అగ్నికి ఆహుతి

Fire Accident In Saloon Shop Hyderabad - Sakshi

దీపావళి రోజున చోటుచేసుకున్న అగ్ని ప్రమాదాలు

కాలిబూడిదైన సామగ్రి.. భారీగా ఆస్తి నష్టం

బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 3లో రెండురోజుల క్రితం ప్రారంభమైన ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్‌ హబీబ్‌ జావెద్‌ సెలూన్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీపావళి పండగను పురస్కరించుకుని నిర్వాహకులు లక్ష్మీ పూజ నిర్వహించి దీపాలు వెలిగించి ఎప్పటిలాగే షట్టర్‌ను తాళాలు వేసి వెళ్లిపోయారు. బుధవారం సాయంత్రం దీపాలు సామగ్రికి అంటుకుని మంటలు చెలరేగాయి. సెలూన్‌లో మంటలను గమనించిన స్థానికులు ఫిలింనగర్‌ ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. రెండు ఫైరింజిన్లతో మంటలు ఆర్పారు. సెలూన్‌లో ఖరీ«దైన ఫర్నిచర్‌తో పాటు బ్యూటీ ఎక్విప్‌మెంట్స్‌ మంటల్లో కాలి బూడిదయినట్లు నిర్వాహకులు తెలిపారు. సెలూన్‌లో ఎలాంటి ఫైర్‌సేప్టీ పరికరాలు లేకపోవడాన్ని అ«ధికారులు గుర్తించారు. 

షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు..
బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 12లోని ఎమ్మెల్యే కాలనీకి వెళ్లే దారిలో ఏసీబీ కార్యాలయాన్ని ఆనుకుని ఉన్న వ్యాపారికి చెందిన కార్యాలయంలో మంగళవారం అర్ధరాత్రి షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఫర్నిచర్‌తో పాటు కంప్యూటర్లు, పత్రాలు, ఇతర సామగ్రి కాలిపోయాయి. మంటలను త్వరగా గుర్తించడంతో పైఫ్లోర్‌లో ఉన్న ఇంటికి ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు.   

రాకెట్‌ దూసుకు వచ్చి..     
బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 12లోని çకిమ్టీ కాలనీలోని ఫుడీస్‌ రెస్టారెంట్‌లో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో అగ్ని çప్రమాదం చోటు చేసుకుంది.  దీపావళి సందర్భంగా సమీపంలో స్థానికులు కాలుస్తున్న బాణసంచా ఎగిరివచ్చి మూడో అంతస్తులో ఉన్న కిటికీ నుంచి లోపకి పడింది.  దాంతో అక్కడున్న సోఫాలు, కర్టెన్లు ఇతర సామగ్రికి మంటలు అంటుకున్నాయి. ఈ సమయంలో రెస్టారెంట్‌ మూసి ఉండడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.రెస్టారెంట్‌లో నుంచి పొగలు వస్తున్న విషయాన్ని గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకుని మంటలు ఆర్పారు.
గోదాములో అగ్ని ప్రమాదం..

రూ.3 లక్షల ఆస్తినష్టం
రాంగోపాల్‌పేట్‌: హౌస్‌ కీపింగ్‌ మెటీరియల్‌ గోదాములో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం జరగడంతో సుమారు రూ.3లక్షల మేరకు ఆస్తినష్టం వాటిల్లింది. పోలీసుల కథనం ప్రకారం.. జజనరల్‌ బజార్‌కు చెందిన ఘన్‌శ్యామ్‌ అదే మంగ్నిరామ్స్‌ హోల్‌సేల్‌ హౌస్‌ కీపింగ్‌ మెటీరియల్‌ విక్రయాలు చేస్తుంటారు. ఆయనకు అదే ప్రాంతంలోసెల్లార్‌లో గోదాము ఉంది. అక్కడ సామగ్రి మొత్తం నిలువ చేస్తుంటారు. బుధవారం దీపావళి పూజ చేసిన అనంతరం రాత్రి గోదాములో ఒకవైపు  సామగ్రి అంటుకుంది. వెంటనే వాళ్లు ఆర్పేందుకు యత్నించిన మంటలు అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్‌ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను ఆర్పేందుకు యత్నించారు. టపాసుల నిప్పురవ్వలతోనే అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.  
ఇల్లు దగ్ధం..  తప్పిన ప్రాణాపాయం
నాంపల్లి: తారాజువ్వల నిప్పు రవ్వలు అంటుకోవడంతో ఓ ఇల్లు దగ్ధమైన ఘటన దీపావళి రోజున అర్థరాత్రి చోటుచేసుకుంది. నాంపల్లి ఇన్‌స్పెక్టర్‌ సుభాష్‌ చంద్రబోస్‌ తెలిపిన వివరాల ప్రకారం... నాంపల్లి రైల్వే పోలీసు స్టేషన్‌ సమీపంలో టిప్పుఖాన్‌ సరాయి మురికివాడలో జావెద్‌ నివాసం ఉంటున్నారు. అతడి ఇంటిపైకప్పుపై తారా జువ్వల నిప్పు పడింది. ఇది రాజుకుని గురువారం తెల్లవారు జామున మంటలు చెలరేగాయి. గాఢ నిద్రలో ఉన్న జావెద్‌ కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు. ప్రమాదంలో మేక, పది కోళ్లు మృతి చెందాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top