కత్తి దూసిన ‘కిరాతకం’ | Most brutal murder of a boy in Hostel | Sakshi
Sakshi News home page

కత్తి దూసిన ‘కిరాతకం’

Aug 7 2019 4:47 AM | Updated on Aug 7 2019 4:47 AM

Most brutal murder of a boy in Hostel - Sakshi

ఆదిత్య (ఫైల్‌)

అవనిగడ్డ/చల్లపల్లి: మూడో తరగతి చదువుతున్న బాలుడిని అత్యంత పాశవికంగా మెడకోసి హత్య చేసిన ఘటన కృష్ణా జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చల్లపల్లి నారాయణరావు నగర్‌లో నివాసం ఉంటున్న దాసరి రవీంద్ర కుమారుడు దాసరి ఆదిత్య (8) బీసీ వసతి గృహంలో మూడో తరగతి చదువుతున్నాడు. ఇతని సోదరుడు ఇదే వసతి గృహంలో ఏడో తరగతి చదువుతున్నాడు. సోమవారం రాత్రి మూత్ర విసర్జనకు బయటకు వెళ్లిన ఆదిత్య వసతి గృహం పై అంతస్తులో ఉన్న మరుగుదొడ్డిలో దారుణ హత్యకు గురయ్యాడు.

తెల్లవారుజామున ఐదు గంటలకు బక్కెట్‌ కోసం పైకి వెళ్లిన విద్యార్థి వాకలయ్య రక్తపు మడుగులో పడిఉన్న ఆదిత్యను చూసి వెంటనే కిందకు వచ్చి వాచ్‌మెన్‌ నాగరాజుతో చెప్పాడు. పైకి వెళ్ళిన వాచ్‌మెన్‌ ఆదిత్య పడిపోయి ఉంటాడని భావించి వైద్యశాలకు తీసుకెళ్ళేందుకు పైకిలేపగా, మెడ సగభాగం తెగి ఉండటం, అప్పటికే విగత జీవిగా ఉండటంతో ఆదిత్య మృత దేహాన్ని గోడకు కూర్చోబెట్టి ఇన్‌చార్జి వార్డెన్‌కు సమాచారం ఇచ్చాడు. ఏఎస్పీ ఎం.సత్తిబాబు, డీఎస్పీ ఎం.రమేష్‌రెడ్డి హత్యాస్థలిని పరిశీలించారు. డాగ్‌ స్క్వాడ్‌ని రప్పించగా బాత్‌రూం నుంచి వెనకున్న ప్రహరీ గోడ వరకు వెళ్లి వెనక్కి వచ్చింది. హతుని తండ్రికి, పిన్నికి మధ్య ఉన్న అక్రమ సంబంధం నేపథ్యంలో హత్య జరిగిందని అనుమానిస్తున్నారు. కాగా, ఆదిత్యను వసతి గృహ విద్యార్థే హతమార్చినట్లు సమాచారం. 

మృతుని కుటుంబ సభ్యుల ఆందోళన
బాలుడిని అత్యంత దారుణంగా హత్య చేసిన వారిని అరెస్ట్‌ చేసే వరకు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తీసుకెళ్లనీయబోమని మృతుని బంధువులు వసతి గృహం గేటు వద్ద ఆందోళనకు దిగారు. ఏఎస్పీ సత్తిబాబు వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement