తిరువళ్లూరులో కాలు.. కర్నూలులో మృతదేహం | Man Died in Road Accident Tamil Nadu Dead Body Founf in Kurnool | Sakshi
Sakshi News home page

తిరువళ్లూరులో కాలు.. కర్నూలులో మృతదేహం

Jan 11 2019 1:16 PM | Updated on Jan 11 2019 1:16 PM

Man Died in Road Accident Tamil Nadu Dead Body Founf in Kurnool - Sakshi

తమిళనాడు, తిరువళ్లూరు: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడి కాలు తిరువళ్లూరులో లభ్యం కాగా, మృతదేహాన్ని 19 గంటల తరువాత ఆంధ్రప్రదేష్‌ రాష్ట్రం కర్నూలులో గుర్తించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి తాలుకా అత్తిపట్టు గ్రామానికి చెందిన సుధాకర్‌ (33) కాకలూరు సిప్‌కాట్‌లోని పరిశ్రమలో పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి పది గంటలకు షిఫ్ట్‌ ముగించుకుని ఇంటికి బైక్‌పై వెళుతున్నాడు. పాండూర్‌ వద్ద ముందుగా వెళుతున్న లారీని అధిగమిస్తుండగా, తిరుపతి నుంచి చెన్నై వైపు ఎదురుగా అతివేగంగా వచ్చిన కారు ఢీకొంది. ప్రమాదంలో బైక్‌ ఒకవైపు, హెల్మెట్‌ మరోవైపు పడి ఉండగా నడిరోడ్డుపై సుధాకర్‌ కాలు మాత్రం పడి ఉంది. మృతదేహం ఆచూకీ తెలియలేదు. ప్రమాదంపై స్థానికులు తిరువళ్లూరు తాలుకా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, మృతుని బంధువులు సుధాకర్‌ మృతదేహం కోసం అటు చెన్నై వరకు, ఇటు తిరుపతి వరకు ఉన్న వైద్యశాలల్లో తనిఖీలు చేపట్టారు. సుధాకర్‌ మృతదేహం లభించకపోవడంతో ఆగ్రహించిన బంధువులు ఉదయం ఏడు గంటలకు రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు వారితో చర్చించి ఆందోళన విరమింపజేశారు. అయితే ఉదయం పది గంటలు దాటినా మృతదేహం అచూకీ తెలియకపోవడంతో బంధువులు రెండోసారి రాస్తారోకోకు దిగారు. పోలీసులు వారిని సమాధానపరిచారు. అయితే 1 గంట వరకు సుధాకర్‌ మృతదేహం లభ్యం కాకపోవడంతో మళ్లీ రోడ్డెక్కారు. దీంతో పోలీసులు విధిలేక ఆందోళన చేస్తున్న 140మందిని అరెస్టు చేశారు. ఆందోళన కారణంగా గంటల తరబడి వాహనాలు రోడ్డుకు ఇరువైపులా నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

తిరువళ్లూరులో కాలు.. కర్నూలులో మృతదేహం: ప్రమాదం జరిగిన స్థలంలో కాలు మాత్రమే పడి ఉండగా.. మిగతా శరీరం మాత్రం లభించలేదు. దీంతో డీఎస్పీ గంగాధరన్‌ నేతృత్వంలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అటూ తిరుపతి వరకు, ఇటు చెన్నై వరకు ఉన్న వైద్యశాలల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడా సుధాకర్‌ మృతదేహం లభించలేదు. పట్రపెరంబదూరు టోల్‌గేటు వద్ద సీసీ కెమెరాలను పరిశీలించగా ప్రమాదం జరిగిన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ రిజిస్ట్రేషన్‌తో రెండు సిమెంట్‌ లారీలు వెళ్లినట్టు గుర్తించి  కర్నూలు, కడప, నెల్లూరు, చిత్తూరు పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో చెన్నై నుంచి కర్నూలు వెళ్లిన సిమెంట్‌ లారీలో మృతదేహం పడిఉన్నట్టు లారీ డ్రైవర్‌ కర్నూలు పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడి పోలీసులు తిరువళ్లూరు ఎస్పీకి తెలిపారు. అక్కడి నుంచి ఫొటో తెప్పించుకుని సుధాకర్‌ మృతదేహంగా నిర్ధారించారు. అనంతరం హుటాహుటిన కర్నూలు బయలుదేరారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు ఢీకొన్న వేగానికి పైకి ఎగిరి అక్కడ వెళుతున్న లారీలో మృతదేహం పడి ఉండొచ్చని  పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement