శీలానికి వెల కట్టారు.. | Man Arrested By POCSO ACt For Harassing A Women In Krishna | Sakshi
Sakshi News home page

శీలానికి వెల కట్టారు..

Sep 24 2019 11:41 AM | Updated on Sep 24 2019 11:41 AM

Man Arrested By POCSO ACt For Harassing A Women In Krishna - Sakshi

సాక్షి, అమరావతి :  అమ్మాయి జీవితం నాశనమైందన్న బాధ వారిలో ఏకోశానా లేదు. అందుకు కారణమైన వారిని శిక్షించాలన్న కసి తల్లిదండ్రుల్లో కనిపించలేదు.  ప్రేమ పేరుతో మోసగించి.. వేధించిన నిందితుడి వర్గీయులు, బాధితురాలు ఒకే సామాజిక వర్గానికి వారు కావడంతో ‘డబ్బు’ తో కేసు రాజీ కుదుర్చుకున్నారు. ఇరు  కుటుంబాలు  ఉన్నతస్థాయికి చెందినవి కావడం .. పరువుపోతుందని భావించడంతో  వారంతా  షరతులతో రాజీకి సిద్ధపడ్డారు. భవిష్యత్‌లో నిందితులు తమ కుటుంబం జోలికి రాకుండా షరతులు రూపొందించుకున్నారు. కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. స్నేహం పేరిట లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడు.. అందుకు కారణమైన ప్రధాన సూత్రధారి అయిన అతడి స్నేహితుడిని రక్షించేందుకు రంగంలోకి దిగిన టీడీపీ నేతలు సైతం అదే సామాజిక వర్గానికి చెందినవారు కావడం.. పోలీసులపై ఒతిళ్లు రావడంతో వారు కూడా ‘సామాజిక న్యాయం’ చేసేశారు. ఇటీవల నగరంలో సంచలనం రేకెత్తించిన లైంగిక వేధింపుల కేసును ఇరువర్గాలు అటకెక్కించేసిన తీరు నగరంలో చర్చనీయాంశమైంది.

యువతి నయవంచనకు గురైందిలా.. 
సరిగ్గా నెల రోజుల కిందట ఓ యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి నగర పోలీసు కమిషనరేట్‌ కార్యాలయానికి వచ్చింది. తన కుమార్తెపై ఓ యువకుడి బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ యువతి తండ్రి ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు విచారణను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సీపీ అప్పగించారు. విచారణలో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. విజయవాడలో మాచవరం ప్రాం తంలో ఉన్న ఓ యువకుడి పుట్టిన రోజు వేడుకులకు వెళ్లిన యువతికి అతని స్నేహితుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఆ యువకుడిని నమ్మింది. ఇద్దరూ హద్దులు దాటేశారు. ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు, చిత్రాలు తీసుకున్నారు. తర్వాత ఆ యువకుడు చదువు నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. గతంలో తాము తీసుకున్న నగ్న చిత్రాలను ఆ యువకుడు సూర్యారావుపేటలో ఉన్న తన స్నేహితుడికి ఫోన్‌లో షేర్‌ చేశాడు. తన స్నేహితుడు పంపిన ఫోటోలను చూపి యువతిని ఆ యువకుడు బెదిరించడం ప్రారంభించాడు. చివరకు అతడి బెదిరింపులకు ఆ యువతి భయపడి అతడికి లొంగిపోయింది.

ఆ తర్వాత తరచూ కలవాలని వేధించసాగాడు. ఆఖరకు  డబ్బులు సైతం డిమాండ్‌ చేసి దాదాపు రూ.3 లక్షలు వసూలు చేసుకున్నాడు. అయినా ఆ యువకుడి బెదిరింపులు ఆగకపోవడంతో చివరకు ఆ బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు నగర కమిషనర్‌ ద్వారకా తిరుమలరావును కలసి గత నెలలో ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులోకి టీడీపీ నేతలు కొందరు రంగప్రవేశం చేసి కేసును నీరుగార్చేందుకు యత్నించారు. చివరకు కమిషనర్‌ ఆదేశాల మేరకు ఆ యువకుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని మాచవరం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

రాజీతో కేసు నీరుగార్చారు.. 
ఈ కేసులో అసలు సూత్రధారి ఆస్ట్రేలియాలో ఉన్న నిందితుడని తెలిసిన పోలీసులు అతడిని ఇక్కడికి రప్పించే ప్రయత్నాలు ప్రారంభించడానికి సిద్ధపడ్డారు. సరిగ్గా ఈ సమయంలోనే టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. తొలుత తాము చేసిన ప్రయత్నాలు ఫలితం ఇవ్వకపోవడంతో ఈసారి ఎంతో జాగ్రత్తపడ్డ టీడీపీ నేతలు ‘సామాజిక వర్గం’ కార్డును ఉపయోగించారు. పంచాయతీ టీడీపీ అధినేత వద్ద పెట్టినట్లు సమాచారం. 

నిందితుడిని రక్షించే యత్నం..
వాస్తవానికి ఆస్ట్రేలియాకు విద్యాభ్యాసం కోసం వెళ్లిన నిందితుడిని పోలీసులు ఇక్కడికి రప్పించాల్సి ఉంది. కానీ ఇక్కడ కేసు పెట్టిన బాధితులు, నిందితుల వర్గీయులతో రాజీకి రావడంతో లైంగిక దాడి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆస్ట్రేలియాలో ఉన్న తమ కుమారుడి భవిష్యత్‌ అంథకారం కాకూడదన్న నిర్ణయానికి వచ్చిన నిందితుడి తల్లిదండ్రులు బాధితురాలి కుటుంబసభ్యులు అడిగినంతా ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలిసింది. దానికి అంగీకరించిన యువతి కుటుంబసభ్యులు షరతులపెట్టి డబ్బు తీసుకోవడమే కాకుండా వారి తో అగ్రిమెంటు సైతం రాయించుకున్నట్లు తెలుస్తోంది.  

ఆస్ట్రేలియా నుంచి రప్పిస్తాం.. 
లైంగిక దాడి కేసులో నిందితులను వదిలే ప్రసక్తే ఉండదు. ఆస్ట్రేలియాలో ఉన్న నిందితుడిని రప్పించే యత్నాలు చేస్తున్నాం.  కేసులో ఎలాంటి రాజకీయ జోక్యానికి తావివ్వం. 
– సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు, సీపీ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement