ప్రాణాలు తీస్తున్న ఫలితాలు

Inter Students Suicide While Fail In Exams - Sakshi

తప్పుల తడకగా ఇంటర్మీడియట్‌ ఫలితాలు

క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడుతున్న విద్యార్థులు  

సాక్షి,సిటీబ్యూరో: ఇంటర్మీడియట్‌ ఫలితాలు తప్పుల తడకగా మారాయి. సాంకేతిక తప్పిదాల కారణంగా పలువులు విద్యార్థుల ఫలితాలు తారు మారయ్యాయి. పరీక్షకు హాజరైనా.. పరీక్షకు గైర్హాజరైనట్లు ఫలితాల్లో పేర్కొన్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. మరోవైపు సబ్జెక్ట్‌ వారిగా మార్కుల షీట్‌లో మార్కులకు బదులుగా ఏపీ, ఏఎఫ్‌ అని రావడం మరింత గందరగోళానికి దారి తీసింది. నిబంధనల ప్రకారం అబ్సెంట్‌కు ఏబీ రావడం అనవాయితీ. అయితే తాజాగా  ఏపీ, ఏఎఫ్‌ అని పేర్కొనడంతో అర్థం కాక విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు.  ఆయా సబ్జెక్టుల్లో పరీక్ష బాగానే రాసిన విద్యార్ధులకు సైతం ఈ కోడ్‌ రావడంతో మనస్తాపానికి గురవుతున్నారు.

విషాదాంతాలు..
ఇంటర్‌ ఫలితాలు పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. ఫలితాలు విడుదలైన అనంతరం ఉత్తీర్ణత సాధించని పలువురు  విద్యార్ధులు  మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.  మరోసారి పరీక్షలు రాసే అవకాశం ఉన్నా  క్షణిæకావేశంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. విద్యార్థుల బలవన్మరణాలు ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి.  
కుషాయిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మార్కులు తక్కువ వచ్చాయన్న కారణంగా ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థి నాగేందర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గాంధీనగర్‌ ఉంటూ కోఠిలోని ప్రగతి కళాశాలలో చదువుతున్న అనమిక అనే విద్యార్థిని ఇంటర్‌లో ఒక్క సబ్జెక్ట్‌ ఫెయిల్‌ కావడంతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఫెయిలయ్యానని మరో విద్యార్థిని..
మారేడుపల్లి : ఇంటర్‌ రెండవ సంవత్సరం పరీక్ష ఫెయిల్‌ కావడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మారేడుపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వెస్ట్‌ మారేడుపల్లి, రాయల్‌ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న సుధాకర్‌ కుమార్తె లాస్య (17) నల్లకుంటలోని శ్రీచైతన్య కళాశాలలో లాస్య ఇంటర్‌ పూర్తి చేసింది. గురువారం వెలువడిన పరీక్షా ఫలితాల్లో ఒక సబ్జెక్ట్‌లో ఫెయిలైంది. దీంతో మనస్తాపానికిలోనైన లాస్య రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. దీనిని గుర్తించిన తల్లితండ్రులు ఆమెను కిందకు దింపి యశోధ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ లాస్య మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top