తిరగదోడుతున్నారు..! | Hyderabad Police Reopen Abdul Karim Tunda Case | Sakshi
Sakshi News home page

తిరగదోడుతున్నారు..!

Oct 14 2019 10:48 AM | Updated on Oct 14 2019 10:48 AM

Hyderabad Police Reopen Abdul Karim Tunda Case - Sakshi

అబ్దుల్‌ కరీం టుండా

సాక్షి, సిటీబ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ జైలు నుంచి పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకువచ్చిన లష్కరేతోయిబా ఉగ్రవాది అబ్దుల్‌ కరీం టుండాపై నగరంలో ఒకే కేసు ఉంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ 1998లో సిటీ పోలీసులకు చిక్కిన పాకిస్తానీ సలీం జునైద్‌ కేసులో ఇతడు నిందితుడిగా ఉన్నాడు. ఇతను తన్జీమ్‌ ఇస్లా ఉల్‌ ముస్లిమీన్‌ (టీఐఎం) స్థాపనలో కీలక పాత్ర పోషించినప్పటికీ... ఆ సంస్థ ఘాతుకాలపై నమోదైన కేసుల్లో ఇతడి ప్రస్తావన ఎక్కడా లేదు. దీంతో పాతరికార్డులను తిరగదోడుతున్న పోలీసు, నిఘా వర్గాలు అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే టుండాపై ఉన్న కేసులకు సంబంధించి ఓ స్పష్టత వస్తుందని చెబుతున్నారు. బాబ్రీ విధ్వంసానికి ప్రతీకారంగా ఏర్పడిన తన్జీమ్‌ ఇస్లా ఉల్‌ ముస్లిమీన్‌ (టీఐఎం) సంస్థ దేశ వ్యాప్తంగా 40కి పైగా పేలుళ్లకు పాల్పడింది. దీని ఏర్పాటులో  ముంబైకి చెందిన ‘డాక్టర్‌ బాంబ్‌’ జలీస్‌ అన్సారీతో పాటు అప్పట్లో నగరంలో నివసించిన అబ్దుల్‌ కరీం టుండా సైతం కీలక పాత్ర పోషించారు. 1994లో జలీస్‌ అన్సారీ సహా కీలక వ్యక్తులు అరెస్టు కావడంతో టుండా దేశం దాటేశాడు. ఆపై బంగ్లాదేశ్‌ కేంద్రంగా వ్యవహారాలు సాగించిన ఇతను పాకిస్థానీయులతో పాటు భారత్‌కు చెందిన యువతనూ  ఉగ్రవాదం వైపు మళ్లించడం ద్వారా లక్ష్యాలను సాధించాలనుకున్నాడు. పాక్‌–ఇండియా టెర్రర్‌ నెట్‌వర్క్‌గా పిలిచే దీనిలో అనేక మంది పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులను భారత్‌లోకి జొప్పించడం, వారితో ఆపరేషన్లు చేయించకుండా కేవలం స్థానిక యువతను ఆకర్షించడం, బాంబుల తయారీపై శిక్షణ ఇవ్వడం తదితరాలు చేయించాలని భావించాడు. 

ఆ నలుగురిలో జునైద్‌ ఒకరు..
దీనికోసం ప్రాథమికంగా ఎంపిక చేసుకున్న నలుగురిలో సలీం జునైద్‌ ఒకడు. ఇస్తఖ్‌ అలియాస్‌ అబు సాహెబ్‌ అనే మారుపేర్లు కూడా ఉన్న జునైద్‌ పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో ఉన్న మొహల్లా మంగ్‌ నబీ ప్రాంతంలో జన్మించాడు. 1981లోనే లష్కరే తోయిబా క్యాంప్‌లో చేరి శిక్షణ పొందాడు. ఇతడితో పాటు మరో ముగ్గురిని ఎంపిక చేసుకున్న టుండా బంగ్లాదేశ్‌లో బాంబుల తయారీపై శిక్షణ ఇచ్చాడు. ఇందుకుగాను ఢాకా సమీపంలోని మలీబాగ్‌లో ఓ ప్రయోగశాలనే స్థాపించాడు. శిక్షణ అనంతరం జునైద్‌ భారత్‌లోకి ప్రవేశించి నగరంలోని పాతబస్తీలో స్థిరపడ్డాడు. స్థానిక యువతిని వివాహం చేసుకుని యువతను ఆకర్షించడం ప్రారంభించాడు. దీనిపై సమాచారం అందుకున్న నగర పోలీసులు 1998 జూలై 1న అతడిని అరెస్టు చేసి సైలెన్సర్‌తో కూడిన పిస్టల్స్, 18 కేజీల ఆర్డీఎక్స్‌ పేలుడు పదార్థం స్వాధీనం చేసుకున్నారు. డెహ్రాడూన్, లక్నో, ఘజియాబాద్, ముంబై, అలీఘర్‌లతో పాటు గణేష్‌ ఉత్సవాలకు ముందు హైదరాబాద్‌లోనూ పేలుళ్లకు కుట్రపన్నినట్లు నిర్థారించారు. మొత్తం 24 మంది నిందితులుగా ఉన్న ఈ కేసులో టుండా 22వ నిందితుడు. ఈ కేసులోనే పీటీ వారెంట్‌పై ఢిల్లీ నుంచి తీసుకురావాలని నగర పోలీసులు భావిస్తున్నారు. 2006 జూన్‌ వరకు చర్లపల్లి జైలులో జీవితఖైదు అనుభవించిన జునైద్‌ ఆపై విశాఖపట్నంలోని డిటెన్షన్‌ క్యాంప్‌కు చేరాడు. 

టీఐఎం రికార్డుల పరిశీలన...
టీఐఎం సంస్థ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్‌ల్లో విధ్వంసాలు సృష్టించింది. 1993లో నగరంలోని అబిడ్స్, గోపాలపురం, హుమాయున్‌నగర్, మల్కాజ్‌గిరి ప్రాంతాల్లో జరిగిన పేలుళ్లలో నలుగురు మరణించగా... పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. నేరుగా ప్రమేయం లేకపోవడంతో ఈ కేసుల్లో టుండా పేరు లేదు. దీంతో అప్ప ట్లో అరెస్టై వారిచ్చిన నేరాంగీకార వాం గ్మూలాల్లో టుండా ప్రస్తావన ఉందా..? అనే కోణంపై పోలీసులు, నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి. దీనికోసం అప్పటి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చిన తరవాత టుండాకు సంబంధించిన కేసులపై ఓ స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం సీసీఎస్‌ ఆధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) పోలీసులు జునైద్‌ కేసులో కరీం టుండాను విచారించడానికే సిటీకి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement