ప్రతీకారంతోనే హత్యాయత్నం

Murder Attempt On Person About Retribution In Madanapalle - Sakshi

సాక్షి, మదనపల్లె(చిత్తూరు) : ప్రతీకారంతోనే ఆటో డ్రైవర్‌ కాయల ఈశ్వర్‌ (38)పై ప్రత్యర్థులు హత్యాయత్నానికి పాల్పడ్డారని వన్‌ టౌన్‌ సీఐ తమీమ్‌ అహమ్మద్‌ బుధవారం విలేకరులకు తెలిపారు. ఈ నెల 8 రాత్రి బుగ్గకాలువలోని యాహల్లి లేఔట్‌ సమీపంలో కాయల ఈశ్వర్‌పై బుగ్గకాలువలో ఉంటున్న మల్లెల ఆనంద్‌ కుమార్‌ వర్గీయులు ఏడుగురు వేట కొడవళ్లతో దాడిచేసి హతమార్చేందుకు యత్నించారని, అనంతరం పారిపోయిన ఏడుగురు నిందితులను బుధవారం అరెస్టు చేసినట్లు చెప్పారు. మరొకరిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. ఇరువర్గాల నడుమ ఆధిపత్య పోరే హత్యాయత్నానికి దారితీసిందని పేర్కొన్నారు.

గత ఏడాది వీధిలో వినాయకుని విగ్రహం ఏర్పాటుచేసే విషయమై ఈశ్వర్‌ వర్గానికి, మల్లెల ఆనంద్‌ కుమార్‌ వర్గానికి ఘర్షణ చోటుచేసుకుందని, అప్పటి నుంచి ఒకరిపై మరొకరు కక్ష పెంచుకున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో స్థానిక యాహల్లి లేఔట్‌ సమీపంలో ఈశ్వర్‌ ఒంటరిగా మద్యం తాగుతున్నాడని తెలుసుకుని ఆనంద్‌ కుమార్‌ అనుచరులు బుగ్గకాలువకు చెందిన వనపర్తి వినోద్‌ కుమార్, వనపర్తి మంజునాథ, గుర్రాల లోకేశ్వర్, ప్రకాశం వీధికి చెందిన మల్లెల సందీప్, కోసువారి పల్లెకు చెందిన మల్లెల శాంతరాజ్, రాంనగర్‌కు చెందిన కుందన రామకృష్ణ కర్రలు, వేటకొడవళ్లతో ఈశ్వర్‌పై దాడి చేశారన్నారు.

వారి దాడిలో తీవ్రంగా గాయపడి తప్పించుకుని జనావాసాల మధ్యకు వచ్చి పడిన బాధితుడిని గమనించిన అక్కడి ప్రజలు వెంటనే సమాచారం ఇవ్వడంతో తమ సిబ్బందితో అక్కడికి చేరుకుని ప్రాణాపాయస్థితిలో ఉన్న ఈశ్వర్‌ను పోలీస్‌ వాహనంలోనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం డాక్టర్లు సూచన మేరకు అతన్ని స్విమ్స్‌కు తరలించగా ప్రస్తుతం కోలుకుంటున్నాడని తెలిపారు. హత్య కేసులో నిందితులను పట్టుకోవడానికి శ్రమించిన ఎస్‌ఐలు, సిబ్బందిని సీఐ అభినందించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top