ఆర్థిక లావాదేవీలతోనే ఆనంద్‌రెడ్డి హత్య

Three Arrested In Khammam Assistant Labor Officer Murder Case - Sakshi

ఖమ్మం అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు 

సాక్షి ప్రతినిధి, వరంగల్‌/కాజీపేట అర్బన్‌/భూపాలపల్లి: ఖమ్మం అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ ఆనంద్‌రెడ్డి హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని అడిషనల్‌ డీసీపీ మల్లారెడ్డి తెలిపారు. బుధవారం హన్మకొండ పోలీస్‌ స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కేసుకు సంబంధించి ఆరుగురు నిందితుల్లో ముగ్గురి ని అరెస్టు చేశామని, మిగిలిన ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపారు. వారి కోసం 4 ప్రత్యేక బృందా లు గాలిస్తున్నాయని చె ప్పారు. నిందితుల నుంచి ఒక వాహనం, 2 కత్తులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

ఏడాదిన్నర క్రితం ఖమ్మం అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ ఆనంద్‌ రెడ్డికి, కమలాపూర్‌ మండలం శనిగరం గ్రామానికి చెందిన పింగిళి ప్రదీప్‌రెడ్డితో పరి చయం ఏర్పడింది. ఇది స్నేహంగా మారింది. ప్రదీప్‌రెడ్డి మహారాష్ట్రలో గోదావరి అవతల ఇసుక క్వారీ నడిపిస్తున్నాడు, ఈ క్రమంలో ఆనంద్‌రెడ్డి ఇసుక వ్యాపారం నిమిత్తం డబ్బులు వెచ్చించాడు. తిరిగి డబ్బులు చెల్లించాలని ఇటీవల ప్రదీప్‌రెడ్డిపై ఒత్తిడి పెంచాడు. దీంతో ఈనెల 7న∙ఆనంద్‌రెడ్డిని హన్మకొండలోని అశోకా హోటల్‌కు పిలిపించిన ప్రదీప్‌రెడ్డి.. తాను తీసుకున్న డబ్బులకు సరిపోయే భూపాలపల్లిలోని తన భూమిని రాసి ఇస్తానని నమ్మబలికాడు. ఉదయం 9 గంటల ప్రాంతంలో హన్మకొండలోని ఓ హోటల్‌ నుంచి ప్రదీప్‌రెడ్డి, డ్రైవర్‌ రమేశ్, మిత్రుడు విక్రమ్‌రెడ్డిలు వెంగళ్‌రావు పేరిట ఉన్న ఇన్నోవా వాహనంలో ఆనంద్‌రెడ్డిని వెనుక కూర్చోబెట్టి తీసుకెళ్లారు.  

మర్డర్‌ చేసేదుంది.. రెడీగా ఉండండి.. 
‘ఆనంద్‌రెడ్డిని భూపాలపల్లికి తీసుకొస్తున్నా.. మర్డర్‌ చేసేది ఉంది మీరు రెడీగా ఉండండి’ అంటూ ఇసుక క్వారీలో పనిచేసే వెంగళ శివరామకృష్ణ, మీనుగు మధుకర్, నిగ్గుల శంకర్‌లకు ప్రదీప్‌రెడ్డి సమాచారం అందించాడు. కొంతదూరం వెళ్లాక ప్రదీప్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డి, రమేశ్‌లు వెనుక కూర్చున్న ఆనంద్‌రెడ్డి నోటికి ప్లాస్టర్‌ వేసి వెనుకకు చేతులు కట్టేసి ఉంచారు. మధ్యాహ్నం 3.30 నిమిషాలకు వీరి వాహనం భూపాలపల్లి అడవుల్లోని రామారం కు చేరుకోగానే.. వాహ నం ఆగడమే ఆలస్యం శివరామకృష్ణ, శంకర్, మధుకర్‌లు ఆనంద్‌రెడ్డిని కింద పడేసి తమ వెంట తెచ్చుకున్న రెండు కత్తుల తో కడుపు, గొంతులో పాశవికంగా పొడిచి దారుణంగా హత్య చేశారు. 

ముగ్గురు నిందితుల అరెస్టు  
కాగా, ఆనంద్‌రెడ్డి ఆచూ కీ కోసం ఏర్పాటు చేసిన 4 ప్రత్యేక బృందా లు హన్మకొండ పబ్లిక్‌ గార్డెన్‌ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా క్వాలిస్‌ వాహనంలో తారస పడిన శివరామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా హత్య చేసింది తామేనని అంగీకరించాడని అడిషనల్‌ డీసీపీ తెలిపారు. దీంతో ఈ కేసుకు సంబంధం ఉన్న శివరామకృష్ణతో పాటు మధుకర్, శంకర్‌లను అదుపులోకి తీసుకున్నామన్నారు. ప్రధాన నిందితుడు పింగిళి ప్రదీప్‌రెడ్డి సహా నిగ్గుల రమేశ్, విక్రమ్‌రెడ్డిలు పరారీలో ఉన్నారన్నారు. 

ప్రశాంత్‌ రెడ్డి ప్రమేయంపై సమాచారం లేదు 
ఆనంద్‌రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడైన ప్రదీప్‌రెడ్డి సోదరుడు, ఇంటెలిజెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రశాంత్‌రెడ్డి ప్రమేయంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని అదనపు డీసీపీ స్పష్టం చేశారు. 

నాకు ఎలాంటి సంబంధం లేదు: ప్రశాంత్‌రెడ్డి 
ఆనంద్‌రెడ్డి హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని ఇంటెలిజెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ పింగిళి ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top