నమ్మించి.. మోసగించారు

man cheaed in ysr district with low intrest loans - Sakshi

తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామని మహిళలను మోసగించిన కేటుగాళ్లు

ప్రొద్దుటూరులో వందల్లో బాధితులు

త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాద

ఎమ్మెల్యే రాచమల్లు వద్ద మొరపెట్టుకున్న బాధిత మహిళలు

ప్రొద్దుటూరు క్రైం : తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామని నమ్మబలకడంతో రూ.4 వేలు చొప్పున డబ్బు చెల్లించి పలువురు మహిళలు మోసపోయారు. జిల్లాలోని ఖాజీపేటతో పాటు పలు ప్రాంతాల్లో వందలాది మంది మహిళలు మోసపోయిన సంగతి తెలిసిందే. తాము మోసపోయామని తెలుసుకున్న మ హిళలు ఇప్పటికే పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యా దు చేస్తున్నారు. తాజాగా ప్రొద్దుటూరులోని బొల్లవరం ప్రాంతంలో ఉన్న సుమా రు 60 మందికి పైగా మహిళలు త్రీ టౌన్‌ పోలీస్‌స్టేష్‌లో ఫిర్యాదు చేశారు. బొల్లవరంలోని పెద్దమ్మ చెట్టు, క్రిస్టియన్‌ కాలనీ, ట్రాన్స్‌ఫార్మర్‌ సమీపంలో, సాయికుటీర్‌ రోడ్డు తదితర ప్రాంతాల్లో పలువురు మహిళలు డబ్బు కట్టిన వారిలో ఉన్నారు.

కుక్కర్‌ను ఎరగా వేసి..
గత ఏడాది డిసెంబర్‌ మొదటి వారంలో ఒక వ్యక్తి బొల్లవరానికి వచ్చాడు. తమది పెద్ద సంస్థ అని, ప్రధాన కార్యాలయం గుంటూరులో ఉందని మహిళలతో అన్నా డు. మైదుకూరులో జిల్లా కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని జిల్లాలోని పేద మహిళలకు రుణాలు ఇస్తున్నామని చెప్పాడు. ఒక్క రూపాయి వడ్డీకే రూ.40వేలు ఇస్తామని, ఈ మొత్తాన్ని నెలకు రూ.2వేలు చొప్పున రెండేళ్లు చెల్లించాలని వారితో అన్నాడు. ‘మీరు సక్రమంగా డబ్బు చెల్లిస్తారో లేదో మాకు నమ్మకం కలగాలంటే వారానికి రూ.వెయ్యి చొప్పున నాలుగు వారాలకు రూ.4వేలు కట్టాలని,  ఐదో వారంలో రూ.40వేలు ఇస్తానని’ అతను మహిళలను నమ్మిం చాడు. ఇందుకు గాను ఉచితంగా ముందుగానే ఎలక్ట్రిక్‌ రైస్‌ కుక్కర్‌ ఇస్తామని అతను తెలిపాడు. బొల్లవరంలోని అందరి పేర్లు రాసుకొని వెళ్లిన ఆ కేటుగాడు వారం తర్వాత కుక్కర్‌లను తీసుకొని వచ్చాడు. వారం రోజుల తర్వాత మళ్లీ వస్తామని మొదటి వారం కంతు కింద రూ.వెయ్యి ఇవ్వాలని చెప్పడంతో మహిళలు సరేనని చెప్పి కుక్కర్లు తీసుకున్నారు. ఈ క్రమంలో అతను నాలుగు వారాలు తిరిగి మహిళల వద్ద రూ.4వేలు చొప్పున వసూలు చేసుకున్నాడు. చివరి కంతు డిసెంబర్‌ 28న తీసుకొని, జనవరి 6న రూ.40 వేలు ఇస్తామని మహిళలతో నమ్మబలికాడు. అయితే జనవరి 6 దాటినా డబ్బు తీసుకొని రాకపోవడంతో మోసపోయినట్లు మహిళలు గ్రహించారు.

లబో దిబోమంటున్న మహిళలు..
తక్కువ వడ్డీకి  రుణం వస్తుందనే ఆశతో చాలా మంది మహిళలు ఇళ్లలో తమ భర్తలకు తెలియకుండా డబ్బు చెల్లించారు. బొల్లవరంలోని సునీత అనే మహిళ తన ఇంట్లో ఉన్న ఐదుగురి పేరుతో రూ.20 వేలు కట్టింది. అధిక వడ్డీకి తీసుకున్న అప్పు చెల్లించాలనే ఉద్దేశంతో, వడ్డీకి తీసుకొని ఈ డబ్బు కట్టినట్లు ఆమె చెబుతోంది. అయితే ఇప్పుడు మోసపోయానని తెలియడంతో ఆమె ఆందోళన చెందసాగింది. డ్వాక్రా డబ్బు కట్టడానికి కూడా చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని ఆమె వాపోయింది. ప్రొద్దుటూరులోని చాలా ప్రాంతాల్లో బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యే రాచమల్లు దృష్టికి..
బొల్లవరానికి చెందిన పలువురు మోసపోయిన మహిళలు రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిని కలిశారు. తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామని చెప్పడంతో ఆశ పడి మోసపోయామని వారు ఎమ్మెల్యేతో అన్నారు. రూ.4 వేలు చొప్పున చెల్లించి మోసపోయామన్నారు. అందరూ పేద వారేనని, పనికి వెళ్తేగానీ సంసారాలు జరగవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top