ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

Love Couple Suicide Attempt In Vizianagaram - Sakshi

వారిద్దరూ ఇంటర్‌ చదువుకున్న సమయంలోనే ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు ప్రేమించిన వ్యక్తిని కాదని వేరొక వ్యక్తితో ఆమెకు ఏడాది కిందట వివాహం చేశారు. అనంతరం వివాహం చేసుకున్న భర్తతో ఆమె హైదరాబాద్‌కు వెళ్లింది. అక్కడే ఏడాదిగా ఉంటున్నారు. కానీ ఆమె తొలుత ప్రేమించిన వ్యక్తిని మరవలేకపోయింది. ఈ క్రమంలో ఐదు రోజుల కిందట పనుల నిమిత్తం సొంత ఊరుకు వచ్చిన భార్యాభర్తలు ఇద్దరూ  పని పూర్తి చేయించుకున్నారు. పని పూర్తయిందని భర్త హైదరాబాద్‌ వెళ్లిపోగా... ఆమె మాత్రం వెళ్లలేదు. ఇంతలోనే తొలుత ప్రేమించిన వ్యక్తితో బుధవారం రైలు నుంచి దూకేసి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.... 

విజయనగరం క్రైం/బలిజిపేట:  రైలు నుంచి దూకి  ప్రేమ జంట ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం  చోటుచేసుకుంది. దీనికి సంబంధించి  శ్రీకాకుళం రైల్వే జీఆర్‌పీ ఎస్‌ఐ చెల్లూరి శ్రీనివాసరావు అందించిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని  బలిజిపేట మండలం బర్లి గ్రామానికి చెందిన యేగోటి నాగరాజు,  అదే మండలం అరసాడ గ్రామానికి చెందిన యువతి ఇంటర్మీడియెట్‌ చదువుతున్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు. నాగరాజు ప్రస్తుతం డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు.  విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఏడాది కిందటే వేరే వ్యక్తితో యువతికి  వివాహం చేసేశారు.  హైదరాబాద్‌లో ఉంటున్న వీరిద్దరూ  పుట్టింటికి గత నెల 29న వచ్చారు.  బొబ్బిలిలో ఓ కళాశాలలో సర్టిఫికెట్లు తీసుకుంటానని మంగళవారం ఉదయం ఇంట్లోంచి వెళ్లిన వివాహిత మరలా ఇంటికి చేరలేదు.  విజయనగరం చేరుకుని రాత్రి సమయంలో స్థానిక థియేటర్‌లో  ఇద్దరూ కలిసి సినిమాకు వెళ్లి, అనంతరం  రైల్వేస్టేషన్‌కి వెళ్లి గూడ్స్‌ రైలు ఎక్కినట్టు పోలీసులు పేర్కొన్నారు.

 ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయం చేసుకున్నారని, ఈ క్రమంలో నెల్లిమర్ల డైట్‌ కళాశాల వద్దకు వచ్చేసరికి బుధవారం రైలు నుంచి దూకేసినట్టు  వారు చెబుతున్నారన్నారు. అయితే రైలు నుంచి దూకితే ప్రాణాలు పోయే ప్రమాదముందని, ఇంకా వారిద్దరూ పూర్తి స్థాయిలో వివరాలు చెప్పడానికి అంగీకరించడం లేదని వెల్ల డించారు. ట్రాక్‌ పక్కన పడి ఉన్న వారిని  ఎయిమ్‌ జిల్లా కన్వీనర్‌  బివి.రమణ చూసి సమాచారమందించారు.  వెంటనే 108 సాయంతో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ఇద్దరికీ తలకు, చేతులకు గాయాలయ్యాయి.  వివాహిత తలకు కొంచెం బలంగా గాయం తగలడంతో విశాఖ కేజీహెచ్‌కి తరలించారు. నాగరాజు కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.  నాగరాజు తండ్రి విశాఖలోని ప్రైవేటు కళాశాలలో వాటర్‌ ప్లాంట్‌ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. వివాహితకు తల్లిదండ్రులతో పాటు తోబుట్టువు ఉంది.  పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని,  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెల్లూరి శ్రీనివాసరావు తెలిపారు. 

ఏడాది కిందటే...
బలిజిపేట: నాగరాజు,  ఆ యువతి బలిజిపేటలో 2017–19 విద్యా సంవత్సరాల్లో ఇంటర్‌ ఓ ప్రైవేటు కళాశాలలో చదివారు. యువతి సీఈసీ, నాగరాజు ఎంపీసీ గ్రూపు చదివారు. వీరి ప్రేమ వ్యవహారం యువతి ఇంట్లో తెలియడంతో  ఆమెకు తల్లిదండ్రులు అరసాడకు చెందిన ఓ వ్యక్తితో ఏడాది కిందటే వివాహం చేశారు. అతను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. దంపతులిద్దరూ వారి సొంత పనుల నిమిత్తం  హైదరాబాద్‌ నుంచి ఇటీవల రాగా పని పూర్తయిన తరువాత భర్త తిరిగి హైదరాబాద్‌ వెళ్లిపోగా ఆమె మాత్రం అరసాడలోనే ఉంది. హైదరాబాద్‌ వెళ్లేందుకు రిజర్వేషన్‌ చేయించుకుంటానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన వివాహిత బుధవారం ఉదయం ఇలా తన ప్రేమికుడితో రైలు నుంచి దూకే యత్నం చేసినట్టు స్థానికులు చెబుతున్నారు.

చదవండి : సినిమాను తలపించే రియల్‌ క్రైమ్‌ స్టోరీ

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top