ప్రియుడి చేతిలో మహిళ హత్య

Man Murdered A Married Woman Over Illegal Relationship - Sakshi

ప్రాణం తీసిన అక్రమ సంబంధం

సాక్షి, హసన్‌పర్తి(వరంగల్‌) : భర్త, పిల్లలు ఉన్నా ప్రియుడి మోజులో పడిన ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ప్రియురాలు, ఆమె బంధువులకు తోడు.. తన భార్య నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో ప్రియుడు ఏకంగా ఆమె ప్రాణాలు తీశాడు.. ఆపై పోలీసులకు లొంగిపోయాడు. ఈహత్య హసన్‌పర్తి మండలం ముచ్చర్ల శివారులోని ఓ మొక్కజొన్న చేనులో ఆదివారం జరగగా.. మృతురాలిది వరంగల్‌ రూరల్‌ జిల్లా దామెర మండలం సింగరాజుపల్లి. ఈ ఘటనకు సంబంధించి వివరాలను కాజీపేట ఏసీపీ రవీంద్రకుమార్‌ యాదవ్‌ హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో సోమవారం రాత్రి వెల్లడించారు. 

పెళ్లిలో పరిచయం.. ఆపై సంబంధం
హసన్‌పర్తి మండలం పెంబర్తి గ్రామానికి చెందిన కొయ్యడ చంటికి భార్యాపిల్లలు ఉండగా.. ఆటో నడుపుతూ జీవనం సాగి స్తున్నాడు. ఇక దామెర మండలం సింగరాజుపల్లికి చెందిన మంద రూప(32) తన భర్త, ఇద్దరు పిల్లలతో జీవిస్తోంది. ఈ మేరకు ఐదేళ్ల క్రితం ఓ పెళ్లిలో చంటికి రూపతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే, ఈ విషయం ఇరు కుటుంబాల్లో తెలియడంతో గొడవలు జరుగుతున్నాయి. అయితే పెద్దలు మందలించినా రూప ప్రవర్తనలో మార్పురాలేదు. ఏడాది క్రితం రూప పెంబర్తికి వచ్చి చంటితో గొడవ పడగా, స్థానికులు సర్దిపెచ్చి పంపించారు. అంతేకాకుండా చంటిని ఆయన భార్యతో పాటు రూప భర్త సురేందర్‌ కూడా తరచూ బెదిరించినా ఆయన తన సంబంధాన్ని వీడలేదు. 

హాస్టల్‌ నుంచి మొక్కజొన్న చేనుకు...
రూప కుమార్తె బీమారంలో చదువుకుంటుండగా ఆదివారం మధ్యాహ్నం అక్కడకు వచ్చింది. తొలుత చంటికి ఫోన్‌ చేసి కేయూసీ క్రాస్‌ వద్దకు రమ్మని సూచించగా ఆయన ఆటో తీసుకుని వచ్చాడు. ఆటోలో రూపను ఎక్కించుకుని భీమారం సమీపంలోని గురుకుల పాఠశాల వద్దకు వెళ్లాక ఆమె చంటి సెల్‌ఫోన్, ఆటో తాళాలు తీసుకుని లోపలకు వెళ్లింది. అక్కడే చంటి మూడు గంటల పాటు నిరీక్షించగా.. ఓ పక్క భార్య, మరో పక్క రూప బంధువుల వేధింపులు ఎక్కువైన నేపథ్యంలో సంబంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు రాత్రి 7.30గంటల ప్రాంతంలో వీరిద్దరు వివాహేతర సంబంధాన్ని కొనసాగించే ముచ్చర్ల శివారులోని మొక్కజొన్న చేను వద్దకు చేరుకున్నారు. అక్కడ ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరగడంతో చంటి ఆటోలోని కర్రతో రూప తలపై బలంగా కొట్టగా ఆమె మృతి చెందింది. 

పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు
ఆదివారం రాత్రి రూపను హత్య చేసి చంటి ఏమీ తెలియనట్టు వెళ్లిపోయాడు. రాత్రంతా ఏం చేయాలో తెలియక ఆలోచించిన ఆయనకు ఏ మార్గం కనిపించలేదు. ఎలాగైనా పోలీసులు పట్టుకుంటారనే భయంతో సోమవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో నేరుగా వచ్చి హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. దీంతో నిందితుడిని తీసుకుని పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. అలాగే, రూప మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కుటుంబీకులకు అప్పగించినట్లు ఏసీపీ రవీంద్రకుమార్‌‡ చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌రావు, ఎస్సై ఫ్రవీణ్, రవీందర్, హెడ్‌ కానిస్టేబుల్‌ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ మృతురాలి కుటుంబసభ్యులు భీమారంలో ఆందోళనకు దిగారు. పోలీసులు నచ్చచెప్పి వారిని పంపించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top