ఒక్క కేసు; ఎన్నో ట్విస్ట్‌లు!

No Judge to Hear Kuldeep Singh Sengar Case - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఉన్నావ్‌ గ్యాంప్‌ రేప్‌ కేసులో బాధితురాలి న్యాయపోరాటం ఫలించే సూచనలు కనిపించడం లేదు. రెండేళ్ల నుంచి న్యాయపోరాటం చేస్తున్న బాధితురాలు ఆస్పత్రిలో చావుబతుకుల్లో ఉంది. ఈ కేసులో ఇప్పటివరకు ట్రయల్‌ కోర్టు విచారణ ప్రారంభం కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్‌సింగ్‌ సెంగార్‌ను విచారించేందుకు న్యాయమూర్తి లేకపోవడం గమనార్హం. ఆయనకు వ్యతిరేకంగా గతేడాది జూలైలో సీబీఐ చార్జిషీటు దాఖలు చేసినా ఇప్పటివరకు విచారణ ప్రారంభం కాలేదు. సీబీఐ ప్రత్యేక కోర్టుకు జడ్జి లేకపోవడంతో కేసు విచారణ ముందుకు సాగలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌ నెల మధ్యలో సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి బదిలీ అయ్యారు. అప్పటి నుంచి ఎవరినీ నియమించకపోవడంతో ఈ పోస్ట్‌ ఖాళీగా ఉంది. న్యాయం ఆలస్యమవుతుండటంతో బాధితురాలి కుటుంబం ఎన్నో కష్టాలు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఎమ్మెల్యే సెంగార్‌ అనుచరులు జరిపిన దాడిలో తండ్రి ప్రాణాలు కోల్పోగా, ఆమె బాబాయి జైలుపాలయ్యాడు. ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తన ఇద్దరు బంధువులను కోల్పోయింది. బాధితురాలితో పాటు ఆమె తరపు న్యాయవాది కూడా తీవ్రంగా గాయపడ్డారు.

కేసు నేపథ్యం..
2017 ఏప్రిల్‌ 4, 11న రెండు పర్యాయాలు తనపై లైంగిక దాడి జరిగినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే కుల్దీప్‌సింగ్‌ తనపై ఆఘాయిత్యానికి పాల్పడ్డారని పేర్కొంది. తనను బలవంతంగా ఎత్తుకుపోయి కుల్దీప్‌ ఇంట్లో మరోసారి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. ఏప్రిల్‌ 11న దారుణం గురించి బాధితురాలి కుటుంబ సభ్యులు ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేను కేసు నుంచి తప్పించేందుకు ఉన్నావ్‌ పోలీసులు ప్రయత్నించారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాధితురాలిని పోలీసులు తమ ‘కస్టడీ’లోకి తీసుకుని 12 రోజుల పాటు ఆమె మనసు మార్చేందుకు విఫలయత్నం చేశారని వెల్లడించారు. ఏప్రిల్‌ 4న జరిగిన ఆఘాయిత్యం గురించి మర్చిపోవాలని, కుల్దీప్‌సింగ్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయొద్దని బాధితురాలిని ఒప్పించేందుకు ప్రయాసపడ్డారని ఆమె కుటుంబ సభ్యులు వివరించారు. సెంగార్‌ను నిందితుడిగా పేర్కొంటూ రెండోసారి ఫిర్యాదు చేయగా ఎమ్మెల్యే తన రాజకీయ పలుకుబడితో ఉన్నావ్‌ పోలీసులను తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. దీంతో బాధిత కుటుంబం తమకు న్యాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాసింది.  

సీఎం హామీయిచ్చినా..
న్యాయం జరిగేలా చూస్తానని గతేడాది ముఖ్యమంత్రిని కలిసినప్పుడు తమకు హామీయిచ్చారని, ఇప్పటివరకు కేసు విచారణ అడుగు కూడా ముందుకు కదల్లేదని బాధితురాలి బాబాయ్‌ వాపోయారు. ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భార్యకు అంత్యక్రియలు నిర్వహిందుకు ఆయన ఈరోజు పెరోల్‌పై బయటకు వచ్చారు. ఎమ్మెల్యే సెంగార్‌పై పెట్టిన రేప్‌ కేసును వెనక్కు తీసుకోవాలని అతడి అనుచరులు గతేడాది ఏప్రిల్‌ 2న ఉన్నావ్‌లో అందరూ చూస్తుండగా బాధితురాలి తండ్రిని చావబాదారు. ఎమ్మెల్యే గుండాలను వదిలేసిన పోలీసులు.. అక్రమ ఆయుధాలు కలిగివున్నాడన్న నిందమోపి బాధితురాలి తండ్రిని అరెస్ట్‌ చేశారు. జైలులో తీవ్రంగా హింసించడంతో ఏప్రిల్‌ 9న అతడు ప్రాణాలు వదిలాడు.

వరుస ఎదురుదెబ్బలతో బాధితురాలు గతేడాది ఏప్రిల్‌ 8న ఏముఖ్యమంత్రి నివాసం ఎదుట ఆత్మహత్యాయత్నం చేసింది. జాతీయ మీడియా, కేంద్ర సంస్థలు స్పందించడంతో దిగొచ్చిన ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. బాధితురాలి తండ్రిపై దాడి కేసులో ఎమ్మెల్యే సోదరుడిని వెంటనే పోలీసులు అరెస్ట్‌ చేశారు. మైనర్‌ బాలికపై లైంగిక దాడి చేశారన్న ఆరోపణలతో ఏప్రిల్‌ 11న ఎమ్మెల్యే సెంగార్‌పై పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. తర్వాత ఈ కేసును సీబీఐకి అప్పగించారు. రేప్‌, హత్య కేసుల్లో చార్జిషీటును గతేడాది జూలైలో ప్రత్యేక కోర్టుకు సీబీఐ సమర్పించింది. అంతకుమించి విచారణ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో బాధితురాలు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురికావడం అనుమానాలకు తావిస్తోంది. ప్రమాదం పేరుతో బాధితురాలిని హతమార్చేందుకు ఎమ్మెల్యే సెంగార్‌ ఇదంతా చేయించారన్న ఆరోపణలు రావడంతో ఆయనతో పాటు 10 మందిపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని, ఆమె తరపు న్యాయవాది క్రమంగా కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. (చదవండి: ‘ఉన్నావ్‌’ రేప్‌ బాధితురాలికి యాక్సిడెంట్‌)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top