
చెన్నై ,టీ.నగర్: మహిళా ఎస్‌ఐకు బలవంతంగా తాళి కట్టేందుకు ప్రయత్నించిన హోంగార్డును పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. నుంగంబాక్కం పోలీసు స్టేషన్‌లో మహిళా ఎస్‌ఐగా విల్లుపురం జిల్లా, తిరుక్కోవిలూరుకు చెందిన మణిమేగలై (24) పనిచేస్తున్నారు. ఈమె 2016లో వేలూరు కాట్పాడి పోలీసు స్టేషన్‌లో ఎఎస్‌ఐగా పనిచేశారు. ఆ సమయంలో కాట్పాడికి చెందిన బాలచంద్రన్ (25) హోంగార్డుగా పనిచేస్తూ వచ్చాడు. అతనితో మణిమేగలై చనువుగా ఉండేదని తెలిసింది.
దీన్ని ప్రేమగా భావించిన బాలచంద్రన్ మణిమేగలైను ఒన్‌సైడ్‌గా ప్రేమించాడు. ఇలా ఉండగా శనివారం రాత్రి చెన్నైకు చేరుకున్న బాలచంద్రన్ ఎగ్మూరులోని ఉడుపి హోటల్ వద్ద మణిమేగలైతో మాట్లాడాడు. ఆ సమయంలో తాను ఆమెను గాఢంగా ప్రేమిస్తున్నట్లు తనను వివాహం చేసుకొమ్మని కోరాడు. ఇందుకు మణిమేగలై నిరాకరించింది. అయినప్పటికీ తాను సిద్ధంగా తెచ్చుకున్న తాళిబొట్టును మణిమేగలై మెడలో ప్రజల సమక్షంలోనే కట్టేందుకు ప్రయత్నించాడు. దీన్ని ఊహించని మణిమేగలై అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించింది. ప్రజలు బాలచంద్రన్‌ను పట్టుకుని ఎగ్మూరు పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.