ఉగ్రనేతలకు బిగ్‌ షాక్‌ | NIA filed Charge Sheet against Hafiz and Salahuddin | Sakshi
Sakshi News home page

Jan 18 2018 1:51 PM | Updated on Oct 17 2018 5:14 PM

NIA filed Charge Sheet against Hafiz and Salahuddin - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉగ్ర నేతలు హఫీజ్‌ సయ్యిద్‌, సయ్యద్‌ సలావుద్దీన్‌లకు జాతీయ విచారణ సంస్థ(ఎన్‌ఐఏ) గట్టి షాక్‌ ఇచ్చింది. జమ్ము కశ్మీర్‌ అ‍ల్లర్ల సందర్భంగా ఉగ్ర కార్యకలాపాలకు సాయం అందించినందుకు వారి పేర్లను ఛార్జ్‌షీట్‌లో నమోదు చేసింది. ఈ మేరకు ఢిల్లీ కోర్టులో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది.

కశ్మీర్‌ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు.. ఆర్థిక సాయం వెనుక వేర్పాటు వాద నేతలు, కొందరు వ్యాపార వేత్తల హస్తం ఉన్నట్లు ఎన్‌ఐఏ మొదటి నుంచి చెబుతోంది. ఈ క్రమంలో 12 మంది పేర్లతో.. 1,279 పేజీలతో కూడిన ఛార్జ్‌ షీట్‌ను ఢిల్లీలోని ఓ న్యాయస్థానానికి అందజేసింది. ఛార్జ్‌ షీట్‌లో పేర్కొన్న నిందితులను విచారణ చేపట్టేందుకు అనుమతించాలంటూ కోర్టును ఎన్‌ఐఏ కోరగా.. కోర్టు నిర్ణయాన్ని తదుపరి విచారణకు వాయిదా వేసింది.

ఆరు నెలల విచారణ.. 60 ప్రాంతాల్లో తనిఖీలు, 300 మంది ప్రత్యక్ష సాక్ష్యుల నుంచి వాంగ్మూలం సేకరణ.. 950 పత్రాల స్వాధీనం.. ఇలా అన్ని కోణాల్లో సాక్ష్యాలను సేకరించాకే ఎన్‌ఐఏ పక్కాగ ఈ ఛార్జ్‌ షీట్‌ను రూపొందించింది. లష్కర్‌-ఇ-తాయిబా చీఫ్‌ హఫీజ్‌ సయ్యిద్‌ పేరును..  హురియత్‌ కాన్ఫెరెన్స్‌, హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌, దుఖ్‌టరన్‌-ఇ-మిలత్‌ సంఘాల అధినేత సయ్యద్‌ సలావుద్దీన్‌ పేర్లను ఛార్జ్‌ షీట్‌లో పేర్కొంది. వీరిద్దరు ఉగ్రవాదులను భారత్‌పైకి ఉసిగొల్పటంతోపాటు వారికి ఆర్థిక సాయం అందించారని పేర్కొంది.

ఇక జమ్ము కశ్మీర్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జహూర్‌ అహ్మద్‌ వాటాలి పేరు కూడా ఛార్జ్‌షీట్‌లో ఉండటం విశేషం. మాజీ మిలిటెంట్‌ బిట్టా కరాటె, ఫోటో జర్నలిస్ట్‌ కమ్రాన్‌ యూసఫ్‌, జావేద్‌ అహ్మద్‌ భట్‌ పేర్లను కూడా ఎన్‌ఐఏ ఇందులో పొందుపరిచింది. రెండేళ్ల క్రితం భద్రతా దళాల కాల్పుల్లో బుర్హన్ వనీ మరణించిన తర్వాత కశ్మీర్‌ లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఏ విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి 10 మందిని పోలీసులు అరెస్ట్‌ చేయగా.. వారి జ్యూడీషియల్‌ కస్టడీ గడువు నేటితో ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement