కరెంటు తీగే.. యమపాశమైంది

Electric Shock To Man Dies Karimnagar - Sakshi

ఇల్లంతకుంట(మానకొండూర్‌): కరెంటు తీగ ఓ నిండుప్రాణం తీసింది. విద్యుత్‌షాక్‌తో సెస్‌ అసిస్టెంట్‌ హెల్పర్‌ మృతి చెందాడు. ఈ ఘటన ఇల్లంతకుంట మండలం గాలి పల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. గాలిపల్లికి చెందిన మిట్టపల్లి తిరుపతిరెడ్డి(35) గ్రామంలోనే అసిస్టెంట్‌ హెల్పర్‌గా పని చేస్తున్నా డు. గ్రామశివారులోని మధ్యమానేరు వరదకాల్వ సమీపం లోని ట్రాన్స్‌ఫార్మర్‌పై ఫ్యూజ్‌వైర్‌ పోయి ందని అక్కడి రైతులు కబురు పెట్టడంతో తిరుపతిరెడ్డి వెళ్లాడు.

ట్రాన్స్‌ఫార్మర్‌ బంద్‌ చేసి పైకి ఎక్కి ఫ్యూజ్‌వైర్‌ వేస్తుండగా మరోలైన్‌ నుంచి విద్యుత్‌ సరఫరా కావడంతో షాక్‌తగిలి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అక్కడే ఉన్న రైతులు గమనించి బతికే ఉన్నాడనుకుని ఇల్లంతకుంటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు చెప్పాడు. తిరుపతిరెడ్డి మృతి తో కుటుంబంలో విషాదం అలుముకుంది. మృతుడికి భార్య అఖిల, తల్లి లచ్చవ్వ, అక్క రాధ ఉన్నారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై చంద్రశేఖర్‌ పరిశీలించి కేసు నమోదు చేశారు.

మాకు దిక్కెవ్వరు కొడుకా..? 
‘ముసలి వయసులో కూడుపెట్టి బాగోగులు చూ స్తావనుకున్న కొడుకా, ఎవుసం చేయమంటే ఉద్యోగం చేస్తానని కరెంటు తీగలపైనే ప్రాణాలు తీసుకుంటివా కొడుకా. ముసలి అవ్వ, మూగ అక్కకు దిక్కెవరూ బిడ్డా అంటూ మృతుడి తల్లి లచ్చవ్వ, మాటలు రాని అక్క రాధ రోదనలు స్థానికులను కన్నీళ్లు పెట్టించాయి.

 
భార్య మూడు నెలల గర్భిణి 
తిరుపతిరెడ్డికి వేములవాడ మండలం చెక్కపల్లికి చెందిన అఖిలతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఆమె ప్ర స్తుతం మూడు నెలల గర్భిణి. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పడంతో తల్లిగారిం టి వద్దే ఉంటోంది. విషయం తెలిసి అత్తారింటికి చేరుకుని భర్త శవం చూసి బోరున విలపించింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top