సినిమా షూటింగ్‌ అంటూ మోసం!

నిందితుడు విజ్ఞాన్‌ దాసరి - Sakshi

కెమెరాలు అద్దెకు తీసుకొని విక్రయం

వచ్చిన డబ్బుతో జల్సాలు

నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

సాక్షి, బంజారాహిల్స్‌: సినిమా షూటింగ్‌ కోసమని కెమెరాలు అద్దెకు తీసుకోవడం... వాటిని తిరిగి ఇవ్వకుండా విక్రయించడం... వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడం... ఇలా మోసాలకు పాల్పడుతూ తప్పించుకొని తిరుగుతున్న ఓ కేటుగాడిని పోలీసులు వలపన్ని పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్‌ ఎస్‌ఐ ఎ.రవీందర్‌ తెలిపిన వివరాల ప్రకారం... బెల్లంపల్లికి చెందిన విజ్ఞాన్‌ దాసరి(27) మణికొండలో నివాసం ఉంటూ తాను ఈవెంట్‌ ఆర్గనైజర్‌నని ప్రచారం చేసుకుంటాడు.

గత నెల 19న శ్రీకృష్ణానగర్‌లో సినిమా షూటింగ్‌లకు కెమెరాలను అద్దెకిచ్చే మహేష్‌ను కలిసి తాను సినిమా తీస్తున్నానని, రెండు రోజుల పాటు కెమెరా అద్దెకు కావాలని చెప్పి రూ.6 లక్షల విలువ చేసే కెమెరా తీసుకెళ్లాడు.  ఎంతకు తిరిగి రాకపోగా ఫోన్‌ చేస్తే స్పందించలేదు. దీంతో బాధితుడు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పక్కా నిఘా వేసిన పోలీసులు నిందితుడిని రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకొని విచారించారు. అద్దెకు తీసుకున్న కెమెరాను రూ.90 వేలకు విక్రయించి ఆ డబ్బుతో గోవాకు వెళ్లి జల్సాలు చేసినట్లు ఒప్పుకున్నాడు. కెమెరాను రికవరీ చేసిన పోలీసులు లోతుగా విచారించగా గతంలో కూడా మియాపూర్, జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో కెమెరాలు అద్దెకు తీసుకొని అమ్ముకొని జల్సాలు చేసినట్లు తేలింది. నిందితుడిపై ఐపీసీ సెక‌్షన్‌ 406, 420 కింద కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top