ఫ్రెండ్‌కు లవ్‌ యూ బంగారం మెసేజ్‌.. దీంతో.. | Girl Commits Suicide Over Message In Nizamabad | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన మెస్సేజ్‌! 

Sep 17 2019 10:20 AM | Updated on Sep 17 2019 10:23 AM

Girl Commits Suicide Over Message In Nizamabad - Sakshi

బావిలో తేలిన బాలిక మృతదేహం

సాక్షి, నందిపేట్‌ (నిజామాబాద్‌): స్నేహితురాలి తండ్రి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండలంలోని డొంకేశ్వర్‌ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. నాందేడ్‌ జిల్లా ధర్మాబాద్‌ మండలం నయేగావ్‌ గ్రామానికి చెందిన సాయన్న భార్య, ముగ్గురు కూతుళ్లతో కలిసి తొమ్మిదేళ్ల క్రితం బతుకు దెరువు కోసం డొంకేశ్వర్‌ గ్రామానికి వలస వచ్చాడు. గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద పాలేరు పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని రెండో కూతురు లలిత (15) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అయితే, శనివారం తన క్లాస్‌మేట్‌ అయిన మండలంలోని నికాల్‌పూర్‌ గ్రామానికి చెందిన పల్లవికి ఫోన్‌లో ‘ఐలవ్‌ యు బంగారం’ అని మెస్సేజ్‌ పెట్టింది.

ఈ విషయాన్ని పల్లవి తన తండ్రి హన్మంత్‌కు చెప్పింది. దీంతో హన్మంత్‌ మరో ఇద్దరిని తీసుకుని శనివారం డొంకేశ్వర్‌లోని లలిత ఇంటికి వచ్చి నిలదీశాడు. ఈ మెస్సేజ్‌ ఎందుకు పెట్టావని నిలదీస్తూ, చెప్పకుంటే పోలీసులకు చెబుతామని హెచ్చరించి వెళ్లాడు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఇంటి నుంచి వెళ్లి పోయింది. తల్లిదండ్రులు చుట్టపక్కల గాలించినా ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం గ్రామంలోని మంచినీటి బావిలో శవమై తేలిన లలితను గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. ఆర్మూర్‌ రూరల్‌ సీఐ విజయ్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement