సెంట్రల్‌ జోన్‌ డీసీపీ పేరుతో నకిలీ ఈ–మెయిల్‌ | Fake Mails With DCP Name in Hyderabad | Sakshi
Sakshi News home page

సెంట్రల్‌ జోన్‌ డీసీపీ పేరుతో నకిలీ ఈ–మెయిల్‌

Feb 4 2019 11:25 AM | Updated on Feb 4 2019 11:25 AM

Fake Mails With DCP Name in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని మధ్య మండల డీసీపీ అధికారిక ఈ–మెయిల్‌ను పోలిన దానిని సృష్టించిన దుండగులు దానిని వినియోగించి అమెరికాలో ఉంటున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సంతోష్‌కుమార్‌కు బెదిరింపు మెయిల్‌ పంపారు. అతడి భార్య పేరుతో మరో మెయిల్‌ను క్రియేట్‌ చేసిన దుండగులు ఆమె పేరుతో ఈస్ట్‌జోన్‌ పోలీసులకు సంతోష్‌కుమార్‌పై ఫిర్యాదు చేస్తూ మరో మెయిల్‌ పంపారు. ఇటీవల భారత్‌కు వచ్చిన బాధితులు మధ్య మండల డీసీపీని సంప్రదించారు. ఆయన సూచనల మేరకు సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నగరంలోని చంపాపేట్‌ ప్రాంతానికి చెందిన సంతోష్‌కుమార్‌ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. గత ఏడాది మే నుంచి అతడికి కొందరు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వివిధ ఈ–మెయిల్స్‌ ద్వారా అసభ్య పదజాలంతో, మార్ఫింగ్‌ ఫోటోలతో కూడిన మెయిల్స్‌ వస్తున్నాయి. గత నెల 12న ఈ వ్యవహారం శృతిమించింది. హైదరాబాద్‌ కమిషనరేట్‌లోని మధ్య మండల డీసీపీ అధికారిక ఈ–మెయిల్‌ను పోలిన దానిని నేరగాళ్లు సృష్టించారు. డీసీపీ ఈ–మెయిల్‌ (dcp&cz.hyd.tspolice.gov.in) గా ఉంటుంది. అయితే దుండగులు రూపొందించింది (dcp&cz.hydpol.gov.inn@mail.com) గా ఉంది. దీనిని వినియోగించి సంతోష్‌కు ఈ–మెయిల్‌ పంపిన దుండగులు కేసు పేరుతో బెదిరించారు. తాము మధ్య మండల డీసీపీ ఎన్‌.విశ్వప్రసాద్‌ కార్యాలయం నుంచి ఈ మెయిల్‌ చేస్తున్నామని, మీపై సైబర్‌ క్రైమ్‌ ఒకటి నమోదైందని అందులో పేర్కొన్నారు. దర్యాప్తు కోసం మీ చిరునామా సహా పూర్తి వివరాలు అందించాలని కోరారు.

అంతటితో ఆగని దుండగులు ఈ నెల 8న సంతోష్‌కుమార్‌ భార్య కవిత పేరుతో మరో ఈ–మెయిల్‌ సృష్టించి, ఆమె పంపినట్లు తూర్పు మండల డీసీపీకి పంపారు.అందులో తనను సంతోష్‌ వేధిస్తున్నాడని, తాను గర్భవతినని సహా పలు ఆరోపణలు చేర్చారు. అమెరికాలో ఉన్న అత్తింటి వారు తనను బంధించడంతో పాటు డబ్బు కోసం వేధిస్తున్నారని అందులో పేర్కొన్నారు ఈ వ్యవహారాలు శృతి మించడంతో బాధితుడు సంతోష్‌కుమార్‌ ఇటీవల భారత్‌కు వచ్చాడు. గత నెల 21న మధ్య మండల డీసీపీ విశ్వప్రసాద్‌ను కలిసి అసలు విషయం ఆరా తీశాడు. ఆయన కేసులు, ఈ–మెయిల్స్‌ బూటకమని చెప్పడంతో పాటు ఈ విషయంపై సైబర్‌ క్రైమ్‌ అధికారులకు ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు. దీంతో బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ప్రాథమిక ఆధారాలను బట్టి నిందితులు సిటీకి చెందిన వారే అయి ఉంటారని భావిస్తున్నారు. సంతోష్‌తో ఉన్న వ్యక్తిగత గొడవల నేపథ్యంలోనే ఇలా చేసి ఉంటారని, అందుకే ముందుగా అభ్యంతరకరమైన మెయిల్‌ పంపిన వాళ్లు ఆపై సెంట్రల్‌ జోన్‌ డీసీపీ పేరుతో ఆయనకు... అతడి భార్య పేరుతో ఈస్ట్‌జోన్‌ డీసీపీకి మెయిల్‌ పంపారని తెలిపారు. సంతోష్‌తో ఎవరెవరికి వ్యక్తిగత స్పర్థలు ఉన్నాయి? వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అనే అంశాలను ఆరా తీస్తున్నారు. మరోపక్క సాంకేతికంగా దుండగులు వాడిన ఈ–మెయిల్స్‌ మూలాలను గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement