దూసుకొచ్చిన మృత్యువు

Men Died in Tractor Accident Srikakulam - Sakshi

ఇటుకల ట్రాక్టర్‌ ఢీకొని ప్రైవేటు మెడికల్‌ ప్రాక్టీస్‌నర్‌ దుర్మరణం

అయ్యప్పస్వామి గుడి సమీపంలో దారుణం

పొనుగుటివలసలో విషాదం

శ్రీకాకుళం , రాజాం సిటీ: నగరపంచాయతీ పరిధిలోని పాలకొండ రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పొనుగుటివలస గ్రామానికి చెందిన రెడ్డి బాబూరావు(49) మృతిచెందాడు. ఈయన ప్రైవేటు మెడికల్‌ ప్రాక్టీస్‌నర్‌గా సేవలందిస్తూ వచ్చే కొద్దొగొప్పో ఆదాయంతో ఇంటిని నెట్టుకొస్తున్నాడు. రోజువారీ దినచర్యలో భాగంగా గురువారం కూడా రేగిడి మండలం కొర్లవలస గ్రామానికి ప్రాక్టీస్‌ నిమిత్తం వెళ్లి తిరిగి ఇంటి ముఖం పట్టాడు. అయ్యప్పస్వామి గుడి సమీపంలో వెనుకగా వస్తున్న ఇటుకల ట్రాక్టర్‌ ఢీకొనడంతో బాబూరావు రోడ్డుపై పడిపోయాడు. ఈయన తలపైభాగం మీదుగా ట్రాక్టర్‌ చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అటుగా వెళుతున్న ప్రయాణికులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన జరిగిన ప్రాంతం సంతకవిటి మండల పరిధిలో ఉండడంతో సంతకవిటి ఎస్సై సీహెచ్‌ రామారావుతో పాటు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ఆరా తీశారు. కుటుంబీకులకు సమాచారం అందించారు. కేసు నమోదుచేసి సీఐకి సమాచారం అందించారు. మరోవైపు రాజాం రూరల్‌ సీఐ రుద్రశేఖర్‌ సంఘటనా స్థలం వద్దకు చేరుకొని ఘటనపై వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించి అనంతరం కుటుంబీకులకు అందజేశారు.

రోడ్డున పడిన కుటుంబం
బాబూరావు సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి. ప్రతి రోజు కష్టపడుతూ మెడికల్‌ ప్రాక్టీస్‌నర్‌గా సేవలందించి వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈయనకు భార్య ధనలక్ష్మి, తల్లి రత్నాలమ్మతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి జీవన భారం మొత్తం బాబూరావుపైనే ఉండేది. ఈయన పెద్ద కుమారుడు సందీప్‌ డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా చిన్నకుమారుడు సుదీప్‌ ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మరోవైపు కొత్త ఇళ్లు కూడా నిర్మించుకొని మరో పది రోజుల్లో గృహప్రవేశానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇంతలో విధి వక్రీకరించి ఇటుక ట్రాక్టర్‌ రూపంలో మృత్యువు కబళించింది. బాబూరావు మృతిని కుటుంబం జీర్ణించుకోలేకపోతుంది. భర్త మృతదేహంపై భార్య ధనలక్ష్మి రోధించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. కళ్లముందున్న కొడుకు మృతదేహం చూసి తల్లి రత్నాలమ్మ రోదిస్తున్న తీరు పలువురిని కంటతడిపెట్టించింది. దేవుడా మా కుటుంబానికి ఎందుకింత అన్యాయం చేశావంటూ ఆమె గుండెలవిసేలా విలపించింది. పొనుగుటివలసతో పాటు పరిసర గ్రామాలకు చెందిన బాబూరావు స్నేహితులు, బంధువులు పొనుగుటివలసకు చేరుకొని అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top