వేటాడుతున్న నాటు తూటా

Guns in Tribal Hunters Family Houses in Visakhapatnam - Sakshi

పాత కక్షలతో హత్యలు

యథేచ్ఛగా జంతువుల వేట

ఒడిశా, తూర్పుగోదావరి ప్రాంతాల  నుంచి వస్తున్న వేటగాళ్లు

నాటు తుపాకులను సొంతంగా తయారు చేస్తున్న గిరిజనులు

మన్యంలో నాటుతుపాకులు కలకలం రేపుతున్నాయి. గిరిజనులు వాటిని సొంతంగా తయారు చేసుకుంటూ  యథేచ్ఛగా జంతువులను వేటాడడంతో పాటు తమ విరోధులపై కాల్పులు జరుపుతూ ప్రాణాలు బలిగొంటున్నారు. తుపాకులు దగ్గర ఉండడంతో చిన్నపాటి గొడవ జరిగినా కాల్పులు జరుపుతున్నారు.  మన్యంలో తరచూ నాటు తుపాకులు గర్జిస్తుండడంతో  అశాంతి వాతారణం నెలకుంటోంది.  

విశాఖపట్నం, కొయ్యూరు(పాడేరు): మన్యంలో వన్యప్రాణుల వేట యథేచ్ఛగా సాగుతోంది. అడవి పందులు, దుప్పులు,కొండ గొర్రెలు, కణుజులను వేటాడేందుకు అధికంగా నాటు తుపాకులను వినియోగిస్తున్నారు.చింతపల్లి,గూడెంకొత్తవీధి,కొయ్యూరు మండలాలో గిరిజ నుల వద్ద  250 నాటుతుపాకులున్నాయి. జంతువులను వేటా డేందుకు ఉపయోగించాల్సిన తుపాకీ గుళ్లు మనుషుల గుండెలను చీల్చుతున్నాయి. కొన్నిసార్లు కక్షతో విరోధులపై తుపాకులను గురిపెడుతుంటే, మరికొన్ని సార్లు గురి తప్పి గాయపరుస్తున్నాయి.  తాజాగా  ఐదు రోజుల కిందట ఆర్‌.కొత్తూరు పంచాయతీ  మల్లవరంలో జంపాశ్రీను అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన కురుజు రమణాజీ నాటు తుపాకీతో కాల్చి చంపాడు. మన్యానికి సమీపంలో ఉన్న రోలుగుంట మండలంలో అడవి పందుల వేటకు  వెళ్తుండగా నాటు తుపాకీ పేలి గతంలో ఓయువకుడు మృతువాతపడ్డాడు. ఇలాంటి సంఘటనలు తరచూ మన్యంలో జరుగుతున్నాయి. గతంలో వింటిబద్దలు,బాణాలతో జంతువులను వేటాడేవారు. ఇప్పుడు వాటిస్థానంలో ఎక్కువగా నాటు తుపాకులు దర్శనమిస్తున్నాయి.ప్రతీ ఏటా వేసవిలో విశాఖ మన్యానికి ఒడిశా నుంచి  వేటగాళ్లు వస్తారు. స్థానికులు వారి నుంచి కూడా తుపాకులు సేకరిస్తున్నారు.  నాటు తుపాకులు కలిగి ఉన్న వేటగాళ్లను చూసీ మావోయిస్టులుగా భావించి పోలీసులు  కాల్పులు జరిపి సంఘటనలు కూడా ఉన్నాయి. స్థానిక గిరిజనులే కాకుండా ఒడిశా నుంచి వచ్చిన వారు, విశాఖ–తూర్పుగోదావరి సరిహద్దుల్లో అటు తూర్పుగోదావరికి చెందిన గిరిజనులు  కూడా నాటు తుపాకులతో  జంతువులను వేటాడుతున్నారు. దీంతో మన్యం  నిత్యం నాటు తుపాకీ కాల్పుల మోతలతో దద్దరిల్లుతోంది.

దృష్టిపెట్టని పోలీసు,అటవీశాఖ అధికారులు
  ఆయుధాల చట్టం ప్రకారం లైసెన్స్‌ లేని నాటుతుపాకులు కలిగి ఉండడం నేరం. అలాంటి వారిపై కేసులు నమోదు చేయాలి.  మన్యంలో ఎవరి వద్ద నాటు తుపాకులున్నాయో అటవీ శాఖ సిబ్బంది వద్ద సమాచారం ఉంది. అయితే వారెవరూ ఉన్నతాధికారులకు తెలియజేయడం లేదు.పోలీసులు కూడా నాటు తుపాకులపై  దృష్టిపెట్టడం లేదు.దీంతో  తీవ్ర నష్టం జరిగిపోతోంది. జంతువులను విచ్చలవిడిగా చంపేస్తున్నారు.మరోవైపు  కక్షలు ఉంటే విరోధులపై కాల్పులు జరుపుతున్నారు. దీంతో నిత్యం   తుపాకీలు  గర్జిస్తున్నాయి.  

దృష్టి సారిస్తాం..
నాటు తుపాకులు ఎవరివద్ద  ఉన్నా యో సమాచారం  సేకరిస్తాం. తరువాత  దాడులు చేసి  స్వాధీనం చేసుకుంటాం. వెంటనే వారిపై కేసులు నమోదు చేస్తాం.అనుమతి లేకుండా ఆయుధాలు కలిగి ఉండడం చట్టరిత్యా నేరం .కె.ఆరీఫ్‌ హఫీజ్,  ఏఎస్పీ, నర్సీపట్నం

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top