కారాగారాల్లో మౌలిక వసతులు

Facilities In Jails And Medical Staff - Sakshi

జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు సుష్మా సాహూ

మహిళా వైద్య సిబ్బంది ఏర్పాటుకు సిఫార్సు

నెల్లూరు(క్రైమ్‌): కారాగారాల్లో మౌలిక వసతుల కల్పన, మహిళా వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్లు జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు సుష్మా సాహూ పేర్కొన్నారు. వెంకటాచలం మండలం చెముడుగుంటలోని కేంద్రకారాగారాన్ని మంగళవారం సందర్శించారు. మహిళా ఖైదీల వార్డు, భోజనగది, హాస్పిటల్‌ను పరిశీలించి రిమాండ్, శిక్షను అనుభవిస్తున్న 19 మంది మహిళా ఖైదీలతో సమావేశమయ్యారు. జైలు మాన్యువల్‌ ప్రకారం వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నగరంలోని పినాకినీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర కారాగారాల్లో మహిళా ఖైదీలకు అందుతున్న సేవలు, మౌలిక వసతుల పరిశీలనలో భాగంగా కొంతకాలంగా వివిధ కారాగారాలను పరిశీలిస్తున్నామని చెప్పారు.

కారాగార వైద్యశాలలో మహిళా డాక్టర్‌తో పాటు మహిళా వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్లు చెప్పారు. మహిళా ఖైదీలకు వృత్తివిద్య కోర్సుల ఏర్పాటుకు కృషి చేస్తామని వెల్లడించారు. మహిళా ఖైదీలకు తెల్లని దుస్తులు ఇస్తున్నారని, వీరికి రంగు దుస్తులను ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నెల్లూరు కేంద్ర కారాగారంలో వసతులు బాగున్నాయని కొనియాడారు. కేంద్ర కారాగారాలను ఆదర్శ కారాగారాలుగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తామని, మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో పలు కేసులపై బుధవారం విచారించనున్నట్లు తెలిపారు. ఉదయం 11 నుంచి కార్యాలయంలో అందుబాటులో ఉంటామని, జాతీయ మహిళా కమిషన్‌కు వర్తించే కేసులను నేరుగా తమని సంప్రదించి పరిష్కరించుకోవాలని సూచించారు. మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపులు, దాడులు, తదితరాలపై కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యులు అనూరాధ, నెల్లూరు ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ అధికారి ప్రశాంతి, నెల్లూరు కేంద్ర కారాగార సూపరింటెండెంట్‌ రవికిరణ్, నెల్లూరు నగర డీఎస్పీ మురళీకృష్ణ,, జైలర్‌ కాంతరాజు, తదితరులు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top