కారు బోల్తా, నలుగురు ఇంజినీర్లు దుర్మరణం | four young engineers dead in BAB canal | Sakshi
Sakshi News home page

కారు బోల్తా, నలుగురు ఇంజినీర్లు దుర్మరణం

Oct 17 2017 9:18 AM | Updated on Aug 14 2018 3:22 PM

four young engineers dead in BAB canal - Sakshi

కాలువలో నుంచి కారును వెలికి తీస్తున్న అగ్నిమాపక సిబ్బంది. (ఇన్‌సెట్‌) మృతులు (ఫైల్‌)

విహారయత్ర నలుగురు యువ ఇంజినీర్లను బలిగొంది. కొడైకెనాల్‌ వెళ్లి సరదాగా గడిపి తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం రూపంలో వారిపై విరుచుకుపడింది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కాలువలో పడడంతో నీటమునిగి నలుగురు మృతిచెందారు. స్థానికులు వారిని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ ఒక్కరిని మాత్రమే కాపాడగలిగారు. ఉద్యోగాల్లో స్థిరపడి చేతికందివచ్చిన కుమారులు అర్ధా్దంతరంగా మృతిచెందడంతో వారి కుటుంబాల్లో పెను విషాదం నెలకొంది.  

కేకే.నగర్‌: కోవై జిల్లా పల్లడం సమీపంలో బీఏబీ కాలువలో కారు బోల్తాపడిన సంఘటనలో నలుగురు ఇంజినీర్లు కాలువలో మునిగి దుర్మరణం పాలయ్యారు. కోవై జిల్లా అత్తిపాలయంలో శోభనా ఇంజినీరింగ్‌ కన్సల్టింగ్‌ సంస్థ ఉంది. ఇందులో పని చేస్తున్న ఇంజినీర్లు,  ఆదివారం పర్యాటక యాత్రగా కొడైకెనాల్‌కు వెళ్లారు. 25 మంది ఒక బస్సులోను, ప్రదీప్‌(27), విజయన్‌(30), మారియప్పన్‌(32), సుధాకర్‌(25), అన్పలగన్‌(30) ఐదుగురు ఒక కారులో కొడైకెనాల్‌ వెళ్లారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విహారం పూర్తి చేసుకుని సాయంత్రం కోవైకు తిరుగు ప్రయాణం అయ్యారు. బస్సు వెనుకనే కారు ప్రయాణిస్తోంది. రాత్రి 8 గంటల సమయంలో పల్లడం సమీపంలో కల్లిపాలయం ప్రాంతంలో మలుపు తిరుగుతున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన గల బీఏబీ కాలువలో పడిపోయింది.

ఈ కాలువలో ఏడాది తర్వాత వారం రోజుల కిందట నీరు వదిలినట్టు తెలిసింది. కారులో ఉన్న ఐదుగురు యువకులు నీటిలో మునిగిపోయారు. వారి అరుపులు విని చుట్టు పక్కల వారు పరుగున వచ్చి కారులో ప్రాణాలకు పోరాడుతున్న అన్బళగన్‌ను రక్షించగలిగారు. ప్రదీప్, విజయన్, మారియప్పన్, సుధాకర్‌ నీటిలో మునిగి మృతి చెందారు. కామనాయగన్‌ పాలయం పోలీసులు, పల్లడం అగ్నిమాపకదళం సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని కారును వెలికి తీసే పనులలో నిమగ్నమయ్యారు. సుధాకర్‌ తప్ప మిగతా ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు. సుధాకర్‌ మృతదేహం కోసం కాలువలో గాలిస్తున్నారు. మృత దేహాలను పోస్టుమార్టం కోసం కోవై ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. విహార యాత్ర విషాదంగా మారి నలుగురు ప్రాణాలను బలి తీసుకున్న సంఘటన వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement