ఇదీ.. చిదంబరం చిట్టా

P Chidambaram Arrested from Home in INX Media Scam Case - Sakshi

చిక్కుల్లో చిద్దూ!

యూపీఏ ప్రభుత్వంలో హోంమంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం తన కొడుకు కార్తీ కంపెనీలకు భారీగా లబ్ధి చేకూర్చారని ఆరోపణలున్నాయి. ఐఎన్‌ఎక్స్‌ మీడియాతోపాటు మరి కొన్ని కేసుల్లో చిదంబరం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఆయన్ను సీబీఐ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయనపై ఉన్న కేసుల వివరాలివీ...

ఐఎన్‌ఎక్స్‌: విదేశీ పెట్టుబడులకు పచ్చజెండా!
స్టార్‌ టీవీ ఇండియాకు సీఈఓగా దాదాపు పదేళ్ల పాటు పనిచేసి ఆ తరువాత బయటకు వచ్చేసిన పీటర్‌ ముఖర్జియా సంస్థ పేరే ఐఎన్‌ఎక్స్‌ మీడియా. ఈయన తన భార్య ఇంద్రాణి ముఖర్జీతో కలిసి 2007లో ఐఎన్‌ఎక్స్‌ మీడియాను ఆరంభించారు. దాన్లో ఇంద్రాణి సీఈఓగా ఉండగా... పీటర్‌ ముఖర్జియా చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌గా చేరారు. ఈ సంస్థలోకి విదేశాల నుంచి పెట్టుబడుల రూపంలో వచ్చిన రూ.305 కోట్లకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్‌ఐపీబీ) పచ్చజెండా ఊపింది.

ఈ ఎఫ్‌ఐపీబీ అనుమతుల విషయంలో అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న పి.చిదంబరం తన అధికారాన్ని దుర్వినియోగం చేశారన్నది ప్రధాన అభియోగం. అంతేకాక విదేశీ పెట్టుబడుల రూపంలో ఐఎన్‌ఎక్స్‌లోకి వచ్చిన డబ్బులు వేరెవరివో కావని, చిదంబరం తనయుడు కార్తీకి చెందిన వివిధ కంపెనీలు ఈ పెట్టుబడుల్ని ఇండియాకు తరలించడానికి ఐఎన్‌ఎక్స్‌ మార్గాన్ని ఎంచుకున్నాయని, ఇది స్పష్టమైన మనీ లాండరింగ్‌ వ్యవహారమని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. పీటర్‌ ముఖర్జియా, ఇంద్రాణి ముఖర్జీలు ఈ కేసులో ఇప్పటికే అప్రూవర్లుగా మారిపోయారు. ఈ కేసులో తమను ఇరికించకుండా చూడడానికి వారు కార్తీకి 10 లక్షలు లంచం కూడా ఇచ్చారని సీబీఐ చెబుతోంది.  
 
ఎయిర్‌సెల్‌– మాక్సిస్‌: అక్రమ అనుమతులు!

ఎయిర్‌సెల్‌ మాక్సిస్‌ కేసు 2011వ సంవత్సరం మేలో వెలుగులోకి వచ్చింది. ఎయిర్‌సెల్‌ సంస్థ వ్యవస్థాపకుడు సి.శివశంకరన్‌ తన సంస్థలోని 74 శాతం వాటాలను 2006లో మలేసియా కంపెనీ మాక్సిస్‌కు విక్రయించారు. అప్పటి కేంద్ర టెలికం మంత్రి దయానిధి మారన్‌ బలవంతంగా తనతో ఈ పని చేయించారంటూ ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై సీబీఐ దర్యాప్తు ఆరంభించగా... ఈడీ కూడా మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. రూ.3,500 కోట్ల విలువ చేసే పెట్టుబడులను మాక్సిస్‌ సంస్థ ఎయిర్‌సెల్‌లో పెట్టిన సమయంలో ఆర్థిక మంత్రిగా చిదంబరమే ఉన్నారు.

వాస్తవానికి ఈ స్థాయి విదేశీ పెట్టుబడులకు ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఈఏ) అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. కానీ ఆర్థిక మంత్రి హోదాలో చిదంబరం నిబంధనల్ని తోసిరాజని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్‌ఐపీబీ) ద్వారా అనుమతులు మంజూరు చేశారని అభియోగాలున్నాయి. నిజానికి ఎఫ్‌ఐపీబీకి రూ.600 కోట్ల వరకు విలువున్న పెట్టుబడులకు మాత్రమే అనుమతినిచ్చే అధికారం ఉంది. ఈ ఒప్పందం కుదరడానికి చిదంబరం కుమారుడు కార్తీకి భారీగా ముడుపులు ముట్టజెప్పినట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి.  

20 సార్లు చిదంబరానికి ఊరట
ఐఎన్‌ఎక్స్, ఎయిర్‌సెల్, మాక్సిస్‌ కేసుల్లో ఇప్పటికే పలు దఫాలు దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ చిదంబరాన్ని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించాయి. చిదంబరం ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు దాఖలు చేసుకొని అరెస్ట్‌ నుంచి తప్పించుకున్నారు. ఈ ముందస్తు బెయిల్‌కు సంబంధించిన గడువుల్ని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వచ్చారు. అలా మొత్తంగా 20 సార్లు చిదంబరానికి ఊరట లభించింది. ఇప్పటికే ఈడీ చిదంబరాన్ని గత ఏడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరిలో రెండు సార్లు ప్రశ్నించింది కూడా.  

బెయిల్‌పై ఉన్న కార్తీ
ఇక ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం కుమారుడు కార్తీని గత ఏడాది ఫిబ్రవరిలో సీబీఐ అరెస్ట్‌ చేసింది. 23 రోజుల పాటు జైల్లో ఉన్న కార్తీ మార్చిలో బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసుకు సంబంధించి భారత్, యూకే, స్పెయిన్‌ దేశాల్లో కార్తీ చిదంబరానికి చెందిన రూ.54 కోట్ల ఆస్తుల్ని ఈడీ అటాచ్‌ చేసింది.  

పెండింగ్‌లో మరిన్ని కేసులు
► ఎయిర్‌ ఇండియా విమానాల కొనుగోలుకు సంబంధించి రూ.1,272 కోట్ల విలువైన అవినీతి జరిగినట్టు కూడా చిదంబరంపై కేసు ఉంది. దీనిపై విచారణకు హాజరు కావాలని ఇటీవలే ఈడీ ఆదేశాలు జారీ చేసింది.  
► రూ.5,600 కోట్ల నేషనల్‌ స్పాట్‌ ఎక్స్‌ ్చంజ్‌  వ్యవహారంలో చిదంబరం తీసుకున్న నిర్ణయాల వల్లే తమ సంస్థ భారీగా దెబ్బతిన్నదని ‘63 మూన్స్‌ టెక్నాలజీస్‌’సంస్థ (గతంలో దీనిపేరు ఫైనాన్షియల్‌ టెక్నాలజీస్‌ ఇండియా లిమిటెడ్‌) ఫిర్యాదు చేసింది.  

► ఇక శారదా చిట్‌ఫండ్‌ కేసులో చిదంబరం భార్య నళిని ప్రమేయం ఉన్నట్టుగా సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో 1.4 కోట్ల రూపాయల ముడుపులు నళినికి అందినట్టుగా ఆరోపణలున్నాయి.  
 
► బ్లాక్‌ మనీ అండ్‌ ఇంపోజిషన్‌ ఆఫ్‌ ట్యాక్స్‌ యాక్ట్, 2015 కింద చిదంబరం, ఆయన భార్య నళిని, కుమారుడు కార్తీ, కోడలు శ్రీనిధిని విచారించాలంటూ ఆదాయపన్ను శాఖ జారీ చేసిన ఆదేశాలను గత ఏడాది మద్రాస్‌ హైకోర్టు కొట్టివేసినప్పటికీ, సుప్రీం కోర్టులో ఇంకా ఇది పెండింగ్‌లో ఉంది.  

► చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పడు ఇష్రాత్‌ జహాన్‌ కేసులో అఫిడవిట్‌ను తారుమారు చేసినట్టుగా ఆరోపణలున్న కేసు ఢిల్లీ పోలీసుల వద్ద పెండింగ్‌లో ఉంది.   

దాక్కోలేదు.. నిందితుడిని కాను
న్యూఢిల్లీ: బుధవారం రాత్రి అరెస్టవ్వడానికి కొద్దిసేపటి ముందు చిదంబరం ఢిల్లీలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చి మీడియాతో మాట్లాడారు. అక్కడ చిదంబరం ఏం చెప్పారో ఆయన మాటల్లోనే..
‘ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో నేను కనీసం నిందితుడిని కూడా కాను. చట్టం నుంచి దాక్కోలేదు. చట్టపరంగా రక్షణ కోరుతున్నాను. నేను చట్టం నుంచి దాక్కుంటున్నానని అంటుండటం చూసి విస్మయం చెందాను. న్యాయం కోసం పోరాడుతున్నాను. ఐఎన్‌ఎక్స్‌ కేసులో నేను కానీ, నా కుటుంబీకులు కానీ, లేదా మరెవ్వరూ నిందితులు కాదు. ఈ కేసులో సీబీఐ, ఈడీలు అభియోగపత్రం కూడా దాఖలు చేయలేదు. సీబీఐ నమోదు చేసిన వాంగ్మూలాల్లోనూ నేను తప్పు చేసినట్లు ఎక్కడా లేదు.

అయినా నేను, నా కొడుకు ఏదో పెద్ద తప్పు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అబద్ధాలు చెప్పడమనే రోగం ఉన్నవారు వ్యాప్తి చేస్తున్న అసత్యాలే ఇవన్నీ. నిజాన్ని దాటి ఏదీ ముందుకు వెళ్లలేదు. సీబీఐ, ఈడీలు నన్ను విచారించడం కోసం నోటీసులు ఇచ్చాయి. ముందుజాగ్రత్తగా అరెస్టు నుంచి నన్ను నేను కాపాడుకునేందుకు కోర్టుకు వెళ్లి తాత్కాలిక రక్షణ కోరాను. నాకు దాదాపుగా గత 15 నెలలపాటు ఆ రక్షణ లభించింది. నేను ఎక్కడా దాక్కోలేదు. నిన్న రాత్రంతా నేను నా లాయర్లతో కలిసి కూర్చొని కోర్టులో సమర్పించాల్సిన పత్రాలను సిద్ధం చేస్తున్నా. ఈ రోజు ఉదయానికే పని ముగిసింది. నా కేసును సుప్రీంకోర్టు శుక్రవారమే విచారిస్తుందని తెలిసింది. నేను న్యాయస్థానం ఆదేశాలకు తలవంచుతున్నాను. దర్యాప్తు సంస్థలు పారదర్శకంగా పనిచేయకపోయినా సరే, నేను చట్టాన్ని గౌరవిస్తాను’అని మీడియాతో అన్నారు.

కక్షగట్టారు: కాంగ్రెస్‌
చిదంబరానికి కాంగ్రెస్, ఆ పార్టీ నేతలు పూర్తి మద్దతు ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందునే ఆయనపై కక్షగట్టి కేంద్రం వేధిస్తోందని వారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థ లను, ఓ వర్గం మీడియాను ఉపయోగించి చిదంబరం వ్యక్తిత్వాన్ని హతమార్చడానికి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ నాయకుడు రాహు ల్‌ గాంధీ ఆరోపించారు. చిదంబరాన్ని కేంద్రం వేటాడుతోందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. కాంగ్రెస్‌ ఓ ట్వీట్‌ చేస్తూ ఏది ఏమైనా తాము చిదంబరానికి పూర్తి మద్దతుగా ఉంటామని తెలిపింది.

‘అధికారంలో ఉన్నవారికి వ్యతిరేకంగా నిజం మాట్లాడే పౌరులను పీడించడం ద్వారా ప్రభుత్వం తన పిరికితనాన్ని మళ్లీ మళ్లీ బయటపెట్టుకుంటోంది. చిదంబరం ఎన్నో అర్హతలున్న, గౌరవనీయ నాయకుడు. అంకితభావం, వినయంతో ఆయన ఈ దేశానికి సేవ చేశారు. సత్యాన్వేషణలో మేం ఆయనకు మద్దతుగా ఉంటాం. ఏది ఏమైనా సరే’అని కాంగ్రెస్‌ ట్విట్టర్‌లో పేర్కొంది. పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా, ఇతర సీనియర్‌ నాయకులు ఆనంద్‌ శర్మ, శశి థరూర్‌ తదితరులు చిదంబరానికి మద్దతుగా మాట్లాడా రు. బీజేపీకి చెందిన ముఖ్యమంత్రులు, మంత్రులపై ఎన్ని ఆరోపణలున్నా వారంతా పదవులు అనుభవిస్తున్నారని వారు ఆరోపించారు.

తప్పు చేసి ఉంటే శిక్ష తప్పదు: బీజేపీ
చిదంబరంపై కేసు విషయంలో కాంగ్రెస్‌ చేసిన కక్షసాధింపు వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. విచారణలో తాము జోక్యం చేసుకోవడంలేదనీ, చిదంబరం తాను చేసిన పనుల వల్లే ఈ పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తోందని పేర్కొంది. ‘ఆయన (చిదంబరం) ఏదైనా తప్పు చేసి ఉంటే, తప్పకుండా ఆయన ఆ పరిణామాలను ఎదుర్కోవాల్సిందే. దర్యాప్తు సంస్థలు ప్రభుత్వాదేశాలతో పనిచేయవు. స్వతంత్రంగా పనిచేసే అధికారాలు వాటికి ఉన్నాయి’ అని బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్‌ హుస్సేన్‌ అన్నారు.  


అరెస్ట్‌కు ముందు ఏఐసీసీ కార్యాలయంలో చిదంబరం


చిదంబరం ఇంట్లోకి వస్తున్న సీబీఐ అధికారుల కారును అడ్డుకుంటున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top