దాన్ని చంపేశాను.. నువ్వు రావాల్సిన అవసరం లేదు!

Married Woman Murdered In Sathupalli - Sakshi

వివాహిత హత్య

సాక్షి, సత్తుపల్లి: సత్తుపల్లి పట్టణ పరిధిలోని అయ్యగారిపేటలో బుధవారం ఓ వివాహిత హత్య సంఘటన వెలుగుచూసింది. విశ్వసనీయ కథనం ప్రకారం.. మండల పరిధిలోని కాకర్లపల్లి గ్రామానికి చెందిన పంతంగి వాణి(24) సత్తుపల్లిలోని ఓ దుకాణంలో పనిచేస్తోంది. మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో దుకాణంలో పని ముగించుకుని ఆటోలో సత్తుపల్లికి చెందిన ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌ సందీప్‌తో కలిసి వెళ్లినట్లు సీసీ పుటేజీల్లో రికార్డయింది. ఆటోలో అయ్యగారిపేటలోని పామాయిల్‌ తోట వరకు వెళ్లారు. మళ్లీ ఫోన్‌ చేసినప్పుడు రావాలని ఆటో డ్రైవర్‌కు చెప్పి పంపించారు. బుధవారం ఉదయం మహిళ మృతి చెందిపడి ఉన్న ట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చా రు. సంఘటన స్థలాన్ని సందర్శించిన పోలీసులు.. పంతంగి వాణిగా గుర్తించారు. చున్నీతో మెడకు చుట్టి హత్య చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. సంఘటనా స్థలంలో పెనుగులాట జరిగినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. చేతి గాజులు పగిలి, దుస్తులు చిరిగి కన్పించాయి. (అత్తయ్యతో కలిసి నటి టిక్‌టాక్‌ ఛాలెంజ్‌ )

ఆటో డ్రైవర్‌  గంట తర్వాత సందీప్‌కు ఫోన్‌ చేసి ఆటో తీసుకురావాలా? అని అడిగాడు. ‘దాన్ని చంపేశాను.. నువ్వు రావాల్సిన అవసరం లేదు.. నీ డబ్బులు మళ్లీ కలిసినప్పుడు ఇస్తా’అని సందీప్‌ చెప్పినట్టు సమాచారం. దీంతో భయభ్రాంతులకు గురైన సత్తుపల్లి పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్‌ జరిగిన విషయాలను బంధువులకు వివరించటంతో పాటు సత్తుపల్లి పోలీసులకు సమాచారం అందించినట్టు తెలిసింది. అప్పటివరకు అనుమానాస్పద కేసుగా భావించిన పోలీసులు.. సందీప్‌ హత్య చేసినట్టు అనుమానించి ఇంటికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. ఫోన్‌ కాల్‌డేటా ఆధారంగా సందీప్‌ కదలికలను గుర్తించినట్టు సమాచారం. మహిళను హత్య చేసి ఏమీ తెలియనట్టు విధులకు కూడా హాజరైనట్టు తెలిసింది. భార్యను వేధించటం వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు సందీప్‌పై ఇప్పటికే ఓ కేసు ఉంది. (ఆర్థిక లావాదేవీలతోనే ఆనంద్‌రెడ్డి హత్య)

ఇద్దరు పిల్లల మూగరోదన
పంతంగి వాణి, శ్రీనివాసరావులకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త చెవిటి, మూగవాడు. కూలి పనులకు వెళ్తుంటాడు. మృతురాలు పంతంగి వాణిది పశ్చిమగోదావరిజిల్లా లింగపాలెం మండలం ముచ్చర్ల గ్రామం. వీరికి ఆరేళ్ల పాప, ఐదేళ్ల బాబు ఉన్నారు. పంతంగి వాణి విగతజీవిగా పడి ఉండటంతో పిల్లలకు ఏమీ అర్థంకాగా బిత్తరపోయి చూస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. నాలుగు నెలల క్రితం నుంచే సత్తుపల్లిలోని దుకాణంలో పని చేస్తోంది. మృతదేహానికి సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సత్తుపల్లి రూరల్‌ సీఐ కరుణాకర్‌ తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top