
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): తన తండ్రిని గౌరవించాలని భార్యను ప్రాధేయపడ్డాడు. అయినా భార్య సహకరించకపోవడంతో ఇదీ జీవితమేనా అని ఆవేదనతో కుంగిపోయాడు. ఇంతటితో తన జీవితాన్ని ముగించేస్తున్నట్లు లేఖ రాశాడు. తాను దూరమవుతున్న తరుణంలో క్షమించాలని తండ్రికి, సోదరునికీ లేఖ రాసి అదృశ్యమయ్యాడు. గోపాలపట్నం పద్మనాభనగర్‌లో కలకలం రేపిన ఘటన వివరాలిలా ఉన్నాయి. ఇక్కడి పద్మనాభనగర్‌కు చెందిన నంబాల నాగేశ్వరరావు ఎన్‌ఏడీ జంక్షన్‌లో కంప్యూటర్ సంస్థలో తన సోదరుడు జనార్థన్ వద్ద పని చేస్తున్నాడు. పదేళ్ల కిందట అరుణకుమారితో పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు. నాగేశ్వరరావుకు తండ్రి కృష్ణమూర్తి అంటే అంతులేని ప్రేమ. తండ్రి తనతో ఉండాలని ఆశించేవాడు.
దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. కృష్ణమూర్తిని ఇంటికి రానీయవద్దని భార్య తిరస్కరించడంతో అతను కుంగిపోతుండేవాడు. ఇదిలా ఉండగా, సోమవారం ఉదయం తన కుమారుడిని ఓ స్కూల్లో నర్సరీలో చేర్పించి తర్వాత నుంచి నాగేశ్వరరావు కనిపించలేదు. మరో గంట తర్వాత తన సోదరుడు జనార్థన్‌కు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించాడు. తాను చనిపోతున్నానని, దూరమవుతున్నందుకు క్షమించాలని, తనకు వచ్చే ఆస్తి వాటా పిల్లలకు దక్కేలా చూడాలని లేఖలో కోరాడు. ఇదే విషయాన్ని తండ్రికీ సూచించాడు. వెంటనే ఆందోళనకు గురైన జనార్థన్ సోదరుని కోసం గాలించాడు. ఆచూకీ తెలియకపోవడంతో పోలీస్ కమిషనర్ యోగానంద్‌తోపాటు గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.