‘పదేళ్ల’ దొంగల పని పట్టారు!

Cyberabad Police Arrest Kanjar Kerava Gang - Sakshi

కూకట్‌పల్లిలో పట్టుబడ్డ ‘కంజర్‌ కెర్వా’ముఠా

మూడున్నర కిలోల బంగారు నగలు స్వాధీనం, 12 కేసుల ఛేదన 

మధ్యప్రదేశ్‌లోని కంజర్‌ కెర్వాలో సైబరాబాద్‌ పోలీసుల రెక్కీ  

హైవేల్లో చోరీలు చేస్తూ తప్పించుకుంటున్న అంతర్రాష్ట్ర నేరగాళ్లు

సాక్షి, హైదరాబాద్‌: అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. దశాబ్దాకాలంగా జాతీయ రహదారుల్లోని డాబాలు, రెస్టారెంట్‌లు, హోటళ్ల వద్ద బస్సుల్లో చోరీలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న కంజర్‌ కెర్వా ముఠాకు చెందిన ఐదుగురిని సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. ముఠా నుంచి మూడున్నర కిలోల బంగారు ఆభరణాలు, మారుతీ స్విఫ్ట్‌ డిజైర్‌ కారు, పదునైన కత్తులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ గురువారం ఇక్కడ వెల్లడించారు.  

తోటి ప్రయాణికుల్లాగా వ్యవహరిస్తూ... 
మధ్యప్రదేశ్‌ రాష్ట్రం దార్‌ జిల్లా మన్వర్‌ తాలూకా కెర్వా జాగీర్‌ గ్రామానికి అనుకొని ఉన్న ముల్తానిపురకు చెందిన హైదర్‌ ఆలీ కాశమ్‌ ముల్తాని, సికిందర్‌ రజాక్, మోసిన్‌ ఖాన్, మహమ్మద్‌ తాయూబ్‌ ఖాన్, అఫ్సర్‌ ఖాన్‌లు ముఠాగా ఏర్పడ్డారు. ఏడు నెలల నుంచి హైదరాబాద్‌ ఔటర్‌రింగ్‌ రోడ్డు బయట హైవేల్లోని దాబాలు, హోటల్స్‌ వద్ద హాల్ట్‌ తీసుకున్న బస్సుల్లో చోరీలు చేస్తున్నారు. ప్రణాళిక ప్రకారం కారులో వచ్చేవారు. లక్ష్యంగా చేసుకున్న బస్సు నిలిపిన దాబాకు 200 మీటర్ల దూరంలో వాహనాన్ని నిలిపి కట్టింగ్‌ ప్లేయర్, కత్తులు, స్క్రూడ్రైవర్లను తీసుకొని సాధారణ ప్రయాణికుల్లాగానే బస్సు ఎక్కేవారు. ఆ సమయంలో చాలామంది ప్రయాణికులు చాయ్‌ తాగేందుకు, టిఫిన్, భోజనం చేసేందుకు బస్సు దిగి వెళ్లేవారు.

బస్సుల్లోని బ్యాగ్‌లను తెరిచి నగదు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులుంటే తీసుకెళ్లేవారు. ఇలా ఒక ట్రిప్పులో 4 చోరీల వరకు చేసి ఎవరికీ దొరక్కుండా ఉడాయించేవారు. సొత్తు పొగొట్టుకున్నవారి ఫిర్యాదు మేరకు బస్సులో ఉన్న వారందరినీ పోలీసులు తనిఖీ చేస్తే ఏమీ దొరికేది కాదు. అయితే, ఏడునెలలుగా ఈ తరహా చోరీలపై ఫిర్యాదులు ఎక్కువవుతుండటంతో నిగ్గు తేల్చేందుకు శంషాబాద్‌ ఎస్‌వోటీ బృందాన్ని బరిలోకి దింపారు.

పక్కా రెక్కీతో పట్టుకున్నారు..
ఈ తరహా చోరీల్లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఒకరిని అరెస్టు చేసినట్టుగా శంషాబాద్‌ ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌రెడ్డి నేతృత్వంలోని బృందానికి తెలిసింది. ఇండోర్‌ అధికారి ఇచ్చిన వివరాల మేరకు ఎస్‌వోటీ పోలీసులు ముల్తానిపురకు వెళ్లారు. ఆ గ్రామంలో 70 నుంచి 80 ఇళ్లు ఉండగా, అందులో 50 నుంచి 60 మందికి నేరచరిత్ర ఉన్నట్టు తెలుసుకున్నారు. వీరి ఇళ్లు రాజభవంతులను తలపించేలా కట్టుకోవడం పోలీసులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. కాశమ్‌ ముల్తాని రెండేళ్లుగా ఒక స్కూల్‌ నిర్వహిస్తున్నాడు. 2013లో నిందితులను పట్టుకునేందుకు ఈ గ్రామానికి వచ్చిన అనంతపురం జిల్లాకు చెందిన ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐ, కానిస్టేబుళ్లపై దాడి చేశారనే విషయం ఎస్‌వోటీ పోలీసులకు తెలిసింది.

ఈ నేపథ్యంలో గ్రామానికి సమీపంలోనే దాదాపు 25 రోజులపాటు ఉండి హైదరాబాద్‌ వెళ్లే వారి గురించి వాకబు చేశారు. 25 మంది వరకు వచ్చి వెళుతుంటారని తెలుసుకున్నారు. నెలరోజుల్లో 28 రోజులు ఇంట్లోనే ఉండి రెండు రోజులు చోరీలకు వెళుతుంటారని తెలుసుకున్నారు. అప్పటికే ఐదుగురు చోరీల కోసం హైదరాబాద్‌ బయలుదేరినట్టు గుర్తించారు. ఓఆర్‌ఆర్, కూకట్‌పల్లిలో ఎస్‌వోటీ పోలీసులు నిఘా ఉంచి ఐదుగురి నిందితులను పట్టుకున్నారు. వీరి అరెస్టుతో కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మియాపూర్, కోదాడ, నల్లగొండల్లో నమోదైన 12 కేసులను ఛేదించినట్లైంది. మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమిన్సల్‌ను పట్టుకున్న ఎస్‌వోటీ బృందాన్ని సీపీ సజ్జనార్‌ రివార్డులతో సన్మానించారు. ఈ గ్యాంగ్‌ వివరాలతో ఇతర రాష్ట్రాల డీజీపీలకు లేఖ రాస్తామని, అక్కడ కూడా ఇటువంటి చోరీలు ఏమైనా జరిగితే కేసు పరిష్కారానికి ఉపయోగపడతాయని సజ్జనార్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top