మూవీ మొఘల్‌ రామానాయుడు ఇంట్లో చోరీ 

Gold, silver jewellery and cash stolen from house of Ramanaidu kin in Karamchedu - Sakshi

 బంగారం, పది కేజీల వెండి, రూ.60 వేల నగదు మాయం 

ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగల హల్‌చల్‌ 

యజమానులు వచ్చిన తర్వాత చోరీ విలువ పెరిగే అవకాశం 

సాక్షి, కారంచేడు: బాపట్ల మాజీ ఎంపీ, మూవీ మొఘల్‌ దివంగత డాక్టర్‌ దగ్గుబాటి రామానాయుడు ఇంట్లో దొంగలు చేతివాటం చూపించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీభత్సం సృష్టించారు. బీరువాలు పగులగొట్టి అందినకాడికి దోచుకెళ్లారు. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మండల కేంద్రం కారంచేడు చినవంతెన సమీపంలో జరిగింది. రామానాయుడు ఇంట్లో దొంగలు పడ్డారని తెలియడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. 

స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కారంచేడు నడిబొడ్డు చినవంతెన సెంటర్‌ లైబ్రరీ బజారులో సినీ నిర్మాత, మూవీ మోఘల్‌గా పేరొందిన గ్రామానికి చెందిన డాక్టర్‌ దగ్గుబాటి రామానాయడు ఇంట్లో దొంగలు పడ్డారు. రామానాయుడు ఇంట్లో ప్రస్తుతం ఆయన సోదరుడు దగ్గుబాటి రామ్మోహన్‌రావు (మోహన్‌బాబు) నివాసం ఉంటున్నారు. ఆయన కుమార్తెలు హైదరాబాద్‌లో ఉంటుండటంతో దంపతులు తరుచూ హైదరాబాద్‌ వెళ్లి వారం, పది రోజులు ఉండి వస్తుంటారు. అదే క్రమంలో ఈ నెల 16వ తేదీన మోహన్‌బాబు దంపతులు హైదరాబాద్‌ వెళ్లారు. 

ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించిన దొంగలు రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళికతో దొంగతనానికి పాల్పడ్డారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇంట్లో పనులు చేసే నరసింహారావు, సుజాత దంపతులు శనివారం ఉదయం వచ్చి చూడగా ఇంటి ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించి గ్రామంలోనే ఉండే ఆఫీస్‌ మేనేజర్‌ తాళ్లూరి శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. ఇంట్లోకి వెళ్లి చూస్తే అన్ని బీరువాలు, అరమరలు పగులగొట్టి ఉండటంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. చీరాల రూరల్‌ సీఐ జె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఒంగోలు నుంచి క్లూస్‌ టీమ్‌తో పాటు స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. విషయం తెలిసిన సినీ నిర్మాత, నటుడు, మోహన్‌బాబు బావమరిది కొల్లా అశోక్‌కుమార్‌ వచ్చి పోలీసులకు వివరాలు అందించారు. సంఘటన స్థలాన్ని చీరాల డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి పరిశీలించి పోలీసు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

10 కేజీల వెండి మాయం  
బాధితుల ఫోన్‌ సమాచారం మేరకు 10 కేజీల వెండి వస్తువులు, మూడు సవర్ల బంగారం, రూ.60 వేల నగదు మాయమయ్యాయని సీఐ శ్రీనివాసరావు వివరించారు. మోహన్‌బాబు దంపతులు హైదరాబాద్‌ నుంచి వస్తున్నారని, వారు వచ్చిన తర్వాత చోరీ సొత్తు వివరాలు పూర్తిగా తెలుస్తాయని, అప్పుడు పూర్తి స్ధాయి విచారణ చేపడతామని సీఐ వివరించారు. 

గ్రామస్తుల ఆందోళన  
ఎప్పుడూ రద్దీగా, పటిష్ట భద్రత ఉండే రామానాయుడు ఇంట్లో దొంగల పడ్డారనే సమాచారంతో గ్రామస్తుల్లో ఆందోళన మొదలైంది. ఇంట్లో ఎవరూ లేకుండా తాళాలు వేసిన ఇళ్లనే లక్ష్యంగా దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. గతంలో ఇక్కడ ఇదే మాదిరి దొంగతనాలు జరిగిన విషయాన్ని గ్రామస్తులు చర్చించుకుంటుంన్నారు.  గ్రామంలో పోలీసుల గస్తీని ముమ్మరం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. చీరాల రూరల్‌ సీఐ శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడుతూ ఈ కేసును చాలెంజ్‌గా తీసుకున్నట్లు స్పష్టం చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన‍్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top