పేకాట పంచాయితీ | Police Attacks On North Club Cards Club In Guntur | Sakshi
Sakshi News home page

పేకాట పంచాయితీ

Jun 6 2018 1:13 PM | Updated on Jun 6 2018 1:13 PM

Police Attacks On North Club Cards Club In Guntur - Sakshi

పట్టుబడిన పేకాటరాయుళ్లు

గుంటూరు నగరంలోని నార్త్‌ క్లబ్‌పై పోలీసులు దాడిచేసి 247 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.20.28 లక్షల నగదు స్వాధీనం చేసుకోవడంతో అధికార తెలుగుదేశం పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలు భగ్గు
మన్నాయి. ఒక వర్గం ఆధ్వర్యంలోనడుస్తున్న నార్త్‌ క్లబ్‌పైనే పోలీసులు దాడి చేయడం, మరో వర్గం ఆధ్వర్యంలో ఉన్న రెండు క్లబ్బులపై పోలీసులు దృష్టిసారించకపోవడంపై ఆ పార్టీ నేతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఓ మంత్రి ఒత్తిడితోనే నార్త్‌ క్లబ్‌పై పోలీసులు దాడి చేశారన్నఅనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సాక్షి, గుంటూరు: జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య కొన్నేళ్లుగా పేకాట పంచాయితీ నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో గుంటూరు రూరల్‌ జిల్లా పరిధిలోని దాచేపల్లిలో పేకాట క్లబ్‌ నడుస్తుండటంతో తాము క్లబ్‌ను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఓ మంత్రి నేరుగా గతంలో పనిచేసిన పోలీసు బాస్‌ను అడిగారు. దీంతో పోలీస్‌బాస్‌ ఆగ్రహించి సీఎం వద్ద పంచాయితీ పెట్టడంతో కొంతకాలం దాచేపల్లి క్లబ్‌ మూతపడింది. గుంటూరు నగరంలో సైతం మూడు క్లబ్‌ల్లో యథేచ్ఛగా పేకాడిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు.

అధికార పార్టీ ముఖ్యనేతల అండదండలతోనే ఈ క్లబ్బులన్నీ నడుస్తుండటంతో పోలీసులు వాటి జోలికి వెళ్లకుండా వదిలేశారు. అయితే క్లబ్‌ల నిర్వహణలో టీడీపీ నేతల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో నార్త్‌ క్లబ్‌పై పలు మార్లు పోలీసులు దాడులు నిర్వహించి, పేకాటరాయుళ్లను అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా మంగళవారం మరోమారు పోలీసులు పక్కా ప్రణాళికతో నార్త్‌ క్లబ్‌పై దాడులు నిర్వహిం చారు. 247 మందిని పేకాటరాయుళ్లను అరెస్టు చేసి వారి నుంచి రూ.20.28 లక్షల నగదు, 17 వాహనాలను స్వాధీనం చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. రాజధాని ప్రాంతంలో క్లబ్‌పై దాడులు జరగడం, పెద్ద ఎత్తున పేకాటరాయుళ్లను అరెస్టు చేయడంతోపాటు, భారీగా డబ్బు పట్టుబడడం చూస్తుంటే పోలీసులు ఏస్థాయిలో వ్యూహం పన్నారో అర్థంచేసుకోవచ్చు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ నగరంలో మరో వర్గం టీడీపీ నేతల ఆధ్వర్యంలో నడుస్తున్న రెండు పేకాట క్లబ్‌ల జోలికి పోలీసులు ఎందుకు వెళ్లడం లేదంటూ నార్త్‌ క్లబ్‌ నిర్వాహకులకు అండదండలు అందిస్తున్న అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఆదాయం కోసం పేకాట
గుంటూరు నగరంలో రాజధాని స్థాయి అభివృద్ధి జరగలేదు కానీ అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పేకాట క్లబ్‌లు మాత్రం జోరుగా నడుస్తున్నాయనేది బహిరంగ రహస్యం. నగరంలో నడుస్తున్న మూడు క్లబ్‌ల్లో ఎల్‌వీఆర్, గుంటూరు క్లబ్‌లుఅధికార పార్టీ ముఖ్య నేతల నాయకత్వంలో నడుస్తున్నాయి. నార్త్‌ క్లబ్‌ సైతం అధికార పార్టీ నేతల కనుసన్నల్లో నడుస్తున్నప్పటికీ వేరే సామాజిక వర్గాలవారు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీలోని ఓ వర్గం తరచూ ఆ క్లబ్‌పై దాడులు చేయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నార్త్‌ క్లబ్‌పై నాలుగు సార్లు పోలీసులు దాడులు చేశారు. మిగతా రెండు క్లబ్‌లపై మాత్రం కన్నెత్తి చూడలేదంటూ అధికార పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. క్లబ్‌ల్లో పేకాడించడం వల్ల భారీ ఎత్తున ఆదాయం వస్తుండటంతో అధికార పార్టీ నేతలు క్లబ్‌ల నిర్వహణకోసం పోటీలు పడుతున్నారు. దీంతో అధికార పార్టీ నేతలు వర్గాలుగా మారి వాటాల కోసం తన్నుకుంటున్నారు.

మంత్రి ఒత్తిడితోనే..
నగరంలోని మూడు క్లబ్బుల్లో రిక్రియేషన్‌ పేరుతో తాత్కాలిక సభ్యత్వాలు ఇస్తూ రోజుకు రూ.లక్షల్లో ఆదాయాన్ని రాబడుతున్నారు. నార్త్‌ క్లబ్‌పై మంగళవారం జరిగిన దాడులు సైతం ఓ మంత్రి ఒత్తిడి వల్లే జరిగాయని సొంత పార్టీనేతలే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ క్లబ్‌పై పోలీసులు దాడులు చేయగా, పేకాడుతూ ఒక్కరూ కూడా దొరకలేదు. ఈ సారి మాత్రం పక్కా వ్యూహంతో దాడులు చేశారని చెప్పుకుంటున్నారు. రాజధాని నగరంలో అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకోవాల్సిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులే పేకాట క్లబ్‌లు నిర్వహిస్తూ వాటాల కోసం తన్నుకోవడం చూసి ప్రజలు
చీత్కరించుకుంటున్నారు.

ఎవరినీ ఉపేక్షించం
నగరంలో రిక్రియేషన్‌ ముసుగులో నిబంధనలకు విరుద్ధంగా పేకాట నిర్వహిస్తే సహించేది లేదు. నార్త్‌ క్లబ్‌ నిర్వాహకులు హైకోర్టు ఆదేశాలు ఉన్నాయంటూ చెబుతున్నారే తప్ప, వాటిని పాటించడం లేదు. వారానికి ఒకసారి సీసీ పుటేజ్‌లు సంబంధిత పోలీసు స్టేషన్‌లో అందించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. మెంబర్‌షిప్‌ రికార్డు సక్రమంగా నిర్వహించడం లేదు. ఎల్వీఆర్, గుంటూరు క్లబ్‌లు నిబంధనలకు అనుగుణంగా మాకు రికార్డులు అందిస్తున్నాయి. నిబంధనలు అతిక్రమిస్తే ఎవరినీ వదిలేది లేదు.     – విజయరావు, అర్బన్‌ ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement