ఆ ఇద్దరికి సీట్లు ఇవ్వకపోతే దూకేస్తాం!

Congress Leaders Suicide Attempt For MLA Ticket Nalgonda - Sakshi

సాక్షి, తిరుమలగిరి (తుంగతుర్తి) : కాంగ్రెస్‌ పార్టీ తుంగతుర్తి అసెంబ్లీ అభ్యర్థిగా అద్దంకి దయాకర్, వడ్డెపల్లి రవిలకు టికెట్లు కేటాయించాలని పోటాపోటీగా అభిమానులు సెల్‌ టవర్లు ఎక్కి గురువారం నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగారం మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన మొల్కపురి శ్రీకాంత్‌ తుంగతుర్తి అసెంబ్లీ టికెట్‌ను కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌కు ఇవ్వాలని సూర్యాపేట, జనగామ ప్రధాన రహదారి ఫాతిమా స్కూల్‌ పక్కనే ఉన్న సెల్‌ టవర్‌ ఎక్కి మూడు గంటల పాటు హల్‌చల్‌ సృష్టించాడు. స్థానిక పోలీసులు సెల్‌ టవర్‌ను దిగాలని ఎంత సముదాయించినా దిగక పోవడంతో స్థానికులు ఆందోళన పడ్డారు. ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌ సెల్‌ఫోన్‌లో మాట్లాడి టికెట్‌ తనకే వస్తుందని తెలపడంతో టవర్‌ దిగాడు. శ్రీకాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

వడ్డెపల్లి రవికే టికెట్‌ ఇవ్వాలని..
తుంగతుర్తి అసెంబ్లీ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా వడ్డెపల్లి రవికి ఇవ్వాలని మండల కేంద్రానికి చెందిన ఎనుగుల కొమురమల్లు, విజయ్‌లు స్థానిక బీసీ కాలనీలో ఉన్న సెల్‌టవర్‌ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదిష్టానం వెంటనే తుంగతుర్తి అసెంబ్లీ టికెట్‌ను వడ్డెపల్లి రవికి కేటాయించాలని డిమాండ్‌ చేశారు. వీరికి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, సర్వోత్తమ్‌రెడ్డిలు ఫోన్‌లో మాట్లాడి టికెట్‌ రవికే వస్తుందని తెలపడంతో సెల్‌ టవర్‌ దిగారు. పోటాపోటీగా సెల్‌టవర్‌ ఎక్కి కాంగ్రెస్‌ అభిమానులు నిరసన వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది.

అద్దంకి దయాకర్‌కు టికెట్‌ ఇవ్వాలని..
మోత్కూరు (తుంగతుర్తి) : తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా అద్దంకి దయాకర్‌కు ఇవ్వాలని కోరుతూ గురువారం సాయంత్రం మోత్కూరు మండలం అనాజిపురం గ్రామంలోని ఇద్దరు యువకులు సెల్‌టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశారు. అంతటి ఉపేందర్, బొర్ర నాగార్జున అనే యువకులు సెల్‌టవర్‌ ఎక్కి అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని నినాదాలుచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
 
సెల్‌టవర్‌ ఎక్కిన వారిపై కేసు
తిరుమలగిరి మండల కేంద్రంలో ముగ్గురు మర్రికుంట తండాలో ఒక్కరు అద్దంకి దయాకర్, వడ్డేపల్లి రవిలకు తుంగతుర్తి అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని సెల్‌ఫోన్‌ టవర్లు ఎక్కి నిరసన తెలిపిన నలుగురిపై కేసులు నమోదు చేసినట్లు నాగారం సీఐ రవీందర్‌ తెలిపారు. నలుగురిని తిరుమలగిరి తహసీల్దార్‌ ముందు బైండోవర్‌ చేసినట్లు తెలిపారు. ఆరోనెలల్లోపు ఎలాంటి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన వెంట ఎస్‌ఐ బి.డానియేల్‌ ఉన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top