దొంగను పట్టిచ్చిన ఫోన్‌ పే

Pharmacy Robber Caught By Phone Pay App To Pay For Knife  - Sakshi

న్యూ​ఢిల్లీ : మెడికల్‌ షాపులో దొంగతనం చేయాలని వచ్చిన ఒక వ్యక్తికి తన వెంట తెచ్చుకున్న కత్తి అతన్ని పోలీసులకు పట్టింస్తుందని అస్సలు ఊహించి ఉండడు. ఈ వింత ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. డిప్యూటీ కమిషనర్‌ ఆంటో అల్ఫోన్స్ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ ఢిల్లీలోని ద్వారకా వీధిలో ఉన్న ఒక ఫార్మసీ షాపులో గౌరవ్‌కుమార్‌ పనికి కుదిరాడు. అయితే పని చేస్తున్న సంస్థకే కన్నం వేయాలని భావించాడు. అనుకున్నదే తడవుగా సోమవారం కుమార్‌ తన ముఖాన్ని టవల్‌తో చుట్టుకొని టోపీని అడ్డుపెట్టుకొని ఒక కస్టమర్‌లాగా షాపులోకి ప్రవేశించాడు. ఆ సమయంలో సేల్స్‌మెన్‌ కస్టమర్‌కు మందులను అమ్ముతున్నాడు. షాపులో సేల్స్‌మెన్‌ తప్ప ఎవరు లేకపోవడంతో దొంగతనానికి ఇదే సరైన సమయమని భావించి కస్టమర్‌ వెళ్లిపోయాక కుమార్‌ షాపు షెట్టర్‌ను మూసేశాడు. తర్వాత సేల్స్‌మెన్‌ చేతులను కట్టేసి, నోటిలో గుడ్డను కుక్కి రూ. 75 వేల నగదు, రూ. 3వేలు విలువ చేసే మందులను ఎత్తుకెళ్లాడు. కొంతసేపటికి అక్కడికి చేరుకున్న షాపు ఓనర్‌ క్లోజ్‌ చేసిన షెటర్‌ను తెరవగానే సేల్స్‌మెన్‌ను షాక్‌కు గురయ్యాడు. తర్వాత సేల్స్‌మెన్‌ చేతులకున్న కట్లను విప్పేసి అసలు విషయం తెలుసుకొని తమకు సమాచారమందించాడని అల్ఫోన్స్‌ తెలిపారు.

ఘటనా స్థలికి చేరుకున్న తమకు మొదట ఏం ఆధారాలు దొరకలేదని డీసీపీ పేర్కొన్నారు. అయితే షాపులో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా నిందితుడు తన వెంట తెచ్చుకున్న కత్తి కవర్‌ను షాపు ముందు పడేయడం గమనించాము. వెంటనే ఆ కవర్‌ను పరిశీలించగా దాని మీద ఒక బార్‌కోడ్‌ ఉండడంతో స్కాన్‌ చేసి చూడగా 21 స్టోర్స్‌కు సంబంధించిన వివరాలు కనిపించాయి. అన్ని స్టోర్స్‌కు వెళ్లి విచారించగా నిందితుడు ఆ కత్తిని ఫోన్‌ పే ద్వారా కొనుగోలు చేసినట్లు తెలిసిందని అల్ఫోన్స్‌ వెల్లడించారు. విచారణలో నిందితుడి ఫోన్‌ నెంబర్‌ వివరాలను సేకరించి అతన్ని పట్టుకొని రూ. 65వేల నగదు, మందులను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ పేర్కొన్నారు. కాగా మిగతా రూ.10 వేలను నిందితుడు తన అవసరాలకు వాడినట్లు తెలిపాడు. నిందితుడి మీద కేసు నమోదు చేసి అతన్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు డీసీపీ అల్ఫోన్స్‌ వెల్లడించారు.

కాగా, నిందితుడు గౌరవ్‌కుమార్‌ స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌ ప్రాంతానికి చెందిన వాడని పోలీసులు పేర్కొన్నారు. ఇంతకముందు 2010లో దంపతుల హత్య కేసులో జైలుకెళ్లిన కుమార్‌ 8 సంవత్సరాలు జైలుశిక్షను అనుభవించి 2018లో విడుదలయ్యాడని తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top