‘అవని’ కేసు క్లోజ్‌!

Maharashtra Government Clean Cheat in Avani Case - Sakshi

నిబంధనల ప్రకారమే మ్యానీటర్‌ వేట  

ఆరోపణలపై ఆధారాలు లేవు

సిటీ హంటర్స్‌కు మహారాష్ట్ర సర్కారు క్లీన్‌చిట్‌

గతవారం లేఖ రాసిన అక్కడి ప్రభుత్వం

సాక్షి, సిటీబ్యూరో: మహారాష్ట్రలోని యవత్‌మాల్‌ ప్రాంతంలో గత ఏడాది నవంబర్‌లో జరిగిన మ్యానీటర్‌ (ఆడపులి) ‘అవని’ని వేట జాతీయ స్థాయిలో తీవ్ర వివాదాస్పదమైంది. ఈ అంశంలో హైదరాబాద్‌కు చెందిన షార్ప్‌షూటర్స్‌ నవాబ్‌ అస్ఘర్‌ అలీ ఖాన్, అతడి తండ్రి నవాబ్‌ షఫత్‌ అలీ ఖాన్‌లపై పలు ఆరోపణలు వచ్చాయి. సాక్షాత్తు కేంద్ర మంత్రి మేనకాగాంధీ సహా అనేక స్వచ్ఛంద సంస్థలు వారిపై విరుచుకుపడ్డాయి. అయితే ఈ ఆరోపణలన్నీ నిరాధారమంటూ మహారాష్ట్ర సర్కారు తేల్చింది. ఈ మేరకు గత వారం అస్ఘర్‌ అలీ ఖాన్‌కు లేఖ రాసింది. 

ఇదీ ‘అవని’ నేపథ్యం...
మహారాష్ట్రలోని తిప్పేశ్వర వైల్డ్‌ లైఫ్‌ శాంక్చ్యురీ నుంచి ఐదేళ్ల వయస్సున్న అవని అనే ఆడపులి గర్భవతిగా ఉండి ఆహారం కోసం యవత్‌మాల్‌ వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో అక్కడికి కాలకృత్యాలు తీర్చుకునేందుకు వచ్చిన ఓ వ్యక్తిపై దాడి చేసి చంపేసింది. అప్పటి నుంచి మ్యానీటర్‌గా మారిన ఆ పులి తరచూ పంజా విసురుతూనే ఉంది. తనకు జన్మించిన రెండు పులి పిల్లలు దీంతో కలిసే ఆ ప్రాంతంలో సంచరించాయి. ఈ మూడూ కలిసి యవత్‌మాల్‌ చుట్టూ 12 కిమీ పరిధిలో తమ ‘సామ్రాజ్యాన్ని’ విస్తరించాయి. తల్లి మనుషుల్ని వేటాడి చంపేస్తుండగా... మూడూ కలిసి మృతదేహాన్ని పీక్కు తినేవి. వాటి చేతిలో 14 మంది చనిపోయారు. 

రెండు నెలలు సాగిన ఆపరేషన్‌...
ఈ మూడింటినీ పట్టుకునేందుకు మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు, పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కాల్చి చంపడానికి నిర్ణయం తీసుకుంటూ ఆ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకుగాను పోలీసు కమాండోలను రంగంలోకి దింపింది. వారు చేతులు ఎత్తేయడంతో గత ఏడాది సెప్టెంబర్‌లో హైదరాబాదీ హంటర్స్‌ షఫత్, అస్ఘర్‌లను పిలిపించింది. వీరితో పాటు మొత్తం ఆరుగురికి ‘కలింగ్‌ ఆర్డర్స్‌’గా పిలిచే హతమార్చేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. మ్యానీటర్‌గా మారిన పులితో పాటు దాని కూనల కోసం దాదాపు రెండు నెలల పాటు గాలించిన హైదరాబాదీ హంటర్స్‌ 2018 నవంబర్‌ 3న అవనిని హతమార్చడంతో బాధిత గ్రామాల ప్రజలు  సంబరాలు చేసుకున్నారు. ఆయా గ్రామాల సర్పంచ్‌లు వీరిద్దరితో పాటు ఆపరేషన్‌లో పాల్గొన్నవారిని సన్మానించి జ్ఞాపికలు అందించారు. 

దేశ వ్యాప్తంగా ఆరోపణల వెల్లువ...
ఇలా తల్లి, రెండు పిల్లలు కలిసి జనావాసాలకు సమీపంలో సంచరిస్తూ ప్రజలను చంపడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. అయినా అవని వేట దేశ వ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. స్వచ్ఛంద సంస్థలు, కొందరు ప్రముఖులు సైతం అనేక ఆరోపణలు చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేకపోయినా అవనిని అస్ఘర్‌ చంపేశారని, దీని వల్ల దాని కూనలు చనిపోయే ప్రమాదం ఉందని ఆరోపించారు. మత్తుమందు ఇచ్చే అవకాశం ఉన్నా ఆ పని చేయకుండా అమానవీయంగా చంపేశారంటూ దుమ్మెత్తిపోశాయి. వీటిని పరిగణలోకి తీసుకున్న మహారాష్ట్ర సర్కారు సమగ్ర విచారణకు ఆదేశించింది. బాలిస్టర్‌ రిపోర్ట్, పోస్టుమార్టం నివేదికలను అధ్యయనం చేయాలని ఆదేశించింది. దీంతో ప్రత్యేక కమిటీ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటూ సుదీర్ఘ విచారణ చేసింది.

క్లీన్‌చిట్‌ ఇస్తూ లేఖ...
గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో షఫత్, అస్ఘర్‌లు తమ తుపాకులను ఇక్కడ డిపాజిట్‌ చేశారు. ఆ క్రతువు ముగిసిన తర్వాత వాటిని తీసుకుని వెళ్లి మహారాష్ట్ర సర్కారుకు అప్పగించారు. అస్ఘర్‌ తుపాకీతో పాటు అవని ఒంటి నుంచి తీసిన తూటాలను సరిపోల్చిన బాలిస్టిక్‌ నిపుణులు ఫైరింగ్‌ జరిగింది అందులోంచే అని తేల్చారు. మరోపక్క అవని చనిపోవడానికి ముందే దాని ఒంట్లోకి మత్తు ఇంజెక్షన్‌ వెళ్లిందని గుర్తించారు. ఆ మత్తు పూర్తిగా ఎక్కకముందే సమీపంలో ఉన్న బృందంపై దాడికి ప్రయత్నించడంతోనే అస్ఘర్‌ కాల్చాల్సి వచ్చిందని నిర్థారించారు. కలింగ్‌ ఆఫీ సర్స్‌ జాబితాలో ఉన్న ఆరుగురిలో అస్ఘర్‌ పేరు కూడా ఉందని, షఫత్‌ కేవలం సహాయానికి వెళ్లిన ట్లు పేర్కొన్న విచారణ కమిటీ ఈ ‘వేటగాళ్ల’కు క్లీన్‌చిట్‌ ఇస్తూ కేసును క్లోజ్‌ చేసింది. ఈ మేరకు షఫత్‌ అలీ ఖాన్, అస్ఘర్‌ అలీ ఖాన్‌లను గత వారం మహా రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ అందింది. ఎలాంటి మ్యానీటర్‌ అయినా మా తొలి ప్రాధాన్యం మత్తుమందు ఇచ్చి పట్టుకోవడానికే ఉంటుందని, గత్యంతర లేని పరిస్థితుల్లోనూ తుది నిర్ణయం తీసుకుంటామని అస్ఘర్‌ అలీ ఖాన్‌ పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top