‘ప్రత్యేక జాకెట్‌’తో రూ.70 లక్షల రవాణా 

Hawala from Raipur to Hyderabad - Sakshi

రాయపూర్‌ టు హైదరాబాద్‌కు హవాలా సొమ్ము 

స్వాధీనం చేసుకున్న నేరేడ్‌మెట్‌ పోలీసులు 

హవాలా ఏజెంట్‌ చంద్రకాంత్‌ వర్మ అరెస్టు 

జువెల్లరి యజమాని కోసం గాలింపు 

వివరాలు వెల్లడించిన సీపీ మహేష్‌ భగవత్‌ 

హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా ఛత్తీస్‌గడ్‌ రాజధాని నుంచి గత కొంతకాలంగా రూ.లక్షల్లో సాగుతోన్న హవాలా సొమ్ము రవాణా గుట్టురట్టయింది. సార్వత్రిక ఎన్నికల వేళ రాచకొండ పోలీసులు జరిపిన వాహన తనిఖీల్లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎవరికీ అనుమానం రాకుండా ప్రత్యేకంగా తయారు చేయించిన జాకెట్‌లో రవాణా చేస్తున్న రూ.70లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను నేరేడ్‌మెట్‌లోని తన కార్యాలయంలో రాచకొండ సీపీ మహేష్‌భగవత్‌ శనివారం విలేకరులకు వెల్లడించారు. సీపీ కథనం ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన చంద్రకాంత్‌ వర్మ(33) కొంత కాలం క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చి, బేగంబజార్‌లో నివాసం ఉంటున్నాడు.

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.36లోని డైమండ్‌ స్టోర్, జువెల్లరి దుకాణంలో పనిచేస్తూ, మార్కెటింగ్‌ ఏజెంట్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. జువెల్లరి దుకాణం యజమాని కె.చంద్రప్రకాష్‌ సూచనల ప్రకారం చంద్రకాంత్‌ పలువురు వ్యక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తుంటాడు. ఇందులో భాగంగా ఈ నెల 14న చంద్రకాంత్‌ బస్సులో ఛత్తీస్‌గడ్‌ రాజధాని రాయపూర్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి ఆటోలో బుధాపూర్‌కు వెళ్లి శంకర్‌ అనే వ్యక్తిని కలిశాడు. ఆయన ద్వారా సునీల్‌ సోనీ అనే మరో వ్యక్తి కలిస్తే అతను రూ.70 లక్షలను అందజేశాడు. ఆ మొత్తాన్ని ప్రత్యేకంగా తయారు చేయించిన జాకెట్‌లోని రహస్య జేబుల్లో పెట్టుకొని వర్మ తిరిగి బస్సులో హైదరాబాద్‌ చేరుకొని ఆటోలో వెళుతున్నాడు. మరో వైపు పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో శనివారం నేరేడ్‌మెట్‌లోని ఆర్‌కే పురం చౌరస్తా చెక్‌పోస్టు వద్ద నేరేడ్‌మెట్, ఎల్‌బీ నగర్‌ జోన్‌ ఎస్‌ఓటీ పోలీసులు సంయుక్తంగా వాహనాలను తనిఖీ లు చేస్తున్నారు.

ఆ సమయంలో ఆటోలో ఉన్న చంద్రకాంత్‌ కదలికలపై అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని తనిఖీ చేశారు. దాంతో అతని వద్దనున్న రూ.70 లక్షల నగదు కట్ట లు బయటపడ్డాయి. వీటికి ఎలాంటి పత్రాలు లేకపోవడం తో ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా వివరాలు వెల్లడయ్యాయి. అతను ఈ నెల7న కూడా రాయపూర్‌ నుంచి రూ.33 లక్షలను ఇదే తరహాలో తీసుకువచ్చి చంద్రప్రకాష్‌కు అప్పగించినట్లు వెల్లడైంది. అతన్ని పోలీసు లు అరెస్టు చేశారు. కాగా జువెల్లరి దుకాణం యజమాని చంద్రప్రకాష్‌కు రాయపూర్‌లోని సునీల్‌సోనీతో సంబంధాలున్నాయని, పలుమార్లు హవాలా సొమ్మును పంపించినట్టు పోలీసుల విచారణలో తేలిందని సీపీ వివరించారు.

పరారీలో ఉన్న యజమాని చంద్రప్రకాష్‌పై కేసు నమోదు చేశామని, త్వరలో అరెస్టు చేయనున్నట్టు చెప్పారు. తదుపరి చర్యలకు ఆదాయపన్ను శాఖకు ఈకేసు సిఫారసు చేసినట్టు, రూ.70 లక్షల నగదు, రవాణాకు వినియోగించిన ప్రత్యేక జాకెట్‌తోపాటు రెండు మొబైల్‌ ఫోన్లను పోలీసులు స్వాధీ నం చేసుకున్నారని చెప్పారు.ఈ నగదును పట్టుకున్న పోలీసులకు క్యాష్‌ రివార్డులను అందజేస్తామని సీపీ చెప్పారు.  ఈ సమావేశంలో క్రైం డీసీపీ నాగరాజు, ఎస్‌ఓటీ అదనపు డీసీపీ సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top