భారీ మొత్తంలో డబ్బు పోగొట్టుకున్న ఎంపీ!

CM Amarinder Singh Wife Lost 23 Lakhs After Attend Phone Cal - Sakshi

చండీగఢ్‌ : అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేటి డిజిటల్‌ యుగంలో ఆన్‌లైన్‌ మోసాలు పెచ్చుమీరుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ప్రతీ ఒక్కరూ సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు. తాజాగా పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ భార్య, ఎంపీ ప్రణీత్‌ కౌర్‌ కూడా ఈ జాబితాలో చేరిపోయారు. బ్యాంకు మేనేజర్‌ పేరిట వచ్చిన కాల్‌ కారణంగా 23 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. ఈ క్రమంలో ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. 

వివరాలు.. పార్లమెంటు సమావేశాలకు వెళ్తున్న సమయంలో కాంగ్రెస్‌ ఎంపీ ప్రణీత్‌ కౌర్‌కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేశాడు. తాను బ్యాంకు మేనేజర్‌ను అని, ఎంపీ జీతం డిపాజిట్‌ చేసే అకౌంట్‌ అప్‌డేట్‌ కోసమే కాల్‌ చేసినట్లు చెప్పాడు. ఈ మేరకు అకౌంట్‌ నంబరు, ఏటీఎం పిన్‌ నంబరు, సీవీసీ నంబరు తదితర వివరాలు ఇవ్వాల్సిందిగా కోరాడు. అతడి మాటలు నమ్మిన ప్రణీత్‌ కౌర్‌ వివరాలతో సహా ఓటీపీ కూడా చెప్పారు. ఈ క్రమంలో కొన్ని నిమిషాల తర్వాత ఆమె అకౌంట్‌ నుంచి 23 లక్షల రూపాయలు డ్రా అయినట్లు మెసేజ్‌ వచ్చింది. తాను మోసపోయినట్లుగా గుర్తించిన ప్రణీత్‌ కౌర్‌ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జార్ఖండ్‌కు చెందిన వ్యక్తిని నిందితుడిగా గుర్తించారు. అక్కడే అతడిని అరెస్టు చేసి పంజాబ్‌ తీసుకువస్తున్నట్లు వెల్లడించారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top