ఆర్థిక ఇబ్బందులకు జర్నలిస్టు కుటుంబం బలి

Journalist hanmanthrao suicide - Sakshi

ఇద్దరు కూతుళ్లు, భార్యను చంపి విలేకరి ఆత్మహత్య

తన చావుకు ఓ మహిళ, మరో ముగ్గురు కారణమని సూసైడ్‌ నోట్‌!

సిద్దిపేటలో ఘటన

సాక్షి, సిద్దిపేట: ఆర్థిక ఇబ్బందులకు ఓ జర్నలిస్టు కుటుంబం బలైంది.  ఓ దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్న సావిలి హన్మంతరావు (35) అనే వ్యక్తి భార్యకూతుళ్లను చంపి బలవన్మరణానికి పాల్ప డ్డాడు. తాను చనిపోతే కుటుంబం అనాథగా మారుతుందన్న ఉద్దేశంతో భార్య, ఇద్దరు కూతుళ్లను కూడా కడతేర్చాడు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని భరత్‌నగర్‌లో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది.

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన హన్మంతరావు, హారిక(29) దంపతులు సిద్దిపేటలో నివాసం ఉంటున్నారు. వీరికి దీక్షశ్రీ (6), షైన్‌శ్రీ (4) అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. హన్మంతరావు ప్రస్తుతం కొండపాక మండలంలో ఓ పత్రికా విలేకరిగా పనిచేస్తుండడంతోపాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. అలాగే పలు ప్రైవేట్‌ కంపెనీల ఏజెంటుగా, గజ్వేల్‌లో ఇఫ్కో కిసాన్‌ సిమ్‌కార్డుల డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నాడు.

అయితే వ్యాపారాల్లో నష్టం రావడంతోపాటు ఓ మహిళ, మరో వ్యక్తి బ్లాక్‌ మెయిల్‌ చేస్తుండడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తాను చనిపోతే కుటుంబ సభ్యులు అనాథలవుతారని ఆలోచించి గురువారం ఉదయం భార్య మెడకు తాడు చుట్టి గట్టిగా లాగడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దాంతో భార్య చనిపోయిందని భావించి కూతుళ్లను గొంతునులిమి చంపేశాడు. అనంతరం హైదరాబాద్‌లో ఉన్న చిన్నమ్మకు ఫోన్‌ చేసి చనిపోతున్నట్లు చెప్పాడు.

ఈ సమాచారం అందుకున్న అతని అన్న పురుషోత్తం భరత్‌నగర్‌లోని ఇంటికి వచ్చి చూడగా హన్మంతరావు ఉరివేసుకుని కనిపించాడు. పిల్లలు విగతజీవులుగా పడి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు కొన ఊపిరితో ఉన్న భార్యను సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏసీపీ రామేశ్వర్, సీఐ నందీశ్వర్‌లు పరిస్థితిని   సమీక్షించారు.   

సూసైడ్‌ నోట్‌ లభ్యం
కరీంనగర్‌లో పనిచేస్తున్న ఓ మహిళ, తన షాపులో పని చేస్తున్న వ్యక్తి తమ మృతికి కారణమని మృతుడు హన్మంతరావు సూసైడ్‌ నోట్‌ రాసి ఉంచినట్టు తెలుస్తోంది. తన షాపుపై కన్నేసిన ఆ మహిళ తరచూ తనను బ్లాక్‌ మెయిల్‌ చేసేదని, షాపు వదిలేయాలంటూ బెదిరించేదని పేర్కొన్నాడు.

అలాగే చిట్టీలు వేయగా వచ్చిన రూ.7 లక్షలకు పైగా డబ్బును వారు వాడుకున్నారని, వాటిని అడిగితే కేసులు పెడతామని భయపెట్టారని అందులో రాసినట్టు సమాచారం. అలాగే అప్పులు ఇచ్చిన ఇద్దరు వ్యక్తులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని దుర్భాషలాడారని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. కాగా, తదుపరి దర్యాప్తు అనంతరం సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్న వ్యక్తుల పేర్లు వెల్లడయ్యే అవకాశముందని సమాచారం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top