వెలికితీతపై ఖాకీల తాత్సారం

police Negligence on Dead Body Removed From Canal - Sakshi

రెండు రోజులుగా కాలువలోనే మృతదేహం

భయాందోళనలో గ్రామస్తులు

గుంటూరు, నందివెలుగు(తెనాలిరూరల్‌): కాలువలో ఉన్న మృతదేహాన్ని తరలించడానికి ఖాకీలకు తీరిక దొరకడం లేదు. కొట్టుకువచ్చిన గుర్తు తెలియని మృతదేహం గ్రామంలో ఇళ్లకు సమీపంలో కాలువలో నిలిచిపోవడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. అటుగా వెళ్లేందుకు భయపడుతున్నారు. తమకు సంబంధం లేదంటే తమకు సంబంధం లేదంటూ తెనాలి తాలూకా, దుగ్గిరాల పోలీసులు రెండు రోజులుగా తాత్సారం చేస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. దుగ్గిరాల నుంచి ప్రారంభమయ్యే తూర్పు కాలువ తెనాలి మండలం నందివెలుగు గ్రామం వద్దకు రాగానే చింతలపూడి, నందివెలుగు, అత్తోట గ్రామాల పొలాలకు సాగునీరందించేందుకు చిన్న కాల్వ చీలుతుంది. సరిగా నందివెలుగు పొలిమేరలో ఈ కాల్వ వెళుతుండడంతో దీన్ని పొలిమేర కాలువగా గ్రామస్తులు వ్యవహరిస్తుంటారు.

ఈ కాలువలో రెండు రోజుల క్రితం సుమారు 40 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని మహిళ మృతదేహం కొట్టుకువచ్చింది. ఏ ప్రాంతానికి చెందిన మహిళో, ఎక్కడ మృతి చెందిందో తెలియదు గానీ, నందివెలుగు పొలిమేర కాల్వలో తూటికాడలో ఇరుక్కుపోయింది. రెండు రోజులుగా కాలువలోనే ఉంటుండడంతో ఈ ప్రాంతంలో తీవ్ర దుర్గంథంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆకుపచ్చ లంగా, పసుపు రంగు జాకెట్‌ మృతదేహంపై ఉన్నాయి. దీనిపై గ్రామస్తులు తెనాలి తాలూకా పోలీసులకు సమాచారమివ్వగా, కాల్వ ప్రాంతం తమ పరిధిలోనిది కాదని, దుగ్గిరాల పోలీసులకు తెలియజేయమని సూచించారు. దుగ్గిరాల పోలీసులకు సమాచారమివగా, తమకేం సంబంధం లేదని, తెనాలి తాలూకా పోలీసుల పరిధిలోదని చెబుతున్నారేగానీ, రెండు రోజులుగా మృతదేహాన్ని తరలించేందుకు ఎవరూ చొరవ చూపడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు.  గ్రామ వీఆర్‌వో రత్నకిషోర్‌ను వివరణ కోరగా, పొలిమేర కాల్వ చింతలపైడి వద్ద నుంచి వస్తుందని, దుగ్గిరాల మండల పరిధిలో ఉంటుందని వివరించారు. దీనిపై మండల ఆర్‌ఐ తాండవ కృష్ణ, సర్వేయరు గోపాలరావు స్పష్టత ఇచ్చారని వివరించారు. ఏదేమైనా మృతదేహాన్ని వెంటనే తరలించారని గ్రామస్తలు కోరుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top