పాశవికంగా హతమారుస్తున్న కసాయిలు

Murder Cases Are Increasing In Medak District - Sakshi

చిన్నాభిన్నమవుతున్న కుటుంబాలు 

ఇప్పటికీ మిస్టరీగానే పలు ఘటనలు 

వరుస ఘటనలతో జిల్లాలో కలకలం 

పచ్చటి పంటలతో కళకళలాడాల్సిన మెతుకుసీమలో కర్కశత్వం రాజ్యమేలుతోంది. మానవ సంబంధాలు పూర్తిగా మంటగలుస్తున్నాయి. ఎంతో మేధాస్సు కలిగిన మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోయింది. ప్రేమ, వివాహేతర సంబంధాలు, కులాంతర వివాహాలు, భార్యాభర్తల మధ్య అనుమానం, భూ వివాదాలు, ఆస్తి, వ్యాపార, నగదు లావాదేవీలతో ఏర్పడిన కక్షలు, తగాదాలే హత్యలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. మానవత్వపు విలువలు మరిచిన కసాయిలు రాక్షసులుగా మారి కనికరం లేకుండా సాటి మనుషులను అత్యంత కిరాతకంగా, పాశవికంగా హతమారుస్తున్నారు. జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న వరుస ఘటనపై ప్రత్యేక కథనం..  

సాక్షి, మెదక్‌: చిన్నపాటి గొడవలకే కక్ష పూరిత నిర్ణయాలతో ఓ పథకం ప్రకారం హత్యలకు పాల్పడుతున్నారు. చట్టం నుంచి తప్పించుకునేందుకు నేరస్తులు చేసే ఒక్కో ప్రయత్నాలు సినీ ఫక్కీని తలపిస్తున్నాయి. ఒక చోట చంపి మరొక చోట శవాన్ని పడేయటం. ముఖాన్ని గుర్తు పట్టలేనంతగా ఛిద్రం చేయడం వంటివి ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో పోలీసులు జరిపే క్షేత్రస్థాయి విచారణలో నేరస్తులు పట్టుపడుతున్నప్పటికీ, మరికొన్ని కేసులు పురోగతి లేకుండానే మిగిలిపోతున్నాయి. ఇప్పటికీ కొన్ని ఘటనల్లో హత్యకు గురైన వ్యక్తుల వివరాలు తెలియక పోలీస్‌స్టేషన్లలో కాగితాలకే పరిమితమయ్యాయి.   

కుటుంబ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందనే.. 
కుటుంబ పరువు ప్రతిష్ఠతల పరిరక్షణ కోసం ఎక్కువగా హత్యలకు పాల్పడుతూ మానవమృగాలుగా మారుతున్నారు. ప్రేమ, కులాంతర వివాహాలు, వివాహేతర సంబంధాలు, భార్యభర్తల మధ్య అనుమానాలు వంటి ప్రతిష్ఠకు భంగం కలిగించే పలు కారణాలతో అత్యంత కిరాతకంగా మారుతున్నారు. 

జిల్లాలో జరిగిన కొన్ని ఘటనలు ఇవి 

  • మరోవ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య తనను ప్రియుడితో కలిసి ఎక్కడ హతమారుస్తుందోననే భయంతో ఈ ఏడాది ఆగస్టు 17వ తేదీన హవేళిఘణాపూర్‌ మండలం ఔరంగాబాద్‌ తండాకు చెందిన దేవ్లా అతడి భార్య విజయ(26)ను మరో ఇద్దరితో కలిసి పథకం ప్రకారం హత్యచేశారు. దీంతో వారి ముగ్గురు పిల్లల పరిస్థితి అంధకారమైంది.  
  • ఈ ఏడాది అక్టోబర్‌ 26న ఓ గుర్తు తెలియని మహిళను వేరేచోట హత్యచేసి శవాన్ని ముక్కలు ముక్కలు చేసి పాపన్నపేట మండలం ఏడుపాయల దేవస్థానం సమీపంలో పడేశారు.  
  • పాపన్నపేట మండలం ఏడుపాయల దేవస్థానం సమీపంలో ఈ నెల 19వ తేదీన 45 ఏళ్ల వయస్సు కలిగిన ఓ వ్యక్తిని కళ్లల్లో కారం చల్లి, కత్తితో గొంతు కోసి, బండరాయితో తల పై బాది కుటుంబీకులే అత్యంత దారుణంగా హత్య చేశారు.  

కక్ష పూరితంగానే హత్యలు.. 
ప్రతీ హత్య వెనుక కక్ష పూరిత నిర్ణయాలు ఉంటున్నాయి. పథకం ప్రకారమే హత్యలు చేస్తూ నేరాలకు పాల్పడుతున్నారు. ప్రతీ కేసులో హత్యకు గల కారణాలను తెలుసుకుంటూ నిందితులను గుర్తించి పురోగతి సాధిస్తున్నాము. ప్రేమ, వివాహేతర సంబంధాలు, కుటుంబ తగాదాలే ఘటనలకు కారణమవుతున్నాయి. నేరస్తుల పై చట్టం కఠినంగా వ్యవహరిస్తుంది. 
   –  కృష్ణమూర్తి, డీఎస్పీ, మెదక్‌  

గుర్తు తెలియని మృతదేహాలు  2017 2018 2019 
పురుషులు 19 13 18
స్త్రీలు 02 07 06
మొత్తం 21 20 24
Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top