టెకీ ఉన్మాదం.. కారులో శవంతో 350 కి.మీ.

Indian Origin Techie In US Kills 4 Members Goes To PS With Dead Body - Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో : అమెరికాలోని రోస్‌విల్లేలో నివసిస్తున్న భారత సంతతి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి శంకర్‌ నాగప్ప హంగుడ్‌(53) దారుణానికి తెగబడ్డాడు. తన కుటుంబంలో ఒక వ్యక్తిని హత్య చేసిన అతడు.. శవాన్ని కారులో తీసుకువెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అదే విధంగా మరో ముగ్గురిని కూడా హత్య చేశానని.. వారి మృతదేహాలు తన అపార్టుమెంటులో ఉన్నాయని పోలీసులకు చెప్పాడు. ఈ క్రమంలో నాగప్ప చెబుతుంది నిజమా కాదా అని తెలుసుకునేందుకు మొదట అతడి కారును పరిశీలించిన పోలీసులు.. ఆ తర్వాత అతడి అపార్టుమెంటుకు వెళ్లి పరిశీలించగా ఓ వ్యక్తితో పాటు ఇద్దరు మైనర్ల శవాలను గుర్తించారు. ఈ క్రమంలో నిందితుడు మూడు శవాలను అక్కడే వదిలేసి.. ఒక శవాన్ని తీసుకుని దాదాపు 350 కిలోమీటర్లు ప్రయాణించి ఉత్తర కాలిఫోర్నియా పోలీసు స్టేషనుకు వచ్చి లొంగిపోయాడని తెలిపారు. కాగా నాగప్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. పాశవికంగా హత్యలకు పాల్పడిన అతడికి కోర్టు బెయిలు కూడా నిరాకరించిందని స్థానిక వార్తా పత్రిక పేర్కొంది.

ఇక ఈ విషయం గురించి రోస్‌విల్లే పోలీసు అధికారి మాట్లాడుతూ.. మృతులు నిందితుడి బంధువులా కాదా అన్న విషయం తేలాల్సి ఉందన్నారు. నాగప్ప ఘాతుకంతో రోస్‌విల్లే ప్రాంతంలో అలజడి చెలరేగిందని... ఇది చాలా దారుణమైన ఘటన అని పేర్కొన్నారు. తన సర్వీసులో ఎంతోమంది నేరస్తులను చూశానని.. అయితే నాగప్ప ఉదంతం వంటిది ఎన్నడూ చూడలేదని.. ఇది తనకు షాకింగ్‌గా ఉందని వ్యాఖ్యానించారు. ప్రముఖ కంపెనీల్లో ఐటీ ఉద్యోగిగా పనిచేసిన నాగప్ప ఈ దారుణానికి ఒడిగట్టడానికి గల కారణాల గురించి విచారణ జరుపుతున్నామని వెల్లడించారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top