కరెంట్‌ షాక్‌తో రైతు, ఎడ్లు మృతి

Farmer, oxen deaths with current shock - Sakshi

మామడ(నిర్మల్‌): ఎడ్ల బండితో పంట చేనుకు వెళ్లి అదే బండిపై తిరిగి వస్తుండగా, ఇతర రైతులు పంటల రక్షణకు అమర్చిన విద్యుత్‌ తీగలు తగిలి కరెంట్‌ షాక్‌తో రైతుతో పాటు రెండు ఎడ్లు చనిపోయిన ఘటన నిర్మల్‌ జిల్లా మామడ మండలం అనంతపేట్‌లో సోమవారం జరిగింది. అనంతపేట్‌ గ్రామానికి చెందిన రైతు బొజ్జ గంగారాం(64) సోమవారం ఉదయం వ్యవసాయ పనుల కోసం తన ఎడ్లబండిపై వెళ్లాడు. వ్యవసాయ పనులు ముగించుకుని సాయంత్రం సమయంలో ఇంటికి బయల్దేరాడు.

అయితే, అడవి పందుల బారి నుంచి పంటలను రక్షించుకునేందుకు ఇతర రైతు విద్యుత్‌ తీగలు అమర్చాడు. ఈ క్రమంలో బొజ్జ గంగారాం వస్తున్న ఎడ్ల బండికి ఆ తీగలు తగలడంతో కరెంట్‌ షాక్‌ కొట్టింది. దీంతో రెండు ఎడ్లతో పాటు గంగారాం అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్యతో పాటు కూమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 

నలుగురు రైతుల ఆత్మహత్య 
సాక్షి నెట్‌వర్క్‌: పంట పోయిందన్న ఆవేదనతో నలుగురు రైతులు వేర్వేరుగా సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయికి చెందిన రైతు కందుల వెంకటేశ్వరరావు(58) నాలుగు ఎకరాల్లో పత్తి, నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశాడు. పత్తి పంట పూర్తిగా దెబ్బతినడం, వరి మెడవిరుపుతో చేతికందే పరిస్థితి లేకపోవడంతో రూ.3 లక్షల అప్పులు తీర్చడం ఎలా అని తీవ్ర మనోవేదనకు గురై సోమవారం పత్తి చేను వద్ద పురుగుల మందు తాగాడు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లికి చెందిన రైతు ఎర్మ బుచ్చయ్య(45) ఐదు ఎకరాల్లో పత్తి వేయగా, మొక్కల ఎదుగుదల లోపించింది. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవటంతో ఈ నెల 9న చేనులోనే పురుగుల మందు తాగాడు. ఆస్పత్రిలో సోమవారం మృతి చెందాడు.

నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలం ముషీర్‌నగర్‌ పరిధి మెట్టుమర్రి తండాకు చెందిన బాదావత్‌ రవీందర్‌(35) తనకున్న మూడు ఎకరాల భూమిలో వేసిన పంట వర్షాలు లేక ఎండిపోయింది. దీంతో రూ.3 లక్షల అప్పులు తీరే మార్గం కనిపించక ఆదివారం రాత్రి ఉరి వేసుకున్నాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం గుమ్లాపూర్‌కు చెందిన రైతు వన్నెల వెంకటేశ్‌(30) అప్పుల బాధతో ఆదివారం పురుగుల మందు తాగాడు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top